ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

గీత గోవిందం-నవమ సర్గము

Like-o-Meter
[Total: 0 Average: 0]


అష్టాదశ అష్టపది – ఆడియో (Audio track of 18th Ashtapadi)

images/stories/ashtapadi/29 Asta 18 yadukula kambothi.mp3

 

 


నవమ: స్సర్గ: – ముగ్ధ ముకుంద:

 


 

శ్లో. తా మధ మన్మధ ఖిన్నాం
రతి రభస భిన్నాం విషాద సంపన్నాం
అనుచింతిత హరి చరితాం
కలహాంతరిత మువాచ రహసి సఖీ

 

 

మన్మధునిచే ఖిన్నురాలై, రతి కోరికచే భిన్నురాలై, విషాదముతో, హరి చరితములనే

నిరంతరం చింతనచేయు కలహాంతరిక యైన రాధ తో రహస్యంగా సఖి ఇలా అంటోంది.

 

అష్టపది 18

 

  • ఆమందముకుంద: ఘూర్జరీ రాగ యతి తాళాభ్యాం గీయతే

 

హరిరభిసరతి వహతి మధు పవనే
కిమపరమధిక సుఖం సఖి ! భవనే
మాధవే మాకురు మానిని ! మానమయే   (ధృవం)

తాళ ఫలాదపి గురుమతిసరసం
కిము విఫలీ కురుషే కుచ కలశం

కతి న కధితమిద మనుపద మచిరం
మా పరిహర హరిమతిశయ రుచిరం

కిమితి విషీదసి రోదిషి వికలా
విహసతి యువతి సభా తవ సకలా

మృదు నళినీదళ శీతల శయనే
హరిమవలోకయ సఫలయ నయనే

జనయసి మనసి కిమితి గురు ఖేదం
శృణు మమ వచన మనీహిత భేదం

హరిరుపయాతు వదతు బహు మధురం
కిమితి కరోషి హృదయమతివిధురం

శ్రీ జయదేవ భణిత మతిలలితం
సుఖయతు రసిక  జనం హరి చరితం

ఓ మానినీ ! మాధవుణ్ణి కోపించకు.  వసంతకాలపు పవనము వీచు సమయంలో హరి

నీ రహస్య ప్రదేశానికి వస్తున్నాడు.  ఇంతకన్నా సుఖకరమేమున్నది?

 

తాటి పండ్ల కన్నా పెద్దవి, రసవంతము అయిన నీ కుచ కలశాలను ఎందుకు వృధా

చేసికొంటావు?

 

మనోహరుడైన హరిని పరిహరించకు. ఈ విషయం నీకు ప్రతిసారీ ఎంతగానో చెబుతున్నా

ఏమని దు:ఖిస్తున్నావు ? ఎందుకు రోదిస్తున్నావు ? నీ స్నేహితురాండ్రు నిన్ను చూచి నవ్వుతున్నారు. 

నీటి తుంపరలతో చల్లనైన తామరాకుల శయ్యపై పవళించిన స్వామిని సేవించి, నీ కనులను సఫలం చేసికో.

 

ఎందుకంత మనస్సులో దు:ఖిస్తున్నావు? ఏ బేధంలేకుండా చెప్పే నా మాటలు విను. హరి నీ వద్దకు వచ్చి అతి మధురములైన పలుకులు పలుకును.  ఏల నీ హృదయాన్ని అలా

దు:ఖపెట్టుకొనుచున్నావు?

 

శ్రీ జయదేవుడు చెప్పిన అతి లలితములగు హరి చరితములు రసిక జనులకు సుఖము కలిగించుగాక.


శ్లో. స్నిగ్ధే యత్పరుషాసి యత్ప్రణమతి స్తబ్ధాసి యద్రాగిణి
ద్వేషథాసి యదున్ముఖే విముఖతాం యాతాసి తస్మింప్రియే
తద్యుక్తం విపరీత కారిణి తవ శ్రీ ఖండ చర్చా విషం
శీతాంశుస్తపనో హిమం హుతవహ: క్రీడా ముదో యాతనా:

నీ ప్రియుదు నీ యెడ స్నేహంగా ప్రవర్తిస్తున్నా, ఎందుకు పరుషంగా మాట్లాడుతున్నావు?  అతడు ప్రమాణం చేస్తున్నా, ఎందుకు స్తబ్దురాలవై వున్నావు?  అతడు అనురాగం కురిపించినా, ఎందుకు ద్వేషిస్తున్నావు? అతడు నీయెడ సుముఖంగా వున్నా, నీవెందుకు విముఖత చూపుతున్నావు?  నీ విపరీత ప్రవర్తన వలన చందనం విషం గానూ, చల్లని కిరణాల చంద్రుడు పరితపింపజేసే సూర్యునిగాను, హిమము అగ్ని వలెనూ, క్రీడల యందు ఆనందము యాతనగా మారడం యుక్తమే కదా?


శ్లో. సాంద్రానంద పురందరాది దివిషద్బృందై రమందాదరాత్
ఆనమ్రైర్మకుటేంద్ర నీల మణిభి: సందర్శితేందిందిరం
స్వచ్చందం మకరంద సుందర మిళన్మందాకినీ మేదురం
శ్రీ గోవింద పదారవిందమశుభ స్కందాయ వందామహే

ఎంతో ఆదరంతో నమ్రములై ఆనందం గల పురందరాది దేవతా బృందము యొక్క కిరీటాలలోని ఇంద్రనీల మణులే భ్రమరములుగా, సుందరంగా స్వచ్చంగా ప్రవహించే మందాకినీ నదియే మకరందంగా గల గోవిందుని పాదారవిందములను అశుభములు పోగొట్టుటకు వందనం చేస్తున్నాము.


||ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే కలహాంతరితావర్ణనే ముగ్ధ ముకుందో నామ నవమ స్సర్గ:||

 

{jcomments on}