“అంతరాంత జ్యోతిస్సీమల్ని బహిర్గతం” చేసేదే కవిత్వమని తన అభిప్రాయాన్ని చెప్పాడు తిలక్.
పరిణామాల పరిమాణాలను, అనుభవాల అనుశీలనను కలగలపినప్పుడు మనసులో ఓ వెలుగు పరచుకుంటుంది. ఆ వెలుగు సహాయంతో చూసినప్పుడు చూసిన వస్తువులే మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి. జడపదార్థంలో సైతం ఓ అస్తిత్వం అగుపిస్తుంది. ఆ అపురూపక్షణంలో మానవుడు ’కవి’యై కలవరిస్తాడు.
సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, వెన్నెల రాత్రులు, మెరిసే నక్షత్రాలు, గడ్డిపూలు, వాన చినుకులు, పారే నదులు, కదిలే నావలు – సౌందర్యోపాసకుడు మాత్రమే అయిన కవి ఈ ప్రకృతి వైచిత్రానికి అచ్చెరువొందుతూ అక్కడే కవితలల్లుకుంటూ ఉంటాడు. అదే కవి తాత్వికుడు కూడా అయితే, కాలప్రవాహపు ఒడ్డున నిలబడి పారే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వెలుగు చీకట్లు, సుఖ దు:ఖాలు, సంతోష విచారాలను తామరాకు మీది నీటిబొట్టులా ఒక సాక్షీభూతంగా గమనిస్తూ అన్వేషిస్తూ ఉంటాడు. కలవరింత ముగియగానే, ఆ అంతస్సీమల జ్యోతి కాస్త కనుమరుగు కాగానే లౌకిక జీవనపు పరిచిత చీకటిదారిలో ఒంటరి బాటసారిలా మిగిలిపోతాడు మానవుడు.
గాలి వీస్తే
మబ్బుల్లోని చినుకుల్ని
కురుస్తుంది చెట్టు
అని అంతరంగపు వెలుగు జాడను చెప్పగలిగే బి.వి.వి. ప్రసాదు గారి “నేను కాని నేను ఎవరు” అనే అన్వేషణలో మలి మజిలీ “నేనే ఈ క్షణం” సంకలనం ఆవకాయ.కామ్ పాఠకుల కోసం ఈపుస్తకంగా అందజేస్తున్నాం. అందుకోండి.
అభినందనలతో
ఆవకాయ.కామ్ బృందం