ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చుప్పనాతి – భాగం 2

Like-o-Meter
[Total: 11 Average: 4.2]

 

పంచవటి

పేరే ఎంత పవిత్రంగా అనిపిస్తుందో!

ఐదు వటవృక్షాల చల్లని నీడలో సీతారాములు పర్ణశాల నిర్మించుకుని, ఆ స్వచ్చమైన ప్రకృతిలో, గోదావరి గలగలలు వింటూ, కందమూల ఫలాలతో జీవితాన్ని గడపటం – పెళ్ళైన కొద్ది రోజులకే ఇలా అడవుల్లో కాపురం పెట్టవలసి రావటం – ఈ సంఘటనలన్నీ వాల్మీకి సాక్షాత్తూ కళ్ళెదుట జరిగిన సంఘటనలుగా వర్ణించటం, ఎంతో అద్భుతంగా అనిపించినా, శార్వరికి ఊర్మిళ విషయంలోనూ, అహల్య విషయంలోనూ ఎన్నో సందేహాలున్నాయి.

అవన్నీ తీరే రోజుకోసం ఎదురుచూస్తూంది – ఎంతో ఆత్రంగా!

వంశీతో అంటే – ‘ఇదిగో శారూ, వాళంతా దేవర్షులు. వాళ్ళ కావ్య సృష్టిలో లోపాలెంచటం ఖచ్చితంగా అవివేకమే. అటువంటి పిచ్చి ఊహలు మానెయ్.’ అంటాడు నిర్ద్వంద్వంగా.

అక్కడినుండీ శూర్పణఖ మందిర్ కి తీసుకెళ్ళాడు డ్రైవర్.

‘ఇదేంటి? శూర్పణఖకూ మందిరమా! తమాషాగా ఉందే! ఒక విధంగా శూర్పణఖ వల్లే కదా, సీతాదేవిని రావణాసురుడు అపహరించింది? మరి ఆవిడకు ఇక్కడేమో మందిర్ కట్టారా? ‘ ఆశ్చరంగా లోపలికి వెళ్ళబోతూ అప్పటికే అక్కడి అరుగులమీద కూర్చుని వున్న కొందరు ఆడవాళ్ళ మాటలు చెవిన బడ్డాయి శార్వరికి.

కాళ్ళు నెప్పులన్న నెపంతో తానూ కాస్త దూరంగా వాళ్ళను గమనించనట్టుగానే గమనిస్తూ కూర్చుంది శార్వరి, ఓ వైపు వంశీ తొందర పెడుతున్నా.

ఆ గ్రూప్లో ఆడవాళ్ళే అందరూ. స్నేహితురాళ్ళందరూ తెలుగు ప్రాంతాలనుండీ వచ్చినట్టున్నారు.

‘ఇహ లేవండే తల్లుల్లారా..లోపలికెళ్ళొద్దాం.’

‘అబ్బా..సరోజా..నా కాళ్ళు పడిపోయాయబ్బా..నేన్రాను లోపలికి..మీరెళ్ళిరండి.’

‘ఏందే సీతమ్మా!  డియరెస్ట్ ఫ్రెండ్ ను…సారీ.. .నీ శత్రువును చూసేదానికి మనసొప్పడం లేదా ఏంది?’

“శత్రువా? నాకెవరున్నారే శత్రువులు??”

“ఆ..లోపలుందికదా.. ఆ చుప్పనాతి..శూర్పణఖమ్మ”

అక్కడున్న పదిమందీ భళ్ళున నవ్వేశారు. ఆ సీతమ్మ అనబడే ఆవిడా వాళ్ళతో బాటూ నవ్వేసింది. ఇంతలో మరో ఆవిడ అందుకుంది.

‘నిజమేలేవే రత్నా! సీతమ్మ కష్టాలకు యీలోపలున్న మహా తల్లే కదా కారణం? ఐనా అదేంటే..శూర్పణఖకూ మందిరం కట్టడమేంటబ్బా?’

టీం లీడర్ కాబోలు, ఆ సరోజ అనే ఆవిడంది..’మందిరమంటే మనలాగా కాదుగానీ, ఇదో స్మారికగా అనుకోండే అమ్మా!! హిరోషిమా, నాగసాకీల్లో, అమెరికా లో ట్విన్ టవర్స్ దగ్గర స్మారక నిర్మాణాల్లాగా అనుకోండి. పదండి పదండి..ఐదు నిముషాల్లో వచ్చేద్దాం.’

‘ఆ ..బో జెప్పినవే? అంత దాంకా..ఆ సీతారాములు సిలకా గోరింకల మాదిరి తిరుగుతానే ఉండారు..ఆ అరణ్యంలో. పాపం..ఆ లచ్చుమన్న వాల్లకు గుడిసేచిచ్చె..అడవిలోకి పొయ్ వేటాడి, తినే తిండి దెచ్చిచ్చె..రాత్రీ పగలూ కాపలా గాస్తానే ఉండె! ఈల్లిద్దరూ మాట్లాడుకుంటా, పాటలు బాడుకుంటా ..అడవిలో తిరిగిందే తిరిగిందే! ఆడ యీ లచ్చుమన్న బార్యెట్టుండాదో..అని ఓనాడైనా అనుకున్నారా ఏంది? ఆ ఊర్మిలమ్మ శాపం జుట్టుకోని, సీతట్టా రావనాసురుడి అసోకవనంలో తిప్పలు బణ్ణాది అంతే.’ పక్కా సీమ యాసలో సీతాయణాన్ని కళ్ళతో చూసినట్టే చెప్పిందావిడెవరో.

శార్వరికి యీ పాయింటేదో నచ్చేసింది.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY
 అంతలో మరో ఆవిడ అందుకుంది..’అదేం కాదు గీతొదినా! పాపం ఊర్మిలమ్మ పద్నాలుగేళ్ళూ పండుడే పండుడు..మొగుడు అయోధ్యకు రాంగానె, ఫ్రెష్ గా తయారై, ఆయనకు మంగలారతిచ్చి, ఇంట్లోకి బిల్చింది..పాపం అలిసిపొయ్నాడు మొగుడు అన్నా వదినెకి సేవల్జేసి జేసి ‘ అని తెలంగాణా యాస గుబాళించిందావిడ మాటల్లో.

అంతే..ఆచోట మళ్ళీ నవ్వుల విరి జల్లులు.

‘మీరెన్నైనా చెప్పండి..నేనా చుప్పనాతి శూర్పణఖను చూసేందుకు రానబ్బా!!’ మొండికేసింది ఇందాకటి ఆవిడెవరో! పాపం..కాళ్ళనొప్పులేమో! ఆవిణ్ణి అక్క డే వదిలి తక్కిన వాళ్ళంతా, బిలబిలా లేచి, లోపలికెళ్ళేందుకు సిద్ధమయ్యారు. వీళ్ళ మాటల్లో పడి లోపలికింకా వెళ్ళనేలేదు శార్వరి కానీ, వంశీ లోపలికెళ్ళి వచ్చేశాడు కూడా అప్పుడే.

‘పద పద..వెళ్ళిపోదాం శారూ! పెద్దగా చూసేందుకెమీ లేదులే అక్కడ’ అంటూ శార్వరిని తొందర పెట్టాడు.

“ఆ..అదేం కుదరదు సారూ..నేను లోపలికి వెళ్ళాలీ..ఆ చుప్పనాతి శూర్పణఖను దర్శించుకుని రావల్సిందే. వీళ్ళ మాటలెంత బాగున్నాయో ఆవిడ గురించి” తెగ ముచ్చట పడిపోయింది శార్వరి.

గబగబా లోపలికి వెళ్ళింది శార్వరి.

అక్కడ శూర్పణఖ, లక్ష్మణుడు వృత్తాంతానికి ఆధునికంగా నిర్మించిన మూర్తులను చూసింది. లక్ష్మణుడి చేతిలో కత్తి. తెగిన ముక్కుతో కోపంగా నిల్చున్న శూర్పణఖ. ఇందాక లేడీస్ బృందం వాళ్ళింకా అక్కడే ఉన్నారు. ‘హాయ్..’ అంటూ పలకరించింది వాళ్ళను. వాళ్ళూ నవ్వుతూ శార్వరిని చూశారు. ‘ఎక్కడినుంచొచ్చారు?’ అడిగింది వాళ్ళని.

‘హైద్రాబాద్ నుంచీ…మీరు?’

‘హైద్రాబాదేనండీ. మీరంతా ఒకే కుటుంబమా?  హైద్రాబాద్ లో ఎక్కడ?”

‘లేదండీ..ఒక కుటుంబం కాదు కానీ..అందరమూ ఫ్రెండ్స్మి. సింగపూర్ సిటీ లో ఉంటాం అందరమూ.’

“అదే..అదే..మీ మాటల్లో రాయలసీమ, తెలంగాణా అటు విజయవాడ యాసలు బాగాగుబాళిస్తున్నాయి. అందరూ ఫ్రెండ్సా??”

“ఔనండీ..సరోజ అన్నావిడ అంది..’అందరి పిల్లలూ, పెద్ద చదువుల్లో ఉన్నారు. మేమంతా, ఇలా అప్పుడప్పుడూ ఏదో ట్రిప్స్ వేసుకుంటూ ఉంటాము.”

“అలాగా…’ అని అందరింతోనూ ఓ సెల్ఫీ కూడా తీసుకుంది. తనకదో ఆనందం. అంతలోనే ఆ బృందంలో ఒకావిడ అడిగింది శార్వరిని  – “మీ పేరేంటండీ?” అని.

“శార్వరీ”

“అదేలెండి..మీవారు మిమ్మల్ని చారూ చారూ అని పిలుస్తుంటే…చారుమతేమో అనుకున్నా!” అంటూ కిసుక్కున నవ్విందావిడ.

పక్కనున్నావిడ ఆవిడ చేతిమీద గిల్లిందేమో ‘అబ్బ‘ అంటూ కోపం ప్రకటించిందంతలోనే.

ఆవిడేమందో బృందంలో మరొకావిడ ఆవిడనెందుకు గిల్లిందో అర్థమయ్యేందుకో పది సెకన్ల టైం పట్టింది శార్వరికి.

“చారూ చారూ” అన్న పదాన్ని ఒత్తి పలికి వెటకారం చేసిందన్నమాట తన పేరును ముందావిడ.

“అమ్మ తల్లోయ్! ఏదో కాస్త చనువుగా మాట్లాడేసరికి నన్నే ఆటపట్టిస్తుందీవిడ!” అని ఉక్రోషం వచ్చేసింది శార్వరికి.

“అదేంటండీ? శారూ అని కదా మావారు నన్ను పిలిచింది! చారూ అని మీకు వినబడిందంటే మీరోసారి ఈ.ఎన్.టీ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాలేమో చూసుకోండి!” అనేసింది విసురుగా.

శార్వరి జేవురించిన ముఖం చూసి ఆ బృందం నాయకురాలు సరోజ అన్నావిడ, శార్వరి చేతులు పట్టుకుని క్షమించమన్నట్టుగా “శార్వరి గారూ, ఏమీ అనుకోకండి. ఇందాక ఆవిడ మిమ్మల్ని ఆటపట్టించినందుకు ఈ రకంగా పుటుక్కున మాట్లాడటం ఆవిడకలవాటే. మేమెప్పటికప్పుడు చెబుతూనే ఉంటాం. సమయం సందర్భం లేకుండా ముందూ వెనకూ చూడకుండా ఎవరితోనూ ఇలా మాట్లాడకూ అనీ. వింటేనా? మీపేరు చాలా బాగుంది. శార్వరి అంటే రజని కదా! మీరలా స్వచ్ఛంగా నవ్వుతుంటే ఓర్వలేక ఆ ఏడుపు మొహంది అలా అనేసింది. మరోసారి సారీ.” అంది.

“ఛఛ..మీరెందుకు ఫీలౌతారు? అందరూ ఒకేలా ఎలా ఉంటారు లెండి! ఇది ఈ స్థల మహాత్యమేమోననిపిస్తోంది. అసలే శూర్పణఖ మందిరంలో ఉన్నాం కదా! ఆవిడ తన ప్రభావం కాస్త చూపించిందేమో మన మీద” అని తేలిగ్గా నవ్వేసింది శార్వరి కాస్త తేరుకుని

వీళ్ళిద్దరూ, మరో నలుగురూ ఇలా మాట్లాడుకుంటుంటే మరోవైపునుంచీ  ‘చారూ చారూ ‘ అని అన్నావిడను మరో ఆవిడ బలవంతంగా బైటికి లాక్కెళ్ళింది.

వాళ్ళతో శార్వరి కూడా బైటికి వచ్చేసి, వెనక్కి తిరిగి చూడకుండా డోర్ ర్ తీసిఉంచిన కార్లోకి జొరబడి విసురుగా డోర్ వేసింది.

‘ఇవేవీ తెలియని వంశీ – “శారూ! ఏంటి ఆ చుప్పనాతి శూర్పణఖ నిన్ను తొందరగానే వదిలిందే?’ అన్నాడు వెటకారంగా.

“లేదు లేదు. ఇంకా కాసేపుండవమ్మా కబుర్లు చెప్పుకుందాం. నా కథంతా చెబుతాను నీకు అంది పాపం! నేనే ఇప్పటికింతే సంగతులు మహాతల్లీ!అసలే చుప్పనాతి అంటున్నారందరూ నిన్ను. నీతో స్నేహం చేస్తే నన్నూ నీ గాటిలో కట్టేస్తారని వచ్చేశాను.” అంది విసురుగా.

పనిలో పనిగా “ఇదిగో బాబూ, ఇక మీదట నన్ను శారూ శారూ అని పిలవకు. నాకిష్టం లేదు” అనేసింది హెచ్చరిస్తున్నట్టు చూపుడు వేలు చూపిస్తూ.

”అరె, ఏమైంది నీకు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావ్? ఆ శూర్పణఖ మందిరానికి పోవటం తప్పైపోయిందేమోననిపిస్తోంది. ఆవిడేదో నిన్ను…”

‘ఔను. ఆవిడే ఆవేశించింది నాలో! నాకాపేరు ఇష్టంలేదు. ఇక మీద నన్నలా పిలవకు. అంతే.”

ఆ మాటంటుంటే శార్వరి కళ్ళల్లో నీళ్ళు ఉబికి వచ్చేశాయి.

“ఏంటిరా? ఏమైంది నీకివ్వాళ? ఏమిటిది చిన్నపిల్లలా? ఇంతకూ ఏమైందక్కడ? నిన్నెవరైనా ఎగతాళి చేశారా? మగాళ్ళెవరూ లేరే అక్కడ?”

కాఫీ మిషతో కారును ఓ హోటల్ ముందు ఆపించి, శార్వరిని రెస్ట్ రూం కి వెళ్ళి రమ్మన్నాడు వంశీ.

కాస్త కుదుటపడ్డాక ఓదార్పుగా మాట్లాడాడు. ఆ మాటలతో తేరుకుని శార్వరి జరిగిందంతా చెప్పింది.

“ఓస్! ఇంతేనా? ఆవిడెవరో కుళ్ళుమోత్తనంతో ఏదో అందని నా మీదెగిరావా? భలే దానివే! వాళ్ళేమైనా నిన్ను మళ్ళీమళ్ళీ కలుస్తారా నిన్నేడిపించటానికి? పెద్ద ఉద్యోగస్తురాలివి. ఇలా చిన్న మాటకే ఉడుక్కుని నామీద ఎగిరితే ఎలాగమ్మాయ్? యూ సిల్లీ! సరే, నిన్ను శారూ అని ఇకమీదట పిలువను. మరి ఏమని పిలవాలబ్బా?”

ఇంతలో కాఫీ వచ్చింది.

సర్వర్ అటు వెళ్ళగానే శార్వరి నవ్వేసింది.

“సారీ వంశీ, నిన్నేదేదో అనేశాను. అసలు ఆ స్థలంలోనే ఏదో ఉంది. అందుకే నాకంత కోపం వచ్చేసింది. ఆవిడెవరో ఏదో నవ్వులాటకే అలా అన్నా, నేనంత సీరియస్ గా తీసుకోవడమేమిటో నాకూ అర్థం కావటం లేదు. హైద్రాబాద్ వెళ్ళిన వెంటనే ఈ చుప్పనాతి శూర్పణఖ సంగతేమిటో చూడాల్సిందే! మళ్ళీ ఓ సారి.పేద్ధ…సారీ! ఇప్పుడెక్కడికి వెళ్ళాలి మనమింక?”

”నాదేం లేదు. నీవు వెళ్దామంటేనే వెళ్దాం. లేదూ రూం కెళ్ళి సాయంత్రం దాకా రెస్ట్ తీసుకుందామంటే..ఓకే…’ అన్నాడు వంశీ.

“లేదు లేదు, సీతా గుహ చూడాలి కదా ఇంకా. అది కూడా చూసేద్దాం పద”

 

@@@@@

సీత గుహ దగ్గర ఒక చిన్న బిలం లాంటిదానిలో దూరి లోపలికెళ్ళాలి.

లోపలికి సెల్ ఫోనులూ, బంగారు వస్తువులూ, పర్సులూ తీసుకెళ్ళకూడదట దొంగల భయం వల్ల. కార్ డ్రైవర్ చెప్పాడు.

అన్నీ కార్ లోనే పెట్టి వెళ్ళారిద్దరూ.

అలా ఆ బిలం గుండా వెళ్తే, లోపల నల్ల రాతి రాముడున్నాడు.

దర్శనం చేసుకుంటూ శార్వరి, ఇందాకటి తన ప్రవర్తనకు క్షమాపణలు కోరుకుని, తమకు పండులాంటి పాపాయి నిమ్మని సీతమ్మను వేడుకుంది.

అక్కడినుంచీ హోటల్ చేరుకుని భోజనం ముగించుకుని రూం కి చేరుకున్నారిద్దరూ. తీరా టైం చూస్తే ఇంకా రెండున్నరే. సాయంత్రం ఆరింటికి ఫ్లైట్.

నాలుగింటికి ఏర్ పోర్ట్ కి వెళ్ళొచ్చు. అందుకని కాస్త ఫ్రెష్ అయి, అలా పడక మీదికి చేరుకున్నారో లేదో,- శార్వరికి కునుకు పట్టేసింది.

(ఇంకా ఉంది…)