ప్రథమ అష్టపది – ఆడియో (Audio track of 1st Ashtapadi)
images/stories/ashtapadi/05 Ast1 Sowarstram.mp3
అష్టపది 1
- దశావతార వర్ణనం – మాళవరాగేణ రూపకతాళేన గీయతే
ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం
విహిత వహిత్ర చరిత్రమ్ఖదం
కేశవ! ధృతమీనశరీర! జయ జగదీశ! హరే (ధ్రువం)
క్షితి రతివిపులతరే తవ తిష్టతి పృష్టే
ధరణి ధరణ కిణ చక్రగరిష్టే
కేశవ! ధృతకచ్ఛపరూప! జయ జగదీశ! హరే
వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంక క్లవ నిమగ్నా
కేశవ! ధృతసూకరరూప! జయ జగదీశ! హరే
తవకరకమల వరే నఖమద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ! ధృతనరహరిరూప! జయ జగదీశ! హరే
చలసి విక్రమణే బలి మద్భుత వామన
పదనఖనీర జనిత జన పావన
కేశవ! ధృతవామనరూప! జయ జగదీశ! హరే
క్షత్రియ రుధిర మయే జగదప గత పాపం
స్నపయసి పయసి శమిత భవతాపం
కేశవ! ధృతభృగుపతిరూప! జయ జగదీశ! హరే
వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం
దశముఖ మౌళి బలిం రమణీయం
కేశవ! ధృతరామశరీర! జయ జగదీశ! హరే
వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతి భీతిమిళిత యమునాభం
కేశవ! ధృతహలధరరూప! జయ జగదీశ! హరే
నిందసి యగ్నవిధే రహహా శ్రుతిజాతం
సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ! ధృతబుద్ధశరీర! జయ జగదీశ! హరే
మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతు మివ కిమపి కరాలం
కేశవ! ధృతకల్కిశరీర! జయ జగదీశ! హరే
శ్రీ జయదేవ కవే రిదముదిత ముదారం
శృణు శుభదం సుఖదం భవసారం
కేశవ! ధృతదశవిధరూప! జయ జగదీశ! హరే
తాత్పర్యం:
జగదీశ! హరీ! కేశవా! మీన రూపము ధరించినవాడా! ప్రళయకాల సముద్రములో మునిగిపోయిన వేదాలను సునాయాసంగా ఓడవలే ఉద్ధరించినావు. అట్టినీకు జయమగుగాక.
విశాలమైన ఈ భూమిని నీ మూపుపై మునిగిపోకుండా తాబేలు రూపంలో మోస్తూవున్నావు. అట్టినీకు జయమగుగాక.
నీ కోర కొన యందు అంటివున్న భూగోళం చంద్రునిలోన మచ్చవలే నల్లగా వుంది. వరాహరూపంలో భూమిని తనకోరలపై నిలిపినవాడా, అట్టినీకు జయమగుగాక.
నరసింహరూపము ధరించిన స్వామీ! నీకరకమలములతో చీల్చబడిన హిరణ్యకశిపుని శరీరం తుమ్మెదవలే వుంది. నీ వ్రేలి గోరుమొన ప్రకాశిస్తూ అద్భుతంగా వుంది. అట్టినీకు జయమగుగాక.
వామనరూపధారీ! హరీ! నీవు ఆకాశమునకు ఎత్తిన పాదం గోటికి అంటిన నీరే జనావళికి పావనమైనది (గంగానది). నీవు విక్రమించుటతో బలిచక్రవర్తి పాతాళానికి తొక్కబడ్డాడు. అట్టి నీకు జయమగుగాక.
పాపములను పోగొట్టి, సంసార తాపత్రయములను పారద్రోలి క్షత్రియ రక్తమయమైన నీటిలో స్నానమాడిన పరశురామ రూపా, అట్టి నీకు జయమగుగాక.
యుధ్ధంలో రావణుని పది తలలను నరికి దిక్పాలకులకు బలిగా ఇస్తున్న శ్రీరామ రూపం గల స్వామీ. అట్టినీకు జయమగుగాక.
నీ నాగలి దెబ్బకు భీతిల్లి పరుగెత్తుకువచ్చిన యమునా నది వలెనున్న నల్లని పట్టు పుట్టము ధరించినవాడా. బలరామా. అట్టినీకు జయమగుగాక.
దయామయ హృదయంగల బుద్ధరూప! వేద ప్రతిపాదిత యజ్ణయాగాది క్రతువులలో పశువధను నిషేధించినావు. అట్టి నీకు జయమగుగాక.
మ్లేచ్ఛులను హతమార్చు తోకచుక్కవలే భీకరమైన కరవాలము ధరించి కల్కిరూపధారివై నీవు అవతరించెదవు. అట్టి నీకు జయమగుగాక.
ఈవిధముగా పదివిధములైన రూపములను ధరించిన కృష్ణా! శుభమునిచ్చునది, సుఖమునిచ్చునది, సంసారసారమైనది జయదేవకృతమైన కృతి. నీకృతిని విను స్వామి! కేశవ! జగదీశ! హరే నీకు జయమగుగాక.
ద్వితీయ అష్టపది – ఆడియో (Audio track of 2nd Ashtapadi)
images/stories/ashtapadi/07 Asta2 bhairavi.mp3
అవతార సంగ్రహ స్తుతి
శ్లో. వేదా నుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే
దైత్యం దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్ మూర్చయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమహా:
వేదములను ఉద్ధరించి, జగత్తును మోసి, భూగోళమును పైకెత్తి, హిరణ్యకశిపుని వధించి, బలిచక్రవర్తిని చిత్తుజేసి, క్షతక్ష్యంబు గావించి, రావణుని జయించి, నాగలిని ధరించి, అహింసా బోధజేసి, మ్లేచ్ఛులను మూర్చజేసెడి దశావరారధారివైన కృష్ణా! నీకు వందనములు.
అష్టపది 2
హరి విజయ మంగళాచారం
- ఘూర్జరీ రాగ నిస్సార తాళాభ్యాం గీయతే భైరవి రాగం, త్రిపుట తాళం
శ్రితకమలాకుచ మండలా! ధృత మండల
kaలిత లలిత వనమాల! జయజయదేవా! హరే (ధృవం)
దినమణి మండల మండనా! భవఖండన
మునిజన మానస హంస! జయజయదేవా! హరే
కాళియ విషధర గంజన! జనరంజన
యదుకులనళిన దినేశ! జయజయదేవా! హరే
మధుమురనరక వినాశన! గరుడాసన
సురకుల కేళి నిదాన! జయజయదేవా! హరే
అమలకమలదళ లోచన! భవమోచన
త్రిభువన భవన నిధాన! జయజయదేవా! హరే
జనకసుతా కుచ భూషణ! జితదూషణ
సమర శమిత దశకంఠ! జయజయదేవా! హరే
అభినవ జలధర సుందర! ధృతమందర
శ్రీముఖ చంద్ర చకోర! జయజయదేవా! హరే
తవ చరణే ప్రణతావయ మితి భావయ
కురు కుశలం ప్రణతేషు జయజయదేవా! హరే
శ్రీజయదేవ కవేరిదం కురుతే ముదం
మంగళముజ్వల గీతం జయజయదేవా! హరే
లక్ష్మీదేవి కుచములను కౌగలించిన ప్రభూ! కుండలములను ధరించిన స్వామీ! పాద పర్యంతముగా కల తులసీమాలలతో వెలుగొందువాడా! పాపములను హరించువాడా! నీకు జయము జయము.
సూర్యమండలమున ప్రకాశించువాడా! మునుల మనస్సులను సరస్సులో విహరించు రాజహంసమా! నీకు జయము జయము.
విషధరుడైన కాళీయ సర్పమును చంపి జనులకు ఆనందము కలిగించినవాడా! యాదవ కులమనే కమలమునకు సూర్యునివంటివాడా! నీకు జయము జయము.
మధు, మురాసురుడు మరియూ నరకాసురుడిని హతమార్చినవాడా! గరుడవాహనమునెక్కి విహరించువాడా! దేవతల కేళికి ఆటంకములు రాకుండా చూచు స్వామి! నీకు జయము జయము.
నిర్మలమైన తామరరేకులవంటి కన్నులు కలవాడా! పాపములను పోగొట్టి మోక్షమునిచ్చువాడా! మూడులోకములు ఉద్భవించుటకు కారణభూతుడా! నీకు జయము జయము.
జానకీ కుచములచే భూషించబడినవాడా! రాక్షసులను జయించినవాడా! యుద్ధమున దశకంఠుని వధించినవాడా! నీకు జయము జయము.
సరికొత్త మేఘమువలే అందమైనవాడా! సుందర పర్వతమును పైకెత్తినవాడా! లక్ష్మీదేవి ముఖమనే చంద్రునికి చకోరపక్షి వంటివాడా! నీకు జయము జయము.
నీ పాదములకు నమస్కరించితిమని తలంపుము. మాకు సకల శుభములను నొసంగుము దేవా. నీకు జయము జయము.
స్వామీ! జయదేవకవి రచించిన మంగళ మనోహర గీతము నీకు ఆనందము కలిగించుగాక. నీకు జయము జయము.
శ్లో. పద్మాపయోధరతటీ పరిరంభలగ్న
కాశ్మీర ముద్రిత మురో మధుసూదనస్య
వ్యక్తానురాగ మివ ఖేలదనంగ ఖేద
స్వేదాంబుపూర మనుపూరయతు ప్రియం వ:
లక్ష్మీదేవి చనులను ఆలింగనము చేసికొనుటవలన అంటిన కుంకుమ వలన శ్రీకృష్ణుని హృదయంలోని అనురాగం వెలుపల ప్రకాశిస్తున్నదా అనిపిస్తూ, మదనకేళి వలన కలిగిన స్వేదబిందువులతో ప్రకాశించే వక్షస్థలము మనకు ప్రియము కలిగించుగాక!
********
తృతీయ అష్టపది – ఆడియో (Audio track of 3rd Ashtapadi)
images/stories/ashtapadi/08 Asta3 vasantha.mp3
శ్లో. వసంతే వాసంతీకుసుమ సుకుమరై రవయవై
ర్భ్రమంతీం కాంతారే బహువిహిత కృష్ణానుసరణాం
అమందం కందర్ప జ్వర జనిత చింతాకులతయా
వలద్భాధాం రాధాం సరస మిదమూచే సహచరీ
వసంతఋతువులో మన్మధ తాపముచేత కలిగిన బాధతో కలత జెందిన వాసంతీ పుష్పమువలే సుకుమారమైన అవయవాలతో అరణ్యంలో శ్రీకృష్ణమూర్తిని వెదుకుచున్న రాధతో ఆమె చెలికత్తె సరసంగా ఇలా అంటున్నది.
అష్టపది 3
మాధవోత్సవ కమలాకరం వసంతరాగ యతి తాళాభ్యాం గీయతే – వసంత రాగం, ఆది తాళం
లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే
విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేజ సమం సఖి! విరహి జనస్య దురంతే (ధ్రువం)
ఉన్మద మదన మనోరథ పధిక వధూజన జనిత విలాపే
అలికుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుళ కలాపే
మృగమద సౌరభ రభస వశంవద నవదళ మాల తమలె
యువజన హృదయ విదారణ మనసిజ నఖ రుచి కింశుక జాలే
మదన మహీపతి కనక దండరుచి కేసర కుసుమ వికాసే
మిళిత శిలీముఖ పాటల పటల కృతస్మర తూణవిలాసే
విగళిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృత హాసే
విరహి నికృంతన కుంత ముఖాకృతి కేతకి దంతురితాశే
మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ
ముని మనసామపి మోహనకారిణి తరుణా కారణ బంధౌ
స్పురదతి ముక్త లతా పరిరంభణ ముకుళిత పులకిత చూతే
బృందావన విపినే పరిసర పరిగత యమునాజల పూతే
శ్రీ జయదేవ భణితమిద ముదయతి హరి చరణ స్మృతి సారం
సరస వసంత సమయ వనవర్ణన మనుగత మదన వికారం
లలితములైన లవంగ లతలపైనుంచి శీతల వాయువులు మెల్లగా వీస్తున్నవి. కోకిలలు కూస్తున్నవి. తుమ్మెదల ఝుంకారం మ్రోగుతున్నది. వీటి గానంతో పొదరిండ్లు ప్రతిధ్వనిస్తున్నవి. ఈ వసంత ౠతువు విరహిజనులను బాధపెడుతున్నది. ఇలంటి వసంత కాలంలో బృందావనంలో కృష్ణుడు ప్రియురాండ్లతో కలసి ఆనందంగా పాడుతూ, ఆడుతూ, విహారం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి పోదాం రావమ్మా, రాధా!
పరదేశాలకు తమ ప్రియులు వెళ్ళుటవలన ప్రియురాండ్ర హృదయములలో కామమను తుమ్మెదల ఝుంకారములు అతిశయింపజేస్తున్నాయి. అలాంటి తుమ్మెదలు గల పుష్పగుచ్చములచే ప్రకాశించు వృక్షాలు గల వసంత ఋతువులో కృష్ణుడు విహరిస్తున్నాడు.
కస్తూరి పరిమళం గల చిగురాకులతో విలసిల్లే కానుగు చెట్లు గలిగి, యౌవనము గలవారి హృదయాలను చీల్చు మన్మధుని గోళ్ళవంటి మోదుగు పూలతో అందమైన వసంత ఋతువులో కృష్ణుడు విహరిస్తున్నాడు.
మన్మధరాజు యొక్క బంగారు దండము రంగు గల, వికసించిన కేసర కుసుమాలు కలిగి, పాటల కుసుమములను మన్మధ బాణముముల అమ్ములపొది గల వసంతంలో బృందావనంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.
తెల్లగా అడవిలో పూచిన కరుణ వృక్షములు, మన్మధ బాధపొందుచూ సిగ్గు వదిలిన వియోగులను చూచి నవ్వుచున్నట్లు వున్నవి. విరహాల హృదయాలను బ్రద్దలు కొట్టగల మన్మధుని కుంతమను ఆయుధము వలే మొగలిపూలు వికసించి వున్నవి. అట్టి వసంతంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.
మాధవి, మాలతి పుష్పాల సుగంధంతో ఘుమఘుమలాడిపోతున్నటువంటి, మునుల మనస్సులను సైతం ఆకర్షించగల తరుణులకు అకారణ బంధువైన వసంత ౠతువున కృష్ణుడు విహరిస్తున్నాడు.
బండి, గురువెంద తీగల ఆలింగనం వల్ల పులకించిపోయే మామిడిచెట్ల సమీపంలో యమునానదీ జలంతో పవిత్రమైన కాముకులను కాపాడే బృందావనంలో కృష్ణుడు విహరిస్తున్నాడు.
హరిచరణములను స్మరించుట వలన సారవంతమై, యవ్వనము గల వారికి మదన వికారం కలిగించు వసంతకాల బృందావన వర్ణన శ్రీ జయదేవ కవి గీతం ఉత్కృష్టము.
శ్లో. దరవిదళిత మల్లీ వల్లి చంచత్పరాగ
ప్రకటిత పట వాసైర్వాసయంకాననాని
ఇహ హి దహతి చేత: కేతకీ గంధ బంధు:
ప్రసర దసమబాణ ప్రాణవద్గంధవాహ:
కొంచెముగా వికసించిన మల్లెతీగనుండి కురియు పుప్పొడితో అడవులను పరిమళింపజేస్తూ, గేదంగి పూల పరిమళాన్ని అంతటా వ్యాపింపజేస్తున్న మన్మధుని ప్రాణవాయువు వంటి వసంత గాలి హృదయాలను దహిస్తున్నది.
శ్లో. ఉన్మీలన్మధు గంధ లుబ్ధ మధుప వ్యాధూత చూతాంకుర
క్రీడత్కోకిల కాకలీ కలరవై రుద్గీర్ణ కర్మ జ్వరా:
నీయంతే పధికై: కధం కధమపి ధ్యానుధానక్షణ
ప్రాప్త ప్రాణసమా సమాగమ రసోల్లాసై రమీ వాసరా:
మామిడి చిగుళ్ళను, మకరందమును త్రావిన తుమ్మెదలు కదల్చగా, వాటితో ఆడుచున్న కోకిలలు కాకలీ ధ్వనులు చేయగా బాటసారులు తమ ప్రియురాళ్ళ సమాగమాన్ని గురించి కలలు కంటున్నారు. వాళ్ళను ఎప్పుడు కలుసుకోగలమా అని ఆరాటపడుతున్నారు. ఇలా వసంతపు రోజులు గడుస్తున్నాయి.
**********
చతుర్థ అష్టపది – ఆడియో (Audio track of4th Ashtapadi)
images/stories/ashtapadi/09 Asta4 Panthuvarali.mp3
శ్లో. అనేక నారీ పరిరంభ సంభ్రమ
స్పురణ్మనోహారి విలాస లాలసం
మురారిమారా దుపదర్శయంత్యసౌ
సఖీ సమక్షం పునరాహ రాధికాం
అనేక నారీమణుల ఆలింగన సంభ్రమంతో, శృంగార చేష్టలతో తేలియాడుతున్న మురారిని చెలికత్తె సమీపంగా చూపుతూ రాధికతో మళ్ళీ ఇట్లా అంటున్నది.
అష్టపది 4
సామోద దామోదర భ్రమరపరం రామక్రియా రాగ యతి తాళాభ్యాం గీయతే – రామక్రియ రాగం, యతి తాళం
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ
కేలి చలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూనికరే విలాసిని విలసతి కేళి పరె (ధృవం)
పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం
గోప వధూరనుగాయతి కాచిదుదంచిత పంచమ రాగం
కాపి విలాస విలోల విలోచన ఖేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధ వధూరధికం మధుసూదన వదన సరోజం
కాపి కపోల తలే మిలితా లపితుం కిమపి శ్రుతి మూలే
చారు చుచుంబ నితంబవతీ దయితం పులకై రనుకూలే్
కేళి కళా కుతుకేన చ కాచిదముం యమునాజల కూలే
మంజుల వంజుల కుంజ గతం విచకర్ష కరేణ దుకూలే
కర తల తాళ తరళ వలయావళి కలిత కలస్వన వంశే
రాసరసే సహ నృత్య పరా హరిణ యువతీ ప్రశసంసే
శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం
పశ్యతి సస్మిత చారు తరామపరామనుగచ్చతి వామాం
శ్రీ జయదేవ భణితమిద మద్భుత కేశవకేళి రహస్యం
బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యం
ఓ రాధా! చందనము అలరిన నీల శరీరమున పీతాంబరము ధరించినవాడు, తులసిమాలతో విరాజిల్లుతున్న చెవులలోని మణికుండలాలు రెండు చెక్కిళ్ళపై క్రీడా సమయంలో కదులుతూ వుండగా చిరునవ్వు గలిగి ముగ్ధమైన వధువులతో శ్రీ కృష్ణుడు విలాసంగా వున్నాడు.
రాధా! ఒక గోప వధువు తన బరువైన పయోధరములతో హరిని ప్రేమతో ఆలింగనం చేసికొని పంచమస్వరంలో స్వామితో కలసి గానం చేస్తున్నది.
రాధా! అదిగో! ఓక ముగ్ధయైన వధువు – మధుసూదనుడైన శ్రీకృష్ణుని నేత్ర విలాసంవల్ల మన్మధ వికారము కలుగగా, నిశ్చేష్టురాలై అతని ముఖ పద్మముని ధ్యానిస్తున్నది.
ఫెద్ద పెద్ద పిరుదులు గల ఒక కాంత, మోహము భరించలేక – స్వామి చెవిలో ఏదో రహస్యము చెప్పు నెపంతో దగ్గరగా వెళ్ళి, పులకింత కలుగునట్లు చెక్కిలిని ముద్దుపెట్టుకొంటున్నది.
మరొక బాలిక మన్మధ కేళిలో కోరికచేత యమునా నదీ తీరంలో అందమైన వంజుల లత పొదరింటిలో గల శ్రీకృష్ణుని పట్టుబట్టను పట్టుకొని తన చేతితో నీటిలోనికి లాగుచున్నది.
మధురమైన నాదంతో కృష్ణుడు పిల్లనగ్రోవిపై పాడుతున్నాడు. ఆ పాటకు తగినట్లుగా తనచేతి గాజులతో ఒక బాలిక తాళం వేస్తున్నది. రాసక్రీడలో కృష్ణునితో నాట్యం చేస్తూ అతని ప్రశంస పొందుచున్నది.
హరి ఒక భామను ఆలింగనం చేసుకోంటున్నాడు. ఒకక లేమను ముద్దు పెట్టుకొంటున్నాడు. ఓక రామను ఆనందింపజేయుచున్నాడు. మరియొక భామ వెంటబడి వెళ్ళుతున్నాడు.
కేశవుని కేళి రహస్యములతో అధ్భుతమైనదీ, బృందావనంలో లలితమైనదీ, కీర్తికరమైనదీ అయిన శ్రీ జయదేవుని కవిత శుభములనిచ్చుగాక.
శ్లో. విశ్వేశామనురంజనేన జనయన్నానందమిందీవర
శ్రేణీ శ్యామ కోమలై రుపనయన్నంగైరసంగోత్సవం
స్వస్చందం వ్రజ సుందరీభిరభిత: ప్రయంగమాలింగిత:
శృంగార: సఖి మూర్తిమానివ మధౌ ముగ్ధో హరి: క్రీడతి
సఖీ! మనోహరుడైన శ్రీహరి గోపికలందరికీ ఆనందాన్ని అందిస్తూ – నల్ల కలువల శ్రేణులవలే శ్యామల కోమలములైన అవయములతో మన్మధోత్సవము జరిపించుతూ, గొల్లభామల అంతరంగములచేత, బహిరంగములచేత ఆలింగనము చేయబడుచున్నవాడై శృంగారమూర్తియై వసంత ౠతువులో కృఈడించుచున్నాడు.
శ్లో. నిత్యోత్సంగ వసద్భుజంగ కబల క్లేశాదివేశాచలం
ప్రాలేయ ప్లవనేశ్చయానుసరతి శ్రీఖండ శైలానిల:
కించ స్నిగ్ధ రసాల మౌళి ముకుళాన్యాలోక్య హర్షోదయా
దున్మీలంతి కుహూ: కుహూరితి కలోత్తాలా: పికానాం గిర:
పాములచే భక్షణము చేయబడిన గాలులు, మలయపర్వతముకు దగ్గరగా వుండి, తమకు పాములు మింగుటచే కలిగిన బాధతో మంచునీటియందు మునిగి ఆ పాముల విషబాధ పోగొట్టుకొనుటకు హిమవత్పర్వతము వైపు పోవుచున్నవి. మనోహరములైన తియ్య మామిడుల కొనలలోని చిగుళ్ళను చూచి సంతోషంతో హెచ్చుస్తాయిలో మధురముగా కుహూ కుహూ అని కోకిలలు గానం చేస్తున్నవి.
శ్లో. రసోల్లాస భరేణ విభ్రమ భ్రుతామాభీర వామ భ్రువా
మభ్యర్ణం పరిరభ్య నిర్భరముర: ప్రేమాంధయా రాధయా
సాధు త్వద్వదనం సుధామయమితి వ్యాహృత్య గీత స్తుతి
వ్యాజాదుత్కట చుంబిత: స్మృత మనోహరీ హరి: పాతు వ:
ప్రేమచేత అంధురాలైన రాధ – రాసక్రీడలో సంతోషిస్తున్న విలాసవతులగు గొల్లభామల ముందే శ్రీకృష్ణుని రొమ్ము కౌగిలించుకొని, “కృష్ణా! నీవదనము సుధామయము” అన్నది. ఈవిధంగా పాట పాడుతూ, కృష్ణమూర్తిని స్తుతిస్తూ ఆ నెపంతో చుంబిస్తూ వుండగా, చిరునవ్వు నవ్వుతూ మనోహరంగా వున్న హరి మనసు పాలించుగాక.
||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే సామోదదామోదరో నామ ప్రధమస్సర్గ:||
(ముందు భాగంలో – ద్వితీయ సర్గం)