ఆపరేషన్ థియెటర్ బయటవున్న ఎర్ర లైటు ఆరిపోయింది. చేతులు తుడుచుకొంటూ బైటకొచ్చిన డా. ఆంజనేయులు దగ్గరకు పరుగెత్తివచ్చాడు రామం.
“డాక్టర్! మా లక్ష్మణరావు ఎలా ఉన్నాడు? వాడి గుండెలో ఏమైనా…??”
“చాలానే ఉన్నాయి. రండి చూపిస్తాను!” అని లోనికి తీసుకెళ్ళాడు డా. ఆంజనేయులు.
లోపల టేబుల్ పైనున్న ట్రేలో నాలుగు రైళ్ళు, కొన్ని బరువులు, లెక్కలేనన్ని ముళ్ళు ఉన్నాయి. ’కలుక్కు, కలుక్కు” మంటున్న చప్పుడు కూడా.
“హే రామ్!” అన్నాడు రామం.
తన్మయత్వంతో కళ్ళు మూసుకొన్నాడు డా. ఆంజనేయులు.
“ఇప్పుడు ప్రమాదమేమీ లేదు కదా?” అన్నాడు రామం.
“డాక్టర్ బావా నాయుడు గారిని పిలిపిస్తున్నాం” అన్నాడు డా. ఆంజనేయులు.
“ఆయనెవరు? ఏం చేస్తారు?” – ఆదుర్దాగా ప్రశ్నించాడు రామం.
“ఆయన ప్రముఖ గొంతు సర్జన్!”
“ఇప్పుడు ఆయనెందుకు? మావాడిది గుండె సమస్య కదా?” అని అనుమానంగా అడిగాడు రామం.
“గుండె గొంతుకలోన కొట్టుకొంటున్నాది…మీ తమ్ముడికి” అన్నాడు డా. ఆంజనేయులు.
“చావు కబురు చల్లగా చెప్పేవాడే డాక్టర్” అని అనుకొన్నాడు రామం.
ఇద్దరు కవి కుమారుల కలభాషణం:-
“ఏమిటా భుగభుగలు, ధగధగలు?”
“సిరిమువ్వలకు సాన పెడుతున్నారెవరో!”
“తిలకం గారి పిల్లలేరీ?”
“వెన్నెల్లో ఆడుకొంటున్నారు!”
“శశిరేఖ అడవిని వొదిలేసిందంటగా?”
“కిన్నెరసాని సత్యనారాయణ వ్రతం మానేసింది మరి!”
“వెంకటాచలానికి, అరుణాచలానికి మధ్యన ఏముంది?”
“మైదానం!”
ఒక కవి, ఒక విమర్శకుడు, ఒక పాఠకుడు:-
కవి: “నేను కవితను రాచినాను”
విమర్శకుడు: “ఐతే రంపాన పట్టాలి. ఇలాతే”
పాఠకుడు: “బాబ్బాబూ! పొట్టు మీద వెయ్యకండి. పుణ్యముంటుంది!”
కొంతమందు కవులు చిత్రకళా ప్రదర్శనకు వెళ్ళారు. అక్కడొక సుందరి తైలవర్ణచిత్రాన్ని చూసి:
మొదటి కవి: ఈ చిత్రమొక అలికుళవేణిది. ఆమె ధరించెను గౌను. నేనామెకు ఫ్యాను
రెండో కవి: ఈమె ఒక సహజ సుందర సౌందర్యం. ఈమెలోకే నా పయనం
మూడో కవి: ఆ నీలికళ్ళలో మునకెయ్యాల్సిందే
నాలుగో కవి “ఆ మునక లోతెంతో?”
చివరి కవి: ఏమిటా పైత్య ప్రకోపం? క్యూలో చాలామందున్నారు!