ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

’కుక్కఊళలు’ (Dog Whislters)

Like-o-Meter
[Total: 0 Average: 0]

 


Original Author: Ravinar, MediaCrooks.com            Telugu Translation: C. Raghothama Rao

Read original article on MediaCrooks.com – Link >> DogWhistlers


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఏడు అంచెలుగా నిర్వహించడం సరైన అలోచన కాదు. 30 కోట్ల జనాభాతో, యు.పి. కంటే పెద్దదయిన అమెరికాలో ఎన్నికల్ని ఒక్కరోజులో నిర్వహించగా లేనిది ఉత్తరప్రదేశ్‍లో ఎందుకు సాధ్యం కాదు? అయితే, ఇలా అంచెలంచెలుగా ఎన్నికల్ని నిర్వహించడానికి గల కారణాలు కొన్ని లేకపోలేదు. అయినా సరే, ఇలా ఏడు అంచెల్లో, నెలరోజులకు పైబడి ఎన్నికల్ని నిర్వహిస్తే, ఆ పద్ధతి ఎన్నో అనారోగ్యకరమైన విషయాలకు దారితీస్తుంది. నేరాలు, అవినీతి, అక్రమ వ్యవహారాలు మొదలైనవి తప్పక చోటు చేసుకుంటాయి. వీటిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండబోదు. ఇవే కాకుండా, ఎన్నికల సాగతీత వల్ల మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకమైన బురద చల్లే ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉంది. ఇది అది అని కాక తమకు నచ్చని పార్టీ(ల)పై దుష్ప్రచారం చేసేందుకు ఈ సాగతీత అవకాశాన్ని ఇస్తుంది. సిక్యులర్స్ పెద్ద సంఖ్యలో ఉండే మీడియా వల్ల ఒకానొక్క పార్టీ దాడులకు గురి అవుతోంది. ఈ మీడియా సిక్యులర్స్ సృష్టించే ’కథనా’లు మనం ఊహించదగ్గవే అయినా అవి ఏయే రకాలుగా పుడతాయో, ఎంత దూరం వెళతాయో అన్న విషయం ఎప్పటికప్పుడు విస్మయాన్ని కలిగిస్తూవుంటుంది. మీడియా, AAP పార్టీయులు జట్టు కట్టారంటే చాలు, కుయుక్తులతో నిండిన విషయం మరింత రక్తి కడుతుంది.

గుర్‍మెహర్ ఉదంతాల్ని మనం చూసేసాం. అవి AAP & NDTV పుట్టించిన పుట్టగొడుగులుగా స్పష్టమయింది. అయితే, గుర్‍మెహర్ బాణం గురి తప్పింది. కుట్రదారులకు చావు తప్పి కన్ను లొట్టపోయింది. దీనితో బాటు ఎన్నికల సంఘం అవినీతికి పాల్పడుతోందంటూ అరవింద్ కేజ్రీవాల్ కొంత హంగామా చేసాడు. అరవింద్ కేజ్రీవాల్ ఒక్క అవివేకపు మాట మాట్లాడితే చాలు, అతని చేతిలో కీలుబొమ్మల్లాంటి బుద్ధిహీన మీడియా ఛానెల్స్ కోళ్ళై తెగ కూసేస్తాయి.

ప్రజలు వెర్రివాళ్ళు కారు. వారికి కేజ్రీవాల్ ఎత్తుగడలు బాగా తెలుసు. అతను ఎలా రాజకీయాల్లోకి వచ్చింది, ఎన్నికల బరిలోకి దూకింది, కాంగ్రెస్‍తో సంబంధం పెట్టుకొంది…ఇలా ప్రతి విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కేజ్రీకి ముఖ్యమంత్రి కావాలని కానీ, ప్రభుత్వ నిర్వహణ చేయాలని కానీ ఏ కోశానా లేదు. ఆ వెధవ పని అంతా తన అనుయాయి సిసోడియాకు అప్పగించేసాడు. కనుక, తీరిగ్గా ’నాటకాలు’ వేస్తూ కాలం వెళ్ళబుచ్చేస్తున్నాడు. దేశంలో అశాంతిని సృష్టించడం. అరాచకానికి ఊపిరులూదడం. ప్రధాని మోడి తప్పులు చేసేస్తున్నాడంటూ బూతులు తిట్టడం – ఇవే అతని నాటకాల అసలు ఉద్దేశాలు. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, ఆర్.ఎస్.ఎన్. సింగ్ కేజ్రీలోని ఈ ప్రతిభను ఎప్పుడో 2014 లోనే గుర్తించారు. కేజ్రీ తెగబడి చేస్తున్న దేశద్రోహ చర్యల్ని ఆనాడే ఎత్తి చూపారు సింగ్.

 

తాను “కుక్కఊళ”లు వేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని కేజ్రీవాల్ ఈనాటికీ నిలుపుకున్నాడు.గురు‍మెహర్ ఉదంతం తర్వాత మీడియాలోని కొద్దిమంది “ఈ కథలో విలన్ ఎవరు?” అంటూ ఒపీనియన్ పోల్స్‍ను నడిపారు. వీరు ఇచ్చిన ఆప్షన్స్ – AISA or Virendra Sehwag. చిన్నారి గుర్‍మెహర్ బుర్రతక్కువ యువతి అని లోకానికి తెలిసేవరకూ ఈ మీడియా ప్రబుద్ధులు తమ పోల్స్ తప్ప దేశంలో చేయదగ్గ మంచిపని ఏదీ లేదని ఊళలు వేస్తూ ఊరేగారు. దురదృష్టవశాత్తు, తాము నడిపిన పోల్స్‍లో కూడా మీడియా వెంగళప్పలకి చుక్కెదురయింది. చెంపపెట్లు తగిలాయి. ఈవిధంగా వారి ’కుక్కఊళ’లు మూలుగుల్లా మారాయి:

ఇహ అక్కడడక్కడా నిప్పు రాజేయ్యడానికి బర్ఖాదత్, NDTVలు ఉండనే ఉన్నాయి. వారి ఆటస్థలం JNU ఉండనే ఉంది. ఇవి కాక, కొద్దిమంది ’క్రిమినల్’ ఉపాధ్యాయులు కూడా అంటకాగుతూవున్నారు. విద్యార్థి రాజకీయాల్లో ప్రత్యక్షంగా తలదూరుస్తూ ఉద్యోగ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ఈ సోకాల్డ్ టీచర్లు వేటిల్ని, ఎలా బోధిస్తున్నారో నాకైతే అంతు పట్టదు. వీరు టీవీల్లోకి వచ్చి అలనాటి ట్రాజెడీ క్వీన్ ’మీనాకుమారి’లా విలపిస్తారు. ’ప్రొఫెసర్స్’ వేషాలు ధరించిన వీరికి ఉన్న ఒకేవొక్క, చిట్టచివరి వేదిక – NDTV.

’పనికివచ్చే పుట్టువెర్రు”లైన ఈ ప్రొఫెసర్లు ఉమర్ ఖలీద్ నుండి లేదా షెహ్లా రషీద్ నుండి ఏం వినదల్చుకునారు? ఇలాంటి JNU వారిలో కొందరిపై కేసులున్నాయి. వాటి నుండి వీరు తప్పించుకోలేక JNU క్యాంపస్‍లో దాక్కుంటున్నారు. ఈ కారణం వల్ల కోర్సుల్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఇలాంటి వీరు ఏ విజ్ఞతతో ఇతరులకు పాఠాల్ని చెబుతున్నారు? ఎన్నికలు జరుగుతున్న సమయంలో బురదను చల్లుతూ, వారి కేసుల నుండి మీ దృష్టిని మళ్ళించే వ్యవహారమే ఇదంతా. ఎంత తెలివి!

భారత వ్యతిరేక నినాదాల్ని చేసే జె.యు.డి (జమాత్ ఉద్ దావా) కాకుండా మీడియాలో “ఆజాద్ కాశ్మీర్”, “ఆజాద్ పాలస్తీనా” అంటూ కేకలు పెట్టడం ఒక రివాజుగా మారింది:

టెర్రరిస్టులు, వారి మద్దతుదారులు ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే – పబ్లిసిటీ. ఈ ’ప్రచార’మే వీరికి ప్రాణవాయువు. మన వెర్రిబాగుల మీడియా, వారు కోరేదానికన్నా ఎక్కువ ఆక్సిజన్‍ను సరఫరా చేసేస్తుంటాయి. ఇలా పనికిరాని వారికి ప్రచారం కల్పిస్తూ, దేశానికి ఉపయోగపడే ఎన్నో అంశాలను తెరవెనుకకు నెట్టేస్తుంటుంది మీడియా. దేశాన్ని బెదిరించేందుకే కాశ్మీర్ అంశంపై రెచ్చేగొట్టే విధంగా ఉన్న నినాదాలకు ప్రచార మివ్వడం జరుగుతోంది. కళ్ళెదుటే జరుగుతున్న వీటిల్ని చూస్తూ కూర్చున్న JNU వైస్ ఛాన్స్‍లర్ నిజంగా పిరికివాడే. చీటికి మాటికీ ఓవర్‍ యాక్షన్ సీన్లను పేల్చే కళను సిక్యులర్స్ వంటబట్టించుకున్నదానికి అసలు కారణం ఒకటుంది. కీలక అంశాలైన ఆర్థిక ప్రగతి, దేశ పురోగతి వంటి వాటినుండి ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు మళ్ళిస్తూవుండడమే వీరికి కావలసింది. ఇదే అసలు కారణం.

బెంగాల్‍లో పెరిగిపోతున్న దొంగ నోట్ల చెలామణి, కేరళలో కమ్యూనిస్టులు చేస్తున్న హత్యలు మొదలైన వాటిని కప్పిపుచ్చేందుకే ఈ నాటకాలను వేయడం జరుగుతోంది. ’డాగ్-విజిల్’ను కనిపెట్టడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. కుక్కలకు శిక్షణ ఇచ్చేప్పుడు మానవులు వినలేని రేంజ్‍లో ఉండే డాగ్ విజిల్‍ను వాడి శిక్షణనిస్తారు. కానీ నేడు ఆ ఉద్దేశం కంటే కూడా అనవసరపు ’ఊళ’లు ఎక్కువైపోయాయి. ఆ ఊళల్ని వినాల్సిన కుక్కలు తప్ప అందరూ వినగలుగుతున్నారు.

ఇది ఇట్లా ఉండగా, వీధుల్లో కొట్లాడే ఈ ఠక్కరి యు.పి. ఎన్నికల్లో బిజెపి గెలుపు గురించి ఇలా రచ్చపెట్టాడు:

రాజ్‍దీప్ లా కుక్కఊళను ఊదేవారు ఎవ్వరూ లేరు. కోతి తూచే కాటాలా, ’మంకీ బాలెన్స్’ చేయడంలో ఇతనికి ఇతనే సాటి. “యూ.పి.లో బిజెపి గెలుపు” పై హిందుస్తాన్ టైమ్స్‍లో ఇతను రాసిన వ్యాసం వెనుక గొప్ప విశ్లేషణ ఉండొచ్చునని మీరు భావించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, రాజ్‍దీప్ రాతల్లో అతను సాధారణంగా రాసే చెత్త స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ ఎన్నో తప్పులు చేసాడని, అయినా యూ.పీ. ఓటర్లు బుర్రలేనివారిలా అతనికే ఓట్లు వేస్తారని రాసాడు రాజ్‍దీప్. ఈ క్రింది రాతల్ని, ముఖ్యంగా ఎర్రగీత వేసిన వాటిల్ని, ఓమారు చదవండి…మీకే తెలుస్తుంది.

జయపూర్ అనే ప్రాంతాన్ని మోడి దత్తత తీసుకోవడం జరిగింది కాబట్టి, ఆ ప్రాంతాన్ని యూ.పీ. నుండి తద్వారా అఖిలేశ్ యాదవ్ పాలన నుండి తప్పించేసాడు రాజ్‍దీప్. ఇతను కానీ, బర్ఖా కానీ తమకు కావల్సిన ముఖ్యమైన, రహస్యమైన సమాచారాన్ని పాన్‍వాలాలు, గాజులు అమ్మేవారి నుండి సేకరిస్తారు. ఇటువంటి చిల్లర వర్తకుల్ని డీమనిటైజేషన్ కొంచెం బాధించినా, వారు మోదీకే వోటు వేయాలని భావిస్తున్నారు. ఇది కాక, తమ పట్ల పక్షపాతం చూపించడం జరుగుతోందనే తప్పుడు ఆరోపణల్ని చేస్తూ కొందరు లేనిపోని భయాల్ని రేకెత్తించే పనిలో ఉన్నారు. ఇక్కడ నేను మిమ్మల్ని ఓ ప్రసంగాన్ని చదవమని చెప్పదల్చాను. “బ్రూటస్ గౌరవనీయుడు” అనే మార్క్ ఆంటోనీ ప్రసంగం తప్పక చదవాలి. అప్పుడే, B.A. – English చదివిన రాజ్‍దీప్ అసలు ఆంతర్యం మీకు అర్థమవుతుంది. ప్రజలు బ్రూటస్‍ను చంపినట్టుగా, మోదీని ఎన్నికల్లో నిర్మూలించవచ్చుననేదే రాజ్‍దీప్ ఆశ. ఇటువంటి మీడియావాళ్ళు ఎన్నికల గురించి మాట్లాడ్డం మొదలెడ్తే…ఇదిగో…ఇదే మీకు దక్కేది!

అంటే, ఇప్పుడు ఈ దేశంలో “ముస్లిమ్ వీధులు” ఉన్నాయన్న మాట. ’మహాత్మా’ గాంధీ ఈ దేశంకు తెచ్చిపెట్టిన విషాదాన్ని మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను. మాటలు నేర్చిన చిలకల మందలా “ముస్లిమ్ ప్రాంతాల్లో జైశ్రీరామ్ నినాదాలు రెచ్చగొట్టేవిగా ఉన్నా”యని మీడియావారు గగ్గోలపెట్టారు. ’కుక్కఊళ’లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రతిరోజూ ఐదుసార్లు మైకుల్లో గట్టిగా వినిపించే “అజాన్” ఎంతమందికి ఇబ్బందిని కలిగిస్తోందో, వీరికి పట్టదు. అలానే, ఫలానొక్కరోజున ప్రార్థనల కోసమని కనిపించిన ప్రతి ఖాళీ స్థలాన్నీ ఆక్రమించే ముస్లిములు వీరి కంటికి కనబడరు. పై ట్వీట్‍ను విసిరిన రామలక్ష్మి Washington Post కు పనిచేస్తోంది. ఆ పోస్టే ఈమధ్యనే బర్ఖాదత్‍ను కూడా అక్కున చేర్చుకుంది. కనుక, ఈ రామలక్ష్మి నుండి అటువంటి చెత్త ట్వీట్ రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.

ఈ ’రామలక్ష్మి’, ఆ ’సీతారాం’ (యేచూరి) – రాముడి పేరును తలవడమే నేరమని ఏడ్చే ఈ వెర్రిబాగుల వాళ్ళ పేర్లలో ’రామ’ ఉండడం నాకు తెగ నవ్వు తెప్పిస్తోంది.

ఆ గుర్‍మెహర్ పెట్టెబేడ సర్దుకుని, వెళ్ళిపోయింది. తన ఫేస్‍బుక్ అకౌంట్‍ను తొలగించేసింది. ట్విటర్ అకౌంట్ మాత్రం ఇంకా ఉంది. ఆమె ఫేస్‍బుక్ ఖాతాలో అనేక విషయాలపై విపరీతమైన చెత్తను చేర్చిపెట్టింది అమ్మణ్ణి. యథావిధిగా భావప్రకటన స్వేచ్ఛ, ముఖ్యంగా మహిళల భావస్వేచ్ఛ, అణగారిపోతోందని మీడియా పక్షులు కూసాయి. ఓ ఆప్‍పక్షి గుర్‍మెహర్ ఘటన గురించి ఈ క్రింది కార్టూన్ వేసాడు.

పై కార్టూన్‍లో అసభ్యకరమైన భాగాన్ని నేను నలుపు రంగుతో కప్పాల్సివచ్చింది. ఎందుకంటే నేను వారిలా ’అభ్యుదయ’వాదిని ఇంకా కాలేదు. గత రెండు వారాలకు పైబడి కొద్దిమంది రాజకీయులు, మీడియావాళ్ళు పనికిరాని విషయాల పట్ల మన దృష్టిని మరల్చే ప్రయత్నంలో తలమునకలైపోయారు. యు.పి. ఎన్నికల్లో ఎదురవ్వబోయే అవమానాన్ని కప్పిపుచ్చడం కోసం జరుగుతున్న తతంతమే ఇదంతా. ’కుక్కఊళ’ కుక్కలకే వినబడేట్టు, ఈ డాగ్-విజిలర్స్ చాలా నైపుణ్యంగా తమ డాగ్-విజిల్ రాజకీయాల్ని సాగించేస్తుంటారు. ఈ ’కుక్కఊళ’ రాజకీయాలను చేయడానికి ప్రబలమైన కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమయింది, ఎన్నికల్లో సరైన వారిని ఎన్నుకోకుండా ప్రజల్ని దిక్కుతప్పించడం ప్రధానమయింది. ఎన్నికల రంగంలో నిలబడిన వారిలో సరైన ప్రతినిధి ఎవరనే విషయాన్ని ఆలోచించనివ్వకుండా ఎవరో కూసిన కూతలపై, రాసిన రాతలపై రాద్ధాంతాల్ని సృష్టించి, మన చూపును మరల్చడమే ’డాగ్ విజిల్’ రాజకీయాల అసలైన గురి.’సిక్యులర్’గా మారానని సూచించే మాటల్ని పలికే ఉద్ధవ్ ఠాక్రే పరువు పోగొట్టుకున్నాడు. ఇది జరిగి ఎంతోకాలం కాలేదు.

ప్రస్తుతానికి నేను కొద్దిమంది ’కుక్కఊళ’కారుల్ని మాత్రమే పేర్కొన్నాను. మీరు కూడా ఓసారి చుట్టుపక్కల పరిశీలనగా చూడండి. బోల్డుమంది ’కుక్కఊళ’లు కనబడకపోరు. వారి వేసే ’ఊళలు’ మీకు వినబడకా పోవు!

@@@@@