ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

eBooks – వ్యాసమాలతి

Like-o-Meter
[Total: 0 Average: 0]

తూలికా.నెట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిడదవోలు మాలతి గారు తెలుగు సాహిత్యరంగాన్ని బాగా అధ్యయనం చేసి, తమ భావాలను వ్యాసాల రూపంలో అక్షరబద్ధం చేసారు. ఆ వ్యాసపరంపరను “వ్యాసమాలతి” అన్న శీర్షి క్రింద ప్రచురించారు.
ఆవకాయ.కామ్ ద్వారా ఆ వ్యాసమాలిక ద్వితీయభాగాన్ని పాఠకుల కోసం అందిస్తున్నాం.
కవయిత్రి మొల్ల, తెలుగు భాషలో తొలి తరం కథకురాలైన భండారు అచ్చమాంబ గురించి, బహుముఖ ప్రజ్ఞాశాలియైన భానుమతి కథానికలు మొదలైన వైవిధ్యమయమైన విషయాలపై తమ వ్యాసాల్లో కూలంకషంగా చర్చించారు.
 
మాలతిగారి విషయనిరూపణ శైలి సూటిగా ఉంటుంది. రచనాశైలి, వాడిన భాష అత్యంత సరళాలు. అందువల్ల “ఏవో సాహిత్య వ్యాసాలంటారే, మేం చదవితే అర్థమౌతుందో లేదో!” అని ఎవ్వరూ సందేహపడనక్కరలేదు. ఒక్కో వ్యాసం చక్కటి కథలా అలరిస్తుంది.
ఈ వ్యాసాల ద్వారా మాలతిగారిలోని మరో సుగుణం పాఠకులకు పరిచయమౌతుంది. దొరకని విషయాలను ఎవరెవరి నుండి సేకరించారో, తెలియని విషయాలను ఎవరెవరి నుండి తెలుసుకున్నారో, క్లిష్ట పదాలకు ఏ యే పండితుల నుండి అర్థవివరాల్ని పొందారో ఆ వివరాలన్నింటినీ సందర్భానుసారంగా ప్రస్తావిస్తారు మాలతిగారు. అన్నీ తమకే తెలుసు అన్న అహమిక కాక ఏ యే సమాచారాన్ని ఏయే మూలాలనుండి గ్రహించారో వాటిల్ని పేర్కోవడం వల్ల ఆయా వ్యాసకర్తలు పడిన కష్టాన్ని, శ్రమను పాఠకులు తెలుసుకోగలుగుతారు. తద్వారా ఆ వ్యాసాలకు ప్రామాణికత్వం పెరుగుతుంది. అలాంటి ప్రామాణికతను మాలతిగారు తమ వ్యాసాల్లో చూపించారు.
 
తెలుగు సాహిత్యం గురించి, మరీ ముఖ్యంగా కథావ్యాసంగం గురించి తెలుసుకోవడానికి మాలతిగారి ఈ వ్యాస సంకలనం ఎంతగానో ఉపయుక్తం. మంచి వ్యాససంకలనాన్ని ఆవకాయ.కామ్ ద్వారా పాఠకులకు అందించడానికి సహృదయతతో అనుమతించిన నిడదవోలు మాలతిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
శుభాభినందనలతో
రఘోత్తమరావు కడప & సాయి కిరణ్ కుమార్ కొండముది
ఆవకాయ.కామ్ బృందం