ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గీత గోవిందం – ముందు మాటలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఉత్కళదేశంలో పూరీ దగ్గర కిందుబిల్వం అనే గ్రామంలో జయదేవకవి 12వ శతాబ్దంలో జన్మించారు.  ఫ్రజల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన ఆయనయొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ ఇత్యది మహావాగ్గేయకారులకు స్పూర్తిదాయకమైయ్యింది. 

అంతేకాకుండా అనేకమంది దీనిని ఆంగ్లం, జర్మన్, ప్రెంచ్, లేటిన్ మొదలైన భాషల్లోకి అనువాదం చేశారు. మొట్టమొదట విలియం జోన్స్ చేసిన ఆంగ్ల అనువాదం పెద్ద సంచలనాన్నే కలిగించింది.  “ఆర్నాల్డ్ సాంగ్ ఆఫ్ సాంగ్” పేరుతో చేసిన ఆంగ్ల భావానువాదం చాలా ప్రాచుర్యం పొందింది.

ఈ గీతి కావ్యంలో మూడే పాత్రలు – రాధ, కృష్ణుడు మరియు సఖి.  విరహవేదన ఈ కావ్యంలోని విషయం. ఇందులో లౌకికంగా శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధానం.  భక్తి శృంగారం ఇందులో ఎంతో మధురంగా కలసిపోయాయి. ఇందులోని సఖి నాయికా-నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేసి వారిని సన్నిహిత పరచడానికి ప్రయత్నిస్తూ – ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమానికి దారితీస్తుంది.

12 సర్గలుగా విభజించబడ్డ ఈ గీతగోవిందంలో అనేక శ్లోకాలతోబాటు 24 కీర్తనలు వున్నాయి.  ఆన్ని కీర్తనల్లో, మొదటి కీర్తన మినహా, 8 చరణాలు వున్నాయి.  మొదటి కీర్తనలోమాత్రం 10 చరణాలు వున్నాయి.  అందుకే ఈ మహాకావ్యం ‘అష్టపదులు’ గా కూడా ప్రసిద్ధం

భక్తుడు తన స్వామిలీలను శృంగారపరంగా భావించి తన్మయమై తరిస్తాడు.  జయదేవుడు రాధా-కృష్ణ ప్రేమలీలలు గానంచేసి, తాను రసావేశం పొందడమేగాక, శ్రోతలకు కూడా ఆ రసావేశం కలిగించాడు.  జయదేవుడు తన గీతాల్లో కావ్యాత్మను కాపాడుతూనే ఇహ-పరాలకు ఉపయోగపడేలా రచన సాగించాడు. లౌకికత్వం కనపరుస్తూనే ఆధ్యాత్మిక చింతన చేశాడు.

 

 

Dhyana Shlokam Audio

images/stories/ashtapadi/02_Dhyana Slokam.mp3

 

 

ఫ్రధమ సర్గము – సామోద దామోదర:

మంగళాచరణములు

శ్లో.  మేఘఈర్మేదుర మంబరంవనభువశ్యామా స్తమాలద్రుమై:

  నక్తం భీరు రయం త్వమేవ తదిమం రాధే! గృహంప్రాపయ
  ఇథం నందనిదేశత శ్చలితయో: ప్రత్యధ్వకుంజద్రుమం
  రాధామాధవయోర్జంతి యమునాకూలేరహ: కేళయ:

శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి నందుడు రాధతో ఇలా అంటున్నాడు: “మబ్బులు ఆకాశంలో దట్టంగా వున్నాయి.  అరణ్యసీమలు చీకటి కానుగు చెట్లతో నల్లగా వున్నాయి.  కృష్ణయ్య రాత్రుల్లో భయపడతాడు. నీవు తొందరగా కృష్ణుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళు” అని రాధకు కృష్ణుణ్ణి అప్పగించాడు. యమునా నదీతీరంలో వెళుతూ పొదరిండ్లలో విహరిస్తూ రాధాకృహ్ణులు చేసిన రహస్యక్రీడలు విజయవంతమగు గాక.

ఇష్టదేవతా ప్రార్ధన

 

శ్లో. వాగ్దేవతా చరిత చిత్రిత చిత్తసద్మా
 పద్మావతీ చరణ చారణ చక్రవర్తీ
 శ్రీవాసుదేవ రతికేళి కధాసమేత
 మేతం కరోతి జయదేవ కవి: ప్రబంధం

వాగ్దేవతయైన సరస్వతీదేవి విలాసములు తన హృదయములో కలిగి, గీతాలకు తనభార్య పద్మావతితో నాట్యంచేతించే జయదేవుడను నేను, శ్రీకృష్ణుని శృంగారకేళిని వివరించు ప్రబంధాన్ని రచిస్తున్నాను.

కావ్య వివరణ

 

శ్లో.  యది హరిస్మరణే సరసమ్మనో
     యది విలాసకలాసు కుతూహలం
    మధుర కోమలకాంత పదావలీం
    శృణు తదా జయదేవ సరస్వతీం

హరిని స్మరించుటయందు మీ మనస్సు రసవంతమైతే, స్వామి విలాస కళలయందు మీకు కుతూహలం వుంటే, మధురములు కోమలములు మనోహరములు అయిన పదములు గల ఈ జయదేవకవి కవితలను వినండి.

కవి ప్రశంస

 

శ్లో. వాచ: పల్లవ యత్యుమాపతిధర స్సందర్భశుద్ధిం గిరాం
    జానీతే జయదేవ ఏవ శరణ: శ్లాఘ్యో దుమాహద్రుతే:
    శృంగారోత్తర సత్ప్రమేయ రచనై రాచార్య గోవర్ధన
    స్పర్ధీ కోపి నవిశ్రుతశ్శ్రుతిధరో ధోయీ కవిక్ష్మాపతి:

జయదేవుడు లక్ష్మణసేన మహారాజుయొక్క ఆస్థానకవి.  ఆ ఆస్థానంలో ఇతర కవీశ్వరుల గురించి, తన గురించి ఇలా చెబుతున్నాడు “ఉమాపతిధరుడు పదములను చిగురింపజేయును. ఆయన మాటలలో సందర్భశుద్ధి జయదేవకవియే ఎరుగును.  శరణ కవి ఊహించడానికే వీలుగాని శబ్దవేగం విషయంలో శ్లాఘాపాత్రుడు.  శృంగారరసమే ప్రధానంగా కల కావ్యరచనలో గోవర్ధనాచార్యులవారితో పోటీపడగలవారు లేరు.  శ్రుతిధరుడను కవి సుప్రసిద్ధుడు.  ధోయీకవి సాక్షాత్తు కవిరాజే”

(ముందు భాగంలో – మొదటి అష్టపది – దశావతార వర్ణనం)

{jcomments on}