ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సచిన్ OC – మరో పేచీ!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమస్తే గురు”

“వెర్రోహం శిష్యా! ప్రభుత్వేన నియోజితేన సమస్త నిబంధనాని బలవాన్ తుంగేన త్రొక్కతి…”

“గురూ! అనగా…ప్రభుత్వం తెచ్చే రూల్సన్నీ తుంగలో తొక్కబడేవేననా…మీ అర్థం?”

“అహో శిష్యా! నీ తెలుగు బుర్రకు దేవభాష కూడా తెలిసివస్తోంది. వృద్ధిలోకి రాగలవురా!”

“మహాగురో! నేను అడగదల్చుకున్న విషయానికి సరిగ్గా సరిపోయేలా మీరూ ఆ సంస్కృత శ్లోకాన్ని ఉదహరించారు. మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందేసారు.”

“ఈ పరస్పర పొగడ్తల్ని ఆపేద్దామా శిష్యా?”

“అవశ్యం గురూ! పాయంటులోకి వచ్చేస్తా. శ్రీమాన్ సచిన్ టెండూల్కర్ గారు మొన్న కొత్త ఇంటిలోకి చేరారట. బట్, వితౌట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్. సదరు శ్రీమానుడిపై అపరాధ రుసుం విధిస్తామని మునిసిపల్ కమిషనర్ గారు ఛాతీ చరుచుకొని చెబితే, ఆ రుసుంను మాఫీ చేయాలని మంత్రిగారు హుకుమ్ జారీ చేసారు. ఎందుకయ్యా అంటే సచినుడు భారతదేశం పేరును అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగించినాడు కావున అని వాకృచ్చారు. దీని పై మీ టీకాతాత్పర్యం చెబితే ధనుణ్ణౌతాను గురూ!”

“సంస్కృత శ్లోకాన్నే అర్థం చేసుకొన్నవాడివి ఇంత సింపుల్ విషయానికి నా వివరణ ఎందుకు శిష్యా?”

“గురూ! మీరు కర్కాటక, మర్కట, హస్తిమసకాది గుహ్య, టక్కుటమార భాషల్లో ఆరితేరిన పదశూరులు. వాక్యవీరులు. వ్యుత్పత్తి, సంధి, విగ్రహ ధురీణులు….’

“మరింక ఆపుతావా శిష్యా!”

“ఆపలేను గురూ! మీరు వివరణ ఇచ్చేదాకా ఈ అష్టోత్తర శతనామాల్ని కొనసాగిస్తారు.”

“వెర్రోహం! ఈరోజు నీ ఉబ్బసాన్ని తాళలేకున్నాను. సరే, అలాగే కానీ! ఇంతకీ సచినుపైన ఏమిటి నీ అక్కసు?”

“సచిను పైన నాకెలాంటి పర్సనల్ ఉక్రోషం లేదు గురూ. అంతర్జాతీయ స్థాయిలో మనదేశానికి పేరు తీసుకురావడమన్నది పాపాన్ని పుణ్యంగా మార్చగలిగితే, ఆ గౌరవం ఒక్క సచినుడికే దక్కాలా? ఒహవేళ మిగతావాళ్ళకూ దక్కింక్కిక్కొచ్చు అంటే ఆ సదరు అర్హులెవరు? వారి అర్హతలేమిటి? – ఇవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి. ప్లీజ్!”

“ఆర్టాఫ్ ట్రూత్ సెర్చింగ్ బై అన్నాహజారే అన్న కోర్సు చేసినట్టున్నావు. లెస్సగా అడిగితివి శిష్యా! వినుకో! నువ్వన్నట్టే మనదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహానుభావులు మరికొందరున్నారు. పేర్లు చెబుతా, లిస్టు రాసుకో!

అ. సురేష్ కల్మాడి
ఆ. కనిమొళి
ఇ. ఏ. రాజా
ఈ. సుధీంద్ర కులకర్ణి”

“ఆ చివరి శాల్తీ ఎవరు గురూ?’

“వోటు-కోసం-నోటు కేసులో అరెస్టైన బిజేపి నాయకుడు, అద్వానీజీ ఒకప్పటి అంతేవాసి.”

“ఆహా! లిస్టు చాలా ఘోరభీకరపాపాత్మకంగా ఉంది గురూ! అంతర్జాతీయస్థాయిలో మనదేశ ప్రతిష్టని దినుమడింపజేసినందుకు వీళ్లందరికి వారివారి అపరాధాల్ని మాఫీ చేసేసి, రిలీజింగు సర్టిఫికేటు జారీ చేయ్యొచ్చు. సచిన్ ఆక్యుపెన్సీ సర్టిఫికేటు, మీరన్న మహానుభావుల రిలీజింగు సర్టిఫికేటును న్యాయదేవత తక్కెడలోతూస్తే సరిసమానంగా ఉండాలి. అప్పుడుగానీ గాంధీతాత ఆత్మ శాంతించదు.”

“లెస్స బలికితివి శిష్యా! అండపిండబ్రహ్మాండకూష్మాండాలలో నీకు తిరుగులేకుండుగాక! నౌ రన్ మై బోయ్ అండ్ స్టడీ ద నేచర్!”

* * * * *