మంత్రద్రష్ట – మూడవ తరంగం

Spread the love
Like-o-Meter
[Total: 4 Average: 4.3]

రెండవ భాగం ఇక్కడ చదవవచ్చు: మంత్రద్రష్ట – రెండవ తరంగం

కౌశిక మహారాజు వస్తున్న సంగతి తెలిసి కూచున్న ఆసనాన్ని వదలి లేచి వచ్చారు వశిష్ఠులు. వారు వాకిలి వద్దకు వచ్చే లోపే రాజు ప్రవేశించాడు.

“రాజేశ్వరులకు స్వాగతం…” అని అన్నాడు ఋషీంద్రుడు.

బ్రహ్మ కాంతిపుంజంలాగా ప్రకాశిస్తున్న వశిష్ఠునికి సాష్టాంగ నమస్కారము చేసాడు కౌశికుడు. అతని వెనకాలే పర్ణకుటీరం లోనికి వచ్చి వశిష్ఠులు కూర్చున్న తరువాత తనకై సిద్ధం చేసిన ఆసనంలో కూర్చొన్నాడు.

వశిష్ఠులు ఇచ్చిన స్వాగతమునందు ఆవగింజంత కూడా కృత్రిమత లేదు. జరగబోయే ఘోర విపత్తుకు కారణమయ్యే వ్యక్తి తన ఎదురుగనే ఉన్నాడన్న విషయం మనసున మెదలినా, ధైర్యస్థైర్యాలను వదలని ధీరచిత్తం ఆయనలో కనిపిస్తున్నది.

ఆపదను నివారించుకోవాలన్న ఆశ లేశమైనా లేదు. ఆపద వలన ఎమవుతుందోనన్న భయం లేదు. సముద్రపు తుఫానుకు చిక్కి దానితో పోరాడుతున్న కొండంత అలలు, ఆ తుఫానును మింగివేసేట్లు కనిపించు సందర్భంలో దాన్నంతటినీ ఎత్తైన కొండపైన నిలచి సావధానంగా చూచువాడికి భీభత్సం, సంతోషం కలగలసి వచ్చేట్టి ఒక భావన ఆయన మనసులో నాట్యం చేస్తోంది.

కౌశికుడు ఆ బ్రహ్మర్షి బ్రహ్మ వర్చస్సును చూసి సంతోషించాడు. ఆయనకు తన దగ్గరున్న మంచి కానుకలిచ్చి ఒప్పించుకోవాలని అతని మనో బుద్ధులు ఆశపడగా అంతరాంతరాల్లో తన సర్వస్వాన్నీ పణంగా పెట్టి…కాదు…దానికి మించి ఇంకేదయినా ఇచ్చైనా సరే ఆ ఋషిపుంగవుని నుండి ఆ గోవును సంగ్రహించాలని క్షత్రియసహజమైన, దుర్జయమైన ఆశ ప్రయత్నిస్తోంది.

అలా ఆ వీరపుంగవుడు ఈ జ్ఞానపుంగవుని వద్దకు వచ్చాడు.

ఒకటి తన ముందున్న దానిని, తనకేమి అడ్డు వచ్చినా, వాటన్నింటినీ తొలగించి ముక్కలు చేయడానికి సిద్ధమైన సుడిగాలి. ఇంకొకటి, ఏమి వచ్చినా రానీ అని తొణకకుండా తన సమతౌల్యంపై నమ్మకం ఉంచి కంపించకుండా నిలుచున్న పర్వత రాజం.

కౌశికుడే మొదట మాట్లాడాడు – “భగవానులు మన్నించాలి! సంధ్యాహోమం అయిన తరువాత వచ్చి చూడవచ్చునని అనుజ్ఞ అయినదట కానీ క్షత్రియునిది రాజసమైన మనసు. దేనిలోనూ ఆలస్యాన్ని సహించే అలవాటు లేదు. అందువలన మనసులోని ఆశను దేవర వారికి విన్నవించు తహతహతో ఆత్రపడి వచ్చాను. ఇందులో నా అపరాధమేమీ లేదు కదా?”

“నీవు చేసినదాంట్లో అపరాధమేముంది? మనసులోని కోరికను చెప్పడానికై నోరు ఆత్రపడుతోంది. అంతేకదా! సెలవివ్వండి!”

కౌశికుడు నవ్వుతూ చెప్పాడు – “ఈ రోజు తమ ఆశ్రమంలో జరిగిన సమారాధన సంభ్రమం సామ్రాట్టులకే సాధ్యం కానిది. ఇహలోక చింతన లేని ఋషివరులు, పరలోక చింతననే సదా స్మరించే తపస్వులు ఇంతటి అమోఘమైన సమారాధనను ఎలాగ పూర్తి చేసారా అని విచారించాను. అదంతా తమ దగ్గర ఉన్న నందిని ధేనువు ప్రభావమని తెలిసింది. గురుదేవా! ఇంతటి ఉత్తమోత్తమ వస్తువు రత్నసమానమైనది. అది ఆశ్రమంలో ఉండటం కన్నా రాజభవనంలో ఉంటే బాగుంటుంది కదా!”

వశిష్ఠులు వస్తున్న నవ్వును ఆపుకున్నారు.

తన దగ్గరున్న అమూల్యమైన వస్తువునొక దానిని ఇతరులకు తలవంచని మహావీరుడు, అతి ప్రబలుడైన కౌశికుడు అడుగుతున్నాడు. దానిని ఇవ్వకపోతే ఎలాగ అన్న ఎటువంటి విచారమూ, భయమూ లేని నిశ్చలమైన మనస్సుతో గంభీరంగా సెలవిచ్చారు.

ఆయన గొంతు యొక్క ధ్వని మాత్రం తగ్గుస్థాయిలోనే ఆవేశం కొంచం కూడా లేక వేసవి కాలపు నదిలా పలుచబడినా నిర్మలంగా ఉంది.

“రాజేంద్రా! ఈ ప్రపంచంలోని భోగ సామగ్రులన్నీ దేవతలు ఇచ్చేవే. వారు ఇవ్వకపోతే మనకు తీసుకోవడానికి సాధ్యం కాదు. ఇవ్వడము, ఇవ్వకపోవడమూ వారి ఇష్టం. ఆ ఇచ్ఛ వారికి కలిగేది మన కర్మఫలం వల్ల మాత్రమే! కాబట్టి, ఒక భోగ సాధనం కావాలంటే ఇతరుల వద్ద ఉన్నది చూసి అది నాకు కావాలి అనడం కన్నా అటువంటిది నాకు కూడా ఒకటి ప్రసాదించమని అడుగడం సరియైనది. అది మన సనాతన ధర్మపు పాదు వంటిది. తనకు కావలసిన దానిని సంపాదించుకోవడానికై ’యజ్ఞము’ అను మంచి ఉపాయం ఉన్నపుడు ఇంకొకరిని ఇవ్వమని అడగడం విహిత ధర్మం కాదు.”

ఆ మాట విని మహర్షి తన మాటకు ఎదురు చెప్పాడని కౌశికుని మనసు కలుషితమయ్యింది. నిష్కల్మషంగా శుద్ధంగా ఉన్న హృదయం నుండి వచ్చిన ఋషి వచనంలో కూడా తనను అవమానం చేస్తున్నాడన్న కల్మషంనే చూశాడు. అయినా, ఎదురుగా ఉన్నది బ్రహ్మర్షులని తెలిసినవాడు గనక ఆ భావననూ, దాని ఫలమైన నిరాశను, కోపాన్నీ మ్రింగి పైకి నవ్వుతూ చెప్పాడు –

“మహర్షులు ధర్మ స్వరూపం తెలిసినవారు. ఇష్టార్థసిద్ధికి సాధనం యజ్ఞం అని తమరు ఆడిన మాట కాదని నిరాకరించడానికి ఎవరికీ సాధ్యము కాదు. అయినా ఒక మాట. రాజ్యమంతా కూడా పట్టాభిషేకం పొందిన రాజుది. ఇంతటి సుసంపన్నమైన భూమండలాన్నే దేవతలు రాజుకు ప్రసాదించారు. దానివలన ఆ రాజ్యానికి అధికారి అయిన రాజుకు తన రాజ్యంలో ఎక్కడ ఏమున్నా తీసుకొను అధికారం ఉంటుంది కాదా?”

వశిష్ఠులు నవ్వి ” కౌశిక మహారాజు ధర్మపరాయణుడు. కాబట్టే దీనిని చెపుతున్నాను. రాగ ద్వేషాలతో నిండిన మనస్సుకు ధర్మము కనపడుట కష్టమే. కాబట్టి ధర్మమును పాలించ వలెననుకొనువారు, మొదట తమ మనస్సును శుద్ధంగా చేసుకోవాలి. రాజ్యంలో ఉన్న సర్వంనకూ రాజే స్వామి. నిజము. అయితే ఓ రాజా! రాజు అన్నవాడు ధర్మానికి సేవకుడు. ధర్మమును రక్షించడానికి బద్ధ కంకణుడై దీక్ష పట్టినవాడు లోభ మోహములతో ధర్మమును నిర్ణయించకూడదు. ధర్మాభివృద్ధి కోసం రాజు ఏ పని చేసినా అది ధర్మమే! అయినా, తమ తమ ధర్మ సాధన కొరకు ప్రజలు ఉంచుకొన్న వస్తువులపై రాజుకు అధికారం లేదు. ఏ పని అయినా ఎవరు చేసినా దానివలన ధర్మాభివృద్ధి అయినట్టయితే అది ధర్మమే. అలా కాకుంటే, అది అధర్మం. ఎవరైననూ, ముఖ్యముగా ధర్మరక్షకుడైనవాడు అధర్మంను ఆచరించరాదు. అధర్మంను ఆచరిండం అనగా ఆత్మవినాశనాన్ని ఆహ్వానించినట్లే!”

రాజా కౌశుకుడు తన పని ఇంత కష్టమనుకొనలేదు. అనుకోని విధంగా అడ్డువచ్చిన ధర్మవిచారం ఆతనిని శాంతింపజేయుటకు బదులు ఉద్రిక్తుడిని చేసింది. కానీ అతను పైకి దానిని కనిపించనీయలేదు. లోలోపల అసమాధానాన్ని పొంది వినయమును విడువకుండా పలికాడు – ” దేవా, క్షత్రియులు బాహు బల సంపన్నులు. తమకు కావలసిన వస్తువును సంగ్రహించుటకు ఆ బాహుబలము వారికి దేవుడిచ్చిన సాధనం. మంత్రం చేత సాధించుటకు కష్టమైన దానిని సాహసం చేత సాధించుట క్షత్రియ ధర్మం. అది అలా ఉండనిండు. తమరు నందినిని హోమధేనువుగా ఉంచుకొనినారట . ఈ దినమే, ఈ ఆశ్రమానికి, కొమ్ముల నుండి గిట్టల వరకూ సర్వాంగ భూషితములైన వేయి గోవులను ఈ కౌశికుడు తమకు కానుకగా అర్పించుకొనును. ఒక్కొక్క పూటకు ఒక్కొక్క గోవు కడివెడు పాలు ఇచ్చును. అవి తీసుకుని మహర్షులు మంచిమనసుతో నందినిని నాకు అనుగ్రహించండి.”

“ఓ రాజా! నేను నందిని మీద లోభంతో ఈ మాట చెప్పడం లేదు. నందిని దేవతల ధేనువు. దినదినమూ ఆచరించ వలసిన దేవహోమం కొరకై కావలసిన క్షీరంను అందించడానికి దేవతలు ఆ గోమాతను ఇక్కడికి పంపి ఉన్నారు. ఆ మాత ఇచ్చే దివ్య క్షీరాన్ని హోమం చేయుట వలన దేవతలకు అమోఘమయిన తృప్తి కలుగుతుంది. అలాగే తృప్తులయిన దేవతలు లోక క్షేమాన్ని పెంపొందిస్తారు. ఆ మాత ఇక్కడున్నా, ఎక్కడున్నా, దేవతల సొంతం. ప్రస్తుతం ఇక్కడున్నా ఆమె మీద నాకు యే యధికారమూ లేదు. కనుక నేనేమి చేయాలి?”

రాజు, నాద స్వరానికి ముగ్ధురాలైన మహా సర్పం వలె ఒక్క ఘడియ మాట రాక ఉండిపోయాడు. సప్త సముద్రాలకు ఇవతల, అవతల ఎదురులేని వాడు ఈరోజు, ఈ పర్ణశాలలో తన ఆశ వమ్ము అగుట చూస్తున్నాడు. దేవతలనందరినీ మూటగట్టి తీసుకు రాగలిగిన వీర శ్రేష్ఠునికి అస్త్రశస్త్రాలు లేని ఈ ముని అడ్డమా? రోషమే రోషము యనునట్లు అయిపోయినది అతని మనసు. ఆ రోషం రేపిన గాయం విజృంభించి సర్వమునూ స్వాహా చేయాలి. కానీ, ఆ ప్రశాంత సాగరం ఎదురుగా కూర్చొనియున్న అగ్ని, చల్లటి సముద్రపు గాలికి శీతలమవదా? కౌశికుడు అంతటినీ దిగమింగెను. మింగిననూ జీర్ణం కానట్టి రోషమది. రాని నవ్వును తెచ్చుకుని అనెను. మాటలో పొడిగింపు కనపడకుండా మొరటుతనం తెలియకుండా హృదయపు గాయం అగుపడకుండా అన్నాడు.

అయితే, ఆ గొంతు లోని మార్పు ’ఈతను ముందటి కౌశికుడు కాడు’ అని చెప్పకనే చెప్పింది.

“దేవా! అలాగయితే నందిని దేవతల సొంతం అంటారు?”

” ఔను, సందేహమే లేదు.” వశిష్ఠులు తొణకక బెణకక శిలామూర్తిలా కనిపిస్తూ అన్నారు. ఆ మాటలు తగిలిన హృదయంలో ఎంతగా విప్లవం చెలరేగుతుందో, దానివలన ఎటువంటి ప్రతిక్రియలు కలుగుతాయో తెలిసిన వాడివలె, అన్నింటికీ సిద్ధమైనవాడివలె, పైనుండి పడే పిడుగుపాటును స్వీకరించేందుకు సంసిద్ధుడైనట్టున్నది అతని మనోభావం.

కౌశికుడు లేచి నిలబడ్డాడు.

నిష్టూరమైనా నిజమైన మాటను పలికాడు – “మహారాజు అంటే సర్వ దేవతలు తనలో ఉన్నవాడని. దిక్పాలకుల అంగాలన్నీ అతనిలో ప్రతిష్ఠితమై ఉంటాయి. అలాగే దివ్యాంశ సంపన్నుడైన రాజుగా నేను దేవతల సొత్తైన నందినిని నాదిగా ప్రకటిస్తున్నాను. అది ఎక్కడున్నా ఇక మీదట అది ఈ రాజుకు సొంతం. నేను నా సొమ్మును తీసుకొని పోవచ్చు కదా?” అని అన్నాడు.

వశిష్ఠులు దాని అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించి చిన్నగా నవ్వి – “ఔను రాజు దివ్యాంశ సంపన్నుడు. దేవాంశ సంభూతుడు. దేవతల సొమ్మును తీసుకోవడానికి రాజుకు ఎదురు చెప్పేవారు ఎవరూ లేరు. అయితే, నందినీ ధేనువు ఇతర ధేనువుల వలె కాదు. కౌశికా! నందిని తనను తాను కాపాడుకోగలదు. కామధేనువు కూతురయిన నందిని పై బల ప్రయోగం చేయగలవాడు ఇంకనూ పుట్టలేదు. ఒకవేళ సాహసంతో బలప్రయోగం చేస్తాననువాడు గడ్డిపోచతో యజ్ఞేశ్వరుడిని తరిమి వేయగలను అన్నట్లే ఇక నీ ఇష్టం!” అని పలికాడు.

కౌశికుడు – “కానివ్వండి! పరీక్ష చేసి చూస్తాను.” అని లేచి బయలుదేవి వెళ్ళాడు.

ఇంకా ఉంది…

Your views are valuable to us!