ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తీహార్ లో అన్నా!

Like-o-Meter
[Total: 0 Average: 0]


చెవులు గోక్కుంటున్న సురేష్ కల్మాడిని చూసి శ్రుతి పెంచింది కనిమొళి.

“సట్టి సుత్తదడా, కైవిట్టదడా
బుద్ధి కెట్టదడా, నెంజి కొట్టదడా”

(జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా tune)

ఆ అరవ పాటకి అర్థం అడుగుతాడేమోనని, ముందుగానే రాసిపెట్టుకొన్న ఇంగ్లీషు అనువాదాన్ని అప్పుడప్పుడూ తెరిచి చూసుకుంటూ పాడుతోంది కనిమొళి. కానీ సురేష్ కల్మాడీలో ఎలాంటి మార్పూ లేదు. ప్రస్తుతం చెవికి బదులు ముక్కు గోక్కుంటున్నాడు. లాభం లేదని ఒక హిందీ పాట ఎత్తుకుంది – “ఆయేగా..ఆయేగా…ఆయేగా…” – పల్లవి ఇంకా ముగియకముందే సెల్లులోకి జైలర్ సాబ్ వచ్చాడు.

“అరే..ఆప్ రియల్లీ ఆగయే?” అని హాశ్చర్యపోతూ అడిగింది కనిమొళి.

జవాబివ్వని జైలర్ సాబ్ వెనక్కు తిరిగి, వాకిలి బైటకి మొహం పెట్టి – “ఆయియే! బధారియే! ప్లీజ్!” అని వినమ్రంగా అన్నాడు.

ఎర్రటి పైజమా మీద పసుపురంగు జుబ్బా వేసుకొన్న కల్మాడి ముక్కు గోక్కోడం ఆపేసి ఉలిక్కిపడ్డాడు. నలుపు, ఎరుపు రంగుల పంజాబీ డ్రెస్ లో ఉన్న కనిమొళి తెరచిన నోరును మూసెయ్యడం మచిపోయింది. గళ్ళగళ్ళ ప్యాంటు, షర్టు వేసుకొన్న ఏ. రాజా కళ్ళు మిటకరించి చూడసాగాడు. జైలర్ సాబ్ “ఆయియే సర్!” అని మళ్ళీ అంటుండంగా ఖద్దరు దుస్తుల్లో, గాంధీ టోపీతో ఉన్న ఓ వయోవృద్ధుడు లోనికి వచ్చాడు.

“క్షమించాలి హజారే సాబ్! ఈ తీహార్ జైల్లో ఇక్కడొక్క చోటనే కొంచెం ఖాళీ ఉంది. నాకు తెలుసు ఈ శాల్తీలతో మీరు ఇమడలేరని. బట్, ఐ డోంట్ హావ్ ఆన్ ఆప్షన్. ప్లీజ్ ఫర్గివ్ మీ!” అని అధికారికంగానే అన్నాడు. అన్నా హజారే చిరునవ్వు నవ్వి “కోయీ ప్రాబ్లం నహీ హై జైలర్ సాబ్!” అన్నాడు. మిగతా శాల్తీల వంక ఓ కరుకు చూపు చూసి బైటికెళ్ళిపోయాడు జైలర్.

కొద్ది మౌనం తర్వాత కనిమొళి, ‘లేడీస్ ఫస్ట్’ అన్న రూలు ప్రకారం “సో! మీరేనన్న మాట అన్నా హజారే. మీ గురించి గొప్పగా విన్నాను. మీరేంటి ఇలా పొట్టిగా, సింపుల్గా ఉన్నారు?” అంది.

“కనిమొళి! సింపుల్గా ఉండడమంటే?” అరవింగ్లీషులో అడిగాడు రాజా.

“ఖద్దరు బట్టల్లో ఉండడం” అన్నాడు కల్మాడి.

“అరే! కల్మాడి! నీకు ఘోరమైన మతిమరుపుగా?” అంది కనిమొళి.

“కల్మాడా! వాడెవడు? వాడినడగాల్సిన ప్రశ్న నన్నడుగుతున్నావు నువ్వెవరు?” అన్నాడు కల్మాడి.

“ఉఫ్!” అని కళ్ళెగరేసి కనిమొళి హజారే వైపు చూస్తూ “అన్నా! నువ్వు తమిళా?” అంది. లేదన్నట్టు తలూపాడు అన్నా. “మరి అన్నా అని ఎందుకు పెట్టుకున్నావు? ఒక నార్తిండియన్ కు ఆ పేరు ముడియాదే?” అంది కనిమొళి. “ఆమా! నేను కూడా కనిమొళి పార్టీనే!” అన్నాడు రాజా.

“నువ్వంట్లాంటి పార్టీనేని ఇక్కడికొచ్చినప్పుడే తెలిసిందిలే!” అన్నాడు కల్మాడి మోకాలిపై గోక్కుంటూ. షాకైన రాజా కల్మాడి వైపు చూసి “మొన్న సి.బి.ఐ కి నీకు మతిమరుపొచ్చిందని చెప్పావే. ఇప్పుడేంటి ఇట్లా రెచ్చిపోతున్నావ్?” అన్నాడు రాజా ఆవేశంగా. జవాబివ్వకుండా చేతుల్ని పైజమా వెనకపెట్టుకొని గోక్కోసాగాడు కల్మాడి.

“నిజం సొల్లన్నా! నీన్ తమిళా? ఇల్లియా?’ అంది కనిమొళి. ‘ఎస్! యూ షుడ్డు టెల్లు” అన్నాడు రాజా. “రాతిరిక్కుం తూగుమిల్లై…తమిళు పొణ్ణు కోతిపిల్లై” అని తొడల మీద దరువేసుకొంటూ పాడసాగాడు కల్మాడి. పళ్ళు కొరుకుతూ కల్మాడి భుజం మీద ఒక్కటిచ్చింది కనిమొళి. “హే! లేడీ! దిసీజ్ ఆట్రాషియస్! నీ మీద ఆడమ్ టీజింగ్ కేసేస్తా!” అన్నాడు కల్మాడీ చప్పట్లు కొడుతూ. కల్మాడీ అలా కొడుతున్నంతసేపూ “అకాయో అకాయా-అకాయో అకాయా” అని అరవసాగాడు రాజా. కనిమొళి విరగబడి నవ్వసాగింది.

ఆ అరవ గలాట్టాకి ఓ జైలు గార్డొచ్చి తలుపు మీద లాఠీతో బాదాడు. అందరూ సైలెంటైపోయారు.

రెండు నిముషాల తర్వాత కనిమొళి అన్నాకు దగ్గరగా వచ్చి “అన్నా! నిన్ను చూస్తుంటే ఎవర్నో చూస్తున్నట్టుగా ఉందన్నా!” అంది.

“కామరాజ్?” అన్నాడు రాజా. “నో” అంది కనిమొళి. “ఎంజీయార్?” – “నో!”. “నంబియార్?” – “నో”. “నాగేష్?” – “వాయి ముడు రాజా” అంది కనిమొళి. “ఛా! హూ ఈజ్ దట్?” అని ఎడం చేతితో కుడిచేతిని కొట్టుకోసాగాడు రాజా. “అకాయో అకాయా! ఆ..అకాయో అకాయా” అని అరవసాగాడు కల్మాడి. చప్పట్లు కొట్టడం చప్పున ఆపేసాడు రాజా. కనిమొళి లోపల్లోపలే నవ్వుకొంటూ “అన్నా! చెప్పన్నా! నీ ఖద్దరు బట్టలు, టోపీ చూస్తుంటే ఎవర్నో చూసినట్లుంది. మంచి ఫేమస్ పెర్సనాలిటీనే. బట్ నాట్ గెటింగ్ ద నేమ్!” అంది కనిమొళి.

దగ్గరగా జరిగిన రాజా, కనిమొళి చెవిలో “ఫేమస్ పెర్సనాలిటీ అణ్ణా యార్ తంగట్చి? సోనియా గందీయా? రాగుల్ గందీయా?” అన్నాడు. “డే..రాజా…ఉంగళ్ బ్రైన్ రొంబా ప్రమాదమాన బ్రైన్ డా!” అని ఓ జెల్ల ఇచ్చింది కనిమొళి.

“అన్నా! నేనన్న ఆ ఫేమస్ పెర్సనాలిటీ ఎవరో కాదు…గాంధీతాత. నువ్వచ్చం గాంధీతాతలా ఉన్నావ్.” అంది కనిమొళి.

ఓ చిరునవ్వు నవ్వాడు హజారే.

“ఏమిటీ మనిషి? ప్రతిదానికీ నవ్వుతాడు. అసలు మాట్లాడే మాట్లాడడు?” అన్నాడు రాజా, కనిమొళి కొట్టిన చోట తడుముకొంటూ.

“అవును తాతా! నువ్వేదైనా మాట్లాడు. మూణ్ణెల్లుగా ముగ్గురమే మాట్లాడుకొని విసుగెత్తింది. ప్లీజ్ తాతా!” అంది కనిమొళి.

అన్నా చిరునవ్వుతో “మాట వెండైతే మౌనం బంగారం చిట్టితల్లీ!” అన్నాడు.

“ఆ…వెండి, బంగారమా! ఎంగె ఎంగె” అని వెతకసాగాడు రాజా. అన్నా వైపు చూస్తూనే రాజా చొక్క పట్టుకొని ఆపింది కనిమొళి. “మంచి కొటేషన్ తాతా! ఇట్లాంటివే ఇంకొన్ని చెప్పు. వాటిల్ని రాసుకొని, రీ అరేంజ్ చేస్తా.” అంది కనిమొళి.

“తంగట్చీ! రీఅరేంజ్ పణ్ణా ఎన్నా ప్రాఫిట్టు?” అన్నాడు రాజా.

“డే ముఠాళ్ రాజా! వేరేవాళ్ళ మాటల్ని రీఅరేంజ్ చేస్తే కవిత్వం పుడుతుంది. యూ నో దట్ అయామే పొయెట్. జస్ట్ లైక్ మై ఫాదర్! ఇప్పుడు కవితలు రాయాలనివున్నా ఇన్స్పిరేషన్ లేదు. అందుకని తాత చెప్పిందే కొంచెం అటుఇటు చేసి కవిత్వం పుట్టిస్తా. తలైవర్కి పంపిస్తా.” అంది. అర్థంకాక బుర్రగోక్కొన్నాడు రాజా.

అన్నా నోరు విప్పి “ఒకదేశపు సంస్కృతి ఆ దేశప్రజల హృదయాల్లో ఉంటుంది” అన్నాడు. కనిమొళి వెంటనే రాసుకొంది. “వెరీ గుడ్ కోట్ తాతా! ప్లీజ్ కంటిన్యూ!”

అన్నా చెప్పుకుంటూ పొసాగాడు. కనిమొళి రాస్తూ పోసాగింది. అలా రాసినవాటిని గట్టిగా చదవసాగింది-

“నీతి అన్నది కచ్చితత్వానికి కొండగుర్తు. మనలాంటి అల్పజీవులు కచ్చితత్వాన్ని అమలుచెయ్యలేక అడ్డదార్లు తొక్కుతాం. అవినీతికి అదే మూలం.”

“మన చేతలు మన ప్రాధాన్యాలను తెలుపుతాయి”

“ఎక్కడైనా ఇచ్చి, పుచ్చుకోవడం చెయ్యవచ్చు. కానీ నీతి-నియమాలతో రాజీపడే విషయాల్లో అది పనికిరాదు. ఎవరైనా అలా చేస్తే అది లొంగుబాటు అవుతుంది.”

“చిటికెడు ఆచరణ ముఖ్యం. బండెడు ఉపన్యాసాలకంటే.”

“మార్పు మొదటగా నీలోనుంచి బయలుదేరాలి”

“పెరుగుతున్న నీ సంపద నీ నైతిక ఎదుగుదలకు నిదర్శనం కాదు.”

“మానవుని గొప్పదనం తన తోటివాళ్ళకు చేసే సహాయంలో ఉంటుంది గానీ వాడు సంపాదించిన ఆస్తిలో కాదు.”

“ప్రపంచంలో మానవ అవసరాలకు సరిపడేవన్నీ ఉన్నాయి. కానీ వాడి దురాశకు సరిపొయేవి లేవు.”

“నిజం నిలబడడానికి ఎవరి ఆసరా అవసరం లేదు. అది స్వయం సమర్థమైనది.”

కనిమొళి చదివంతా విన్న రాజా, కల్మాడి నిశ్శబ్దంగా ఉండిపోయారు. కనిమొళి నెమ్మదిగా గొంతు పెగుల్చుకొని “తాతా! ఎన్ని మంచి మాటలు చెప్పావో! వీటన్నింటినీ నా కవితలుగా చెలామణీ చేయించాలనుకొన్నా, కానీ ధైర్యం చాలడం లేదు. ఇన్ని మంచిమాటలు ఎలా చెప్పగలుగుతున్నావు?” అని అడిగింది.

కంటద్దాలను తీసి తుడిచి మళ్లీ పెట్టుకొని “అవి నా మాటలు కావు తల్లీ! నువ్వన్నావే గాంధీతాత, ద ఫేమస్ పెర్సనాలిటీ, ఆయన చెప్పగా నేను రాసుకున్నాను. ఇక్కడ…” అంటూ గుండె కేసి చూపాడు.

ఆ మాటలకి ఆ ముగ్గురూ తలవంచుకొన్నారు.

ఈలోపు జైలర్ వచ్చి “హజారే సాబ్! మిమ్మల్ని విడుదల చెయ్యమని పి.ఎం. ఆఫీసు నుండి ఆర్డర్ వచ్చింది. నౌ ద ట్రూత్ ఈజ్ ఫ్రీ!” అన్నాడు.

నేల మీది నుంచి లేవబోతున్న అన్నా చేతుల్ని పట్టుకొని తామూ లేచారు కనిమొళి, రాజా.

“అశక్తులకు సహాయపడడంలోనే ఆత్మతృప్తి! మీ సహాయానికి ధన్యవాదాలు.” అంటూ బైటకు నడిచాడు అన్నా.

తెరిచిన వాకిలి గుండా లోనపడ్డ సూర్యకిరణమొకటి వింతగా మెరిసింది.