ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మీరు నమ్మలేని ఆరు వెర్రి యాదృచ్ఛికాలు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

6. ఎడ్గార్ అలాన్ పో భయానకమైన భవిష్యవాణి

భావి హారర్ పితగా పేరుపొందబోయే ఎడ్గార్ అలాన్ పో 1838లో “ది నెరేటివ్ ఆఫ్ ఆర్థర్ గోర్డాన్ పిమ్ ఆఫ్ నంటుకెట్” అన్న పేరుతో ఓ పుస్తకాన్ని అచ్చువేసాడు. ఇదో పెద్ద ఫెల్యూర్. “ఇది చాలా సిల్లీ పుస్తక”మని తన విమర్శకుల తిట్లని ’పో’ కూడా ఒప్పుకొనేసేంతగా విఫలమైందీ పుస్తకం.

ఇందులో నమ్మలేని భయంకరమైన విషయమేదని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు చదవబోతున్నరు…

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>

ఈ నవలలో ఓ సన్నివేశమొస్తుంది. అందులో సముద్రంలో మునిగిపోయిన ఓడలో చావగా మిగిలిన ఐదుమందిలో నలుగురు కలిసి ఓ కేబిన్ బాయ్ ను చంపి తినేసి వాళ్ళ ఆకలిని తీర్చుకొంటారు. ఆ చంపబడే యువకుడి పాత్ర పేరు “రిచర్డ్ పార్కర్” (కన్పూజ్ కాకండి. మన స్పైడర్ మాన్ పేరు పీటర్ పార్కర్).

ఈ నవల ప్రచురించబడ్డ నలభై ఎనిదేళ్ళకు మిగ్నోనెట్ అనబడే ఓడ ఒకటి మునిగిపోయింది. అందులో చావగా మిగిలినవాళ్ళు కేబిన్ క్రూ లో ఒకడైన యువకుణ్ణి చంపి తినేసారు. ఆపై అదో గొప్ప సంచలనాత్మకమైన కోర్ట్ కేసుగా ప్రసిద్ధిచెందిది.

ఇప్పుడు కొంచెం భయంకరంగా అనిపిస్తోంది కదూ! ఇప్పుడు అసలైన భయానక విషయం వినండి. ఆ చచ్చిపోయిన కుర్రాడి పేరు “రిచర్డ్ పార్కర్”.

ఈ అసాధారణమైన పోలికను రిచర్డ్ పార్కర్ దూరబంధువైన నిగెల్ పార్కర్ అనే అతను కనుకొని నివ్వెరపోయాడు.

 

5. “టైటానిక్” గురించి మోర్గాన్ రాబర్ట్ సన్ రాసాడు!

జేమ్స్ కామెరాన్ ఆస్కార్ అవార్డుల పంటను పండించడానికి ఒక వందేళ్ళ ముందే మోర్గాన్ రాబర్ట్‍సన్ అనే రచయిత వెర్రిపుచ్చకాయ టైపు పుస్తకాన్ని రాసాడు – ’ఫ్యుటిలిటీ, ఆర్ ద రెక్ ఆఫ్ ది టైటాన్” అన్న పేరుతో. ఈ కథంతా మునిగిపోలేని ఓడ ఒకటి మునిగిపోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ చూస్తే ముక్కున 

వేలేసుకోవాలి. ’టైటానిక్’ సినిమాలో ఓడ మునిగేప్పుడు చూపించే దృశ్యాన్నే ఆ కవర్ పేజ్ మీదా చూడొచ్చు. టైటానిక్ షిప్ మునిగిపోయాక దాని మునక ఆధారంగా పదమూడు సినిమాలొచ్చాయి, కామెరాన్ సినిమా కాక .

ఇవన్నీ కామెరాన్ సినిమా కంటే కూడా పాతవి. వీళ్ళందరికన్నా ముందుగా మొదటివరసలో ఉండాలన్న తపనో ఏమో రాబర్ట్ సన్ పుస్తకమే ఈ మునకపై వచ్చిన మొట్టమొదటి కథ. అసలు రాబర్ట్ సన్  తొందరపాటు ఎంతవుందంటే అతను టైటానిక్ తయారై, మునిగిపోయేంత వరకు కూడా ఆగలేకపోయాడు.

టైటానిక్ ఓడ 1912లో మునిగిపోయింది. కానీ రాబర్ట్‍సన్ 1898లోనే అంటే పద్నాలుగేళ్ళ ముందుగానే పుస్తకం రాసేసాడు. విచిత్రాలు ఇక్కడితో ఆగలేదు. ’టైటాన్’ ఓడను రాబర్ట్ సన్ ఎలా వర్ణించాడో, ’టైటానిక్’ నిర్మాతలు కూడా తమ ఓడని సరిగ్గా అలానే నిర్మించారు. బహుశా వాళ్ళు రాబర్ట్ సన్ పుస్తకాన్ని చదివి ఇన్ప్సైర్ అయ్యారేమో అన్నంత సరిగ్గా కుదిరాయి పోలికలు.

విచిత్రాలు ఇక్కడితో కూడా ఆగవు. ’800 అడుగు” పొడవుతో, ’ఖరీదైన హోటల్’ లాంటి, ’అతిపెద్దదైన ఓడ”, నవంబర్ నెలలో ఒక రాత్రి, న్యూఫౌండ్‍ల్యాండ్ కు 400మైళ్ళ దూరంలో ఒక మంచుశకలాన్ని ఢీ కొట్టి మునిపోయిందని రాబర్ట్‍సన్ తన కథలో చెప్పినట్టుగానే ’టైటానిక్’ కూడా 800 అడుగుల పొడవుండి, తేలే ఖరీదైన హోటల్లా మెరుస్తూ, నవంబర్ నెలలో, ఒక రాత్రివేళ, న్యూఫౌండ్‍ల్యాండ్ కు 400మైళ్ళ దూరంలో ఐస్‍బర్గ్ ను ఢీకొట్టి మునిగిపోయింది. ఇంతా చెప్పిన రాబర్ట్‍సన్ ఒక్క విషయం పట్ల తప్పులో పెన్ను వేసాడు. అదేమిటంటే మంచుశకలాన్ని ఢీకొట్టినప్పుడు తన ’టైటాన్’ షిప్పు 25 నాటికల్ మైల్స్ వేగంతో వెళ్తున్నట్టు రాసాడు. కానీ ’టైటానిక్’ ఐస్‍బర్గ్ ను ఢీకొట్టినప్పుడు దాని స్పీడ్ 22.5 నాట్స్ మాత్రమే. ఛస్! మరీ ఇంతనా! అనికొంటున్నారు కదా. ఆగండి…చివరి విచిత్రాన్ని కూడా చదివేసి ఆపై ఏమైనా అనేసుకోండి.

’టైటానిక్’ మునిగిపోయిందని తెలియగానే ఇంకా బతికేవున్న రాబర్ట్ సన్ తన పుస్తకాన్ని మరోసారి అచ్చువేసాడు. “చూశారా! నేనెప్పుడో రాసేసా”నని చెప్పుకోవడానికి. అఫ్‍కోర్స్, అప్పుడు కూడా అది అంతంత మాత్రంగానే అమ్ముడుపోయింటుందనుకోండి!

4. ముంగిలిలో మొదలై పార్లర్‍లో ముగిసిన అమెరికా అంతర్యుద్ధం

1861లో అమెరికా సివిల్ వార్ మొదలైనప్పుడు వర్జినియా రాష్ట్రంలో టోకు వ్యాపారిగా బ్రతుకునీడుస్తున్న విల్మర్ మెక్‍లీన్ నలభై ఏడేళ్ళవాడు. వాషింగ్టన్ డి.సి. కు రిచ్‍మండ్‍ పట్టణానికి మధ్యనుండే మట్టిగొట్టుకుపోయిన ఒక రోడ్డు పక్కనే చక్కనైన భవంతిలో నివసించేవాడు. అమెరికా అంతర్యుద్ధానికి తొలిమెట్టైన ’బుల్ రన్ యుద్ధం’ అబ్రహం లింకన్ నేతృత్వంలోని కూటమి సైన్యానికి, వారి వ్యతిరేకులైన కాన్ఫెడరసీ దళాలకు మధ్య విల్మర్ మెక్‍లీన్ సొంతూరైన ’మనసాస్’ కు దగ్గర్లోనే మొదలైంది.

కాన్ఫెడరసీ దళాధిపతైన జనరల్ బ్యుయెర్‍గార్డ్‍కు ఒక ఆఫీసు కావల్సివచ్చినప్పుడు అతని కళ్ళు విల్మర్ ఉంటున్న భవంతి పైన పడ్డాయి. వెంటనే అందులోకి షిప్టై పోయాడు. కానీ అతని వెనకాలనే యూనియన్ దళాల ఫిరంగి గుళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ ఇంట్లో పడడం మొదలెట్టాయి. దాంతో విల్మర్ ఆ భవంతిని ఎంతో ఒకంతు అమ్మేసుకొని బ్రతుకుజీవుడాని భార్యాబిడ్డల్తో సహా పారిపోయి అదే వర్జీనియా రాష్ట్రంలో ఉన్న అప్పోమటాక్స్ కోర్ట్ హౌస్ అనబడే ఓ నో-మ్యాన్-ల్యాండ్ లాంటి ఊరికి వచ్చి చేరాడు. అక్కడే ఒక చిన్న భవనాన్ని కొనుక్కొని ఉండసాగాడు.

ఈలోపున లింకన్ గారి సేనాధిపతి ఐన జనరల్ రాబర్ట్ లీ దొరగారు జనరల్ బ్యుయెర్‍గార్డ్ గారి కాన్ఫెడరసీ దళాల దుంపల్ని తెంచుకొంటూ, తరుముకొంటూ రాసాగాడు. బ్యుయెర్‍గార్డ్ మరియు అతని చావుదప్పి కన్నులొట్టబోయిన సైనికులూ తప్పించుకొని పారిపోతూ…పోతూ…పోతూ అప్పొమటాక్స్ కోర్ట్ హౌస్ కు వచ్చేసారు. ఇదే ఊర్లోనే జనరల్ బ్యుయెర్‍గార్డ్ గారు తన ఓటమి అంగీకరిస్తూ జనరల్ రాబర్ట్ లీకి లొంగిపోయారు. ఆ లొంగిపోయే ఉత్సవం మన విల్మర్ మెక్‍లీన్ అయ్యగారి ఇంట్లోని ఫ్రంట్ పార్లర్‍లో జరిగింది.

ఇది చూసిన మెక్‍లీన్ మహాశయుడు “అమెరికా అంతర్యుద్ధం నా ముంగిట్లో మొదలై, పార్లర్లో ముగిసిందా!” అని పులకింతల్తో కన్నీళ్ళు పెట్టేసుకొన్నాట్ట!

3. ఓహియో నిండుగా వ్యోమగాములే!

“ఓహియో ప్రత్యేకత ఏమిటటా….ఆహా…అడుగుతున్నానని ఇదైపోకు!” అని అనేసుకొంటున్నారా! ఐతే కాస్త గుండెల్ని చిక్కబట్టుకొండి.

1903లో తొలి విమానాన్ని గాల్లోకి ఎగిరించిన ఆర్విల్ & విల్బర్ అనబడే రైట్ సోదరులు ఓహియనులే. అదో పన్నెండు సెంకడ్ల పాటు ఎగిరిన చిన్నపాటి ప్రయోగం. కానీ ఆ ఎగురుడుకి రైట్ సోదరులు ఉత్తర కరొలినాలోని బీచుల్లోకి వచ్చి 

పడ్డారు. ఆ పడ్డం పడ్డమే విమానయాన పరిశ్రమకు మేలుకొలుపైంది.

సరే! ఇంతటితోనే ఓహిహో గొప్పదైపోయిందా? అంటే ఇది వినండి.

రైట్ సోదరులు గాల్లోకెగిరిన యాభై తొమ్మిదేళ్ళ తర్వాత అప్పటి అమెరికా ప్రభుత్వం ప్రజల్ని రోదసీలోకి విసిరేసే ప్రోగ్రాం పెట్టుకొందని విన్న ఒక వ్యక్తి నాసా వాళ్ళ దగ్గరికొచ్చి “నన్ను కుదేయండి!” అని అడిగాడు. కాలేజీ మెట్లు కూడా ఎక్కలేని అతన్ని నాసాయులు ఎగాదిగా చూసారు. పెదవి విరిచారు. ఐనా తర్వాత సెలెక్ట్ చేసేసుకొన్నారు. ఆ వ్యక్తి పేరు జాన్ గ్లెన్. రోదసీ కక్ష్యలోకి (orbit) వెళ్ళిన మొట్టమొదటి అమెరికన్. ఇంతకూ ఈ అనర్హుణ్ణి నాసా ఎందుకు ఎన్నుకొందనుకున్నారు? గ్లెన్ గారు ఓహియను కాబట్టి.

“అంటే ఆకాశంలోను వారే మొదలు, రోదసిలోనూ వారే మొదలు!” అని గొణుక్కొంటున్నారు కదూ!

గ్లెన్ పై కక్ష్యలోకి వెళ్ళొచ్చిన ఏడేళ్ళకి అప్పటి అధ్యక్షుడైన జాన్ ఎఫ్. కెన్నడీ “ఈసారి ఎవరో ఒక అమెరికన్నును చందమామ మీదకు కుదేయ్యా”లని ఆజ్ఞాపించాడు. అప్పుడు ముందుకొచ్చి చందమామ మీద చేరిన నీల్ ఆర్మ్‍స్ట్రాంగ్…..ఎందుకండీ…ఇంకా చెప్పాలా!

అవును ఇతను కూడా ఓహియనే!

“ఆకాశం, రోదసీ, చంద్రుడు – ఓహియో, ఓహియో, ఓహియో”

ఆ ముగ్గురితో ఆగకుండా మొత్తానికి ఇరవైరెండుమంది వ్యోమగాముల్ని పుట్టించిన పుణ్యభూమి ఈ ఓహియో.

భయానక విచిత్రాలేవీ లేకుండానే ఈ స్టోరీ ముగిసిపోతోందని సంతోషిస్తున్నారా? ఆగండి.

తృటిలో ప్రమాదాన్ని తప్పించుకొన్న అపోలో-13 మిషన్ కు నాయకుడైన జిమ్ లోవెల్ కూడా ఓహియనే!

ఓహ్…మాన్!

2. అమెరికా యొక్క పిచ్చ లక్

రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన ’మిడ్‍వే యుద్ధం’ ప్రపంచంలో జరిగిన నౌకాయుద్ధాల్లోకెల్లా గొప్ప యుద్ధమని పేరు పొందింది. ఈ యుద్ధం మొదట్లో అమెరికా వాళ్ళు మన బిజినెస్‍మాన్ మహేశ్‍ ఊతపదంలా “బీప్” పోసుకొన్నారు.

జూన్ 4, 1942 పొద్దున మొదలైన ఈ యుద్ధంలో జపాన్ వారి విషయాలన్నీ తమ పాకెట్లలోనే ఉంచుకొన్నా ఎందుకో అమెరికన్ నౌకలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. జపాన్ వైపుకెళ్ళిన ఏ అమెరికన్ యుద్ధవిమానం తిరిగిరాలేదు. పోనీలే వెళ్ళాక కొద్దిగానైన పొడిచి మరీ చచ్చాయా అంటే, అదీ లేదు. ఇదెలాగుంటుందంటే స్టార్‍వార్స్ సినిమాలో చూపించే బ్యాటిల్ ఆఫ్ ఎండోర్ లో రెబెల్ ఫ్లీట్ వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళి డెత్ స్టార్ యొక్క డిఫ్లెక్టర్ షీల్డ్ ను గుద్దుకు చచ్చినట్టుగా ఉంటుంది.

సరే, ఇందులో “బీప్” సీనేముంది?

అలా తిరిగిరాలేని లోకం…అదేనండీ….జపాన్ వైపుగా వెళ్ళిన అమెరికన్ యుద్ధవిమాన దళాల్లో ఒక దళం ఆకాశంలో దారి తప్పేసింది. లెఫ్టినెంట్ కమాండర్ సి. వేడ్ మెక్‍క్లస్కీ జూనియర్ అనే అతని నాయకత్వంలోని ఆ దళం “దిక్కు దొరకని పక్షుల్లా” గాల్లోనే తేలుతూ పోసాగారు.

కింద నీళ్ళు, పైన గాలి తప్పించి వారికి దారి, తెన్ను లేకుండా పోయింది. అలా పోతూ పోతూ ఉండగా…. మెక్‍క్లస్కీ గారి కళ్ళకు అల్లంత దూరంలో ఉదయిస్తున్న సూర్యుడు కనబడ్డాడు. “ఇదేమిటి? సూర్యుడిలా తెల్లటి గుడ్డ మీద రెపరెపలాడుతున్నాడు!” అని ఆశ్చర్యపోతూ మళ్ళీ చూసిన మెక్‍క్లస్కీ అయ్యగారికి అసలు విషయం అర్థమైంది. అది ఒకానొక జపాన్ యుద్ధనౌక మీద ఎగురుతున్న జపాన్ జెండా అని. “బ్లడీ హెల్!” అని అనేసుకొన్న మెక్‍క్లస్కీ తన తోటి ఫైటర్ పైలెట్లకు విజిల్ వేసి విషయం చెప్పాడు. అంతే….మరో కొద్ది నిముషాల్లో అక్కడున్న మూడు జపాన్ యుద్ధనౌకలు తమ సిబ్బంది, విమానాల్తో సహా మునిగిపోయాయి.

అబ్బో….భయంకరమే సుమా! కానీ ఇదెమంత ఎఫెక్టివ్‍గా లేదనుకొంటున్నారా? సరే ఈ కాస్తా కూడా చదివేయండి.

అమెరికన్ యుద్ధనౌకల్ని, విమానాల్ని రాచిరంపాన పెట్టిన జపాన్ యుద్ధవిమానాలు మెక్‍క్లస్కీ దళం దాడి చేయడానికి కొద్ది నిముషాల ముందే తిరిగివచ్చాయి. వాటిల్లోకి మిస్సైల్స్నును, తుపాకీ గుళ్ళను నింపుతున్న సమయానికి సరిగ్గా ఈ దారితప్పిన అమెరికా పక్షులు అక్కడకొచ్చాయి. జపాన్ విమానాలే గనక సిద్ధంగా వుండుంటే, కథ వేరుగా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం.

“వాటే బ్లడీ ఫ్రీకింగ్ లక్” అని మీకిప్పుడనిపిస్తోంది కదూ!

1. జులై నాలుగో తారీకు శాపం

జులై 4, వస్తే చాలు అమెరికా మొత్తం బాణాసంచాతో పేలిపోతుంది. ఎందుకంటే 1776, జులై 4న అమెరికా దేశం పుట్టుకొచ్చింది. అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్, జులై 4 న చనిపోయాడు. పోతూ పోతు “థామస్ జెఫర్సన్ మిగలాలి” అని గొణిగాడట. ఆడమ్స్ తర్వాత అధ్యక్షుడైన జెఫర్సన్ కూడా జులై 4 నే చనిపోయాడు. ఆవిధంగా అమెరికా తొలి ముగ్గురు అధ్యక్షుల్లో ఇద్దరు అధ్యక్షులు ఇండిపెండెన్స్ డే నాడే పోయారు.

ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలనుకొన్నాడా యేమో, అమెరికా ఐదవ అధ్యక్షుడైన్ జేమ్స్ మన్రో 1831, జులై 4 చనిపోయాడు. అంటే మొదటి ఐదుగురు అధ్యక్షుల్లో ముగ్గురు ఇండిపెండెన్స్ డే ను జరుపుకొంటూనో, జరుపుకోబోతూనో చనిపోయారన్నమాట.

ఈ భీభత్సం ఇక్కడితో ఆగలేదు.

అమెరికా సివిల్ వార్ లో అత్యంత ఘోరమైన యుద్ధంగా చెప్పబడేది గెట్టిస్‍బర్గ్ యుద్ధం. 1863 జులై 1 మొదలైన ఈ యుద్ధంలో 1,65,620 మంది సైనికులు పాల్గింటే వారిలో  దాదాపు 46,200 పైగా సైనికులు చనిపోవడమో, గాయపడ్డమో, తప్పిపోవడమో జరిగింది. ఈ భీకర నరమేధం ముగిసింది జులై 4నే!

చివరకు అమెరికా అంతర్యుద్ధానికి మంగళం పాడడానికి బీజం వేసిన విక్స్ బర్గ్ యుద్ధం కూడా జులై 4నే ముగిసింది.

ఇలా భీభత్సరసప్రధానమైన జులై 4ను అమెరికా హోల్ మొత్తం ’ఢూమ్ ఢామ్‍’ గా జరుపుకొంటుందీ అంటే జరుపుకోవద్దూ!

ఐతే ఇప్పటికీ విక్స్ బర్గ్ వాసులు జులై నాలుగు వస్తోందంటే చాలు “గలే మే ఖిచ్ ఖిచ్…గలేమే ఖిచ్ ఖిచ్” అని అంటూంటార్ట. అందుక్కారణం అంతర్యుద్ధంలో వాళ్ళు ఓడిపోవడం వల్ల కాదుట. జులై నాలుగున అధ్యక్షుడు గారు బాల్చీ తన్నేసిన వార్త వినాల్సివస్తుందేమోననిట!

  

ఈ ఆరుకు ఆరూ నిజాలు నిజంగా వెర్రోహమే కదా!

{Content & Image Source: Cracked.com}