ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చుప్పనాతి – భాగం 14

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

రావణుడు మళ్ళీ మారీచుని దగ్గరికి వెళ్ళి బంగారు లేడిగా పర్ణశాల సమీపాన సంచరించమన్నప్పుడు మారీచుడన్నాడట –

“రాముడు నీవన్నట్టు కఠినుడూ, అకారణంగా శత్రు సంహారం చేసేవాడు కాదు. రామో విగ్రహవాన్ ధర్మః ధర్మమే రాముని రూపంలో అవతరించినదనవచ్చు. ఆ రాముడి శస్త్రాస్త్ర పాండిత్యం నాకెప్పటినుంచో తెలుసు సుమా! విశ్వామిత్రునితో కలిసి యాగ సంరక్షణకు వచ్చిన ఆ బాల రామునిచేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయి ఇలా తాపస వేషంలో అతని కంట పడకుండా, బతికుంటే బలుసాకు తినవచ్చునన్న ధోరణిలో జీవితం గడిపాను కొన్ని రోజులు. అంత చిన్న వయసులోనే ఆ రాముడు నాకు చావంటే ఏమిటో తెలిసేలా చేసినవాడు. మరి ఇప్పుడు, అతని బల పరాక్రమాలు యే స్థాయిలో ఉంటాయో ఊహించుకుంటేనే వెన్నులోంచీ భయం పుట్టుకొస్తున్నది.

ఈ అనుభవం చాలక మళ్ళీ మరోసారి మండే నాలుక, తీక్ష్ణమైన కోరలూ, మాంసాన్ని భక్షించే మృగంగా దండకారణ్యంలో సంచరిస్తూ, మళ్ళీ మునులను చంపి తింటూ, మరో ఇద్దరు రాక్షసులతో కలిసి ఆ రామునికి గుణపాఠం చెప్పాలని అతని దగ్గరికి వెళ్ళాను. అతని తాపసి వేషం చూసి, అతణ్ణి తేలికగా అంచనా వేసుకుని చంపాలనే ప్రయత్నించాను. కానీ, అతడు వజ్రముతో సమానమైన మూడు బాణములను నేను, నాతో ఉన్న మరి ఇద్దరు రాక్షసులమీద వేశాడు. దురదృష్టం వల్ల వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణించగా, నేను సముద్రపు ఆవలి ఒడ్డుకు చేరుకుని దాక్కున్నాను. ఇలా – చావు తప్పి కన్ను లొట్టపోయి! రాముని బాణము, సముద్రపు ఆవలి ఒడ్డుకు వచ్చి నన్ను కానక వెనుకకు మరలి వెళ్ళటం కళ్ళారా చూసిన నేను గర్వం అణగిపోగా ఇదిగో ఇక్కడ యోగ మార్గాన్ని అవలంబిస్తూ ‘బ్రదుకు జీవుడా’ అని రోజులు వెళ్ళదీస్తున్నాను.

నీకు సరైన గూఢచారులు లేరు. నిజాలను చెప్పి నిన్ను సమాధానపరచే అమాత్యులు లేరు. నీ శ్రేయోభిలాషిని నేను చెబుతున్నాను విను! సీత పతివ్రతా రత్నం. ప్రజ్వలించే అగ్ని జ్వాల వంటిది. తొందర పడకు. విభీషణుడు వంటి ధర్మాత్ములైన మంత్రులతో ఆలోచించి నిర్ణయం తీసుకో నాయనా!!”

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
అని ఎంతగా చెప్పినా అవన్నీ చెవిటి వానిముందు శంఖ నాదంలా నిరుపయోగాలైపోయాయనీ, రావణుడు మారీచుని భయపెట్టి సీతను అపహరించటంలో సాయపడేందుకు అంగీకరింపజేశాడనీ, ఆ తరువాత కథ అంతా తాననుకున్నట్టే జరుగబోనుందనీ విని , నమ్మకం కలిగిన మీనాక్షి ఆనందానికి హద్దులే లేవు.

ఇక అక్కడినుండీ, జరిగిన కథ అంతా తెలుసుకుంటూనే ఉంది మీనాక్షి.

సీతను రావణుడు అశోక వనంలో పెట్టడం, రాక్షస స్త్రీలతో ఎంతగా భయపెట్టినా ఆమె రామ ధ్యానాన్ని వదలక రావణున్ని పూచిక పుల్లవలెనే పరిగణించటం, హనుమ లంకలో సీతను దర్శించటం, లంకా దహనం, సేతు నిర్మాణం, రామ రావణ యుద్ధం, ఇవన్నీ పూసగుచ్చినట్టు ఆమెకు చేరవేసే చారులను నియమించుకుంది మీనాక్షి

  
చివరికేమైంది?

రావణ వధానంతరం, సీతతో కూడిన శ్రీరాముడు, తనవారందరితో, అయోధ్యకు విజయ దరహాసంతో వెళ్ళిపోయాడు – లంకకు విభీషణున్ని రాజును చేసి

ధర్మాత్ముడైన సొదరుడు విభీషణుడు, మీనాక్షిని మన్నించి, లంకలోనే నివాసముండనిచ్చాడు కూడా.

కానీ, ఇంతవరకూ జరిగినదానికి మూల కారణం మీనాక్షి అనే అందరికీ తెలిసిపోవటం వల్ల ఎక్కడ, ఎవరు ఎదురైనా ఒక చీదరింపు. ఒక నిరాదరణ. ఒక ఎత్తిపొడుపు మాట.

తానేమో ఇలా మనసులోనే కుమిలి పోతూ…

”ఆ…అన్నీ చేసి, ఇప్పుడేమో ఏమీ తెలియని చుప్పనాతిలా ఎంత అమాయకంగా నటిస్తోందో!”

“అమ్మో…మిటుకులాడి చేష్టలే అన్నీ!”

“ఛీ ఛీ…ఇంకా బతికి ఉండటమెందుకో? ఏ నూతిలోనో, గోతిలోనో దూకి ఛావక?”

ఇటువంటి మాటలు ఎన్నెన్నో!

ముక్కూ, చెవులూ పోగొట్టుకున్న అవమానం కంటే ఈ మాటలన్నీ వింటూ అనుభవించే అవమానం మరీ భరించలేనిదిగా ఉంది.

అయితే ఒక్క విషయం మీనాక్షి గమనించి, ఓ విధంగా ఆనందించింది కూడా!

ఈ మొత్తం క్రమంలో, సీతారాములనూ, లక్ష్మణుణ్ణి శత్రు భావనతోనైనా తలచుకుంటూనే ఉంది తానిన్నినాళ్ళూ. ఇవన్నీ గుర్తొస్తే, మీనాక్షిలోని గాంధర్వాంశ మేల్కొంటుంది కాసేపు ఆ ఆలోచనల్లో కొట్టుకుపోతుంది తెలియకుండానే.

వైరభక్తి అంటే ఇదేనా?

హిరణ్యాక్ష, హిరణ్య కశిపులను విష్ణువు ఏవిధంగా మట్టుపెట్టాడో తెలిసిన కథే కదా! వాళ్ళూ ఎప్పుడూ శ్రీమహావిష్ణువును ఓడించాలన్న తహతహతో ఉండేవాళ్ళనీ, అలా వాళ్ళ కోరిక త్వరగా నెరవేరిందనీ కూడా సవసవగా విన్నది. తన సంగతీ అంతేనా?

ఏమో! ఒకవేళ అదే నిజమైతే తన కోరిక నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న మాట!

ఆ శుభ సమయమెప్పుడు వస్తుందో తెలియటం లేదు. మనసులో సాగర మథనం.

ఈ ఆలోచనల్లో ఎలాగైనా ఓసారి సీతాదేవిని చూసి, తన తప్పును అంగీకరించి, క్షమాపణ వేడుకోవాలనీ, అప్పుడైనా, తనకీ అపవాదునుంచీ విముక్తి లభిస్తుందేమోననిపించేది మీనాక్షికి.

ఇదిలా వుండగా,పిడుగులాంటి వార్త!

లోక నిందను ఎదుర్కొనేందుకు రాముడు నిండు గర్భిణి సీతను అడవుల్లో వదిలిపెట్టిరమ్మని, తన అనుంగు తమ్ముడు లక్ష్మణుణ్ణే ఆజ్ఞాపించగా, అన్నకు అడ్డు చెప్పే సాహసం చేయలేక ఆ తమ్ముడు ఆ సాధ్విని అడవుల్లో వదిలిపెట్టాడట!

ఆమె రోదిస్తూ వెళ్తూ, భాగ్యవశాన వాల్మీకి ఆశ్రమానికి చేరుకుని అక్కడే ఇరువురు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చిందట! ఇప్పుడామె అక్కడే నివాసముందట!

ఇవన్నీ విన్న మీనాక్షి నిరుత్తరురాలైంది

“ఏమిటిదంతా? అప్పుడైతే, సీతా హరణానికి ఒక విధంగా తానే కారకురాలు కావటమైంది, ఆ లోక నిందను తానింకా అనుభవిస్తూనే ఉంది. కానీ, ఇదేమిటి మరి? ఏదో చిన్నపాటి లోక నిందకు సీతను ఇంత క్రూరంగా శిక్షించటం శ్రీరామునికి తగునా? దీనికి కారణమేమిటి?”

ఈ సంగతి తెలిసిన మీనాక్షికి ఇక కాలు నిలువ లేదు. ఉన్నట్టుండి ఒకసారి వాల్మీకి ఆశ్రమ ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్ళింది.

(ఇంకా ఉంది…)