ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

చుప్పనాతి – భాగం 6

Like-o-Meter
[Total: 4 Average: 4.3]

 

నిశ్చల జలధి నట్ట నడుమ ఎటువంటి అలలూ లేని నిశ్చలత.

అప్పుడప్పుడూ అటూ ఇటూ అంతెత్తున గాలిలోకి ఎగురుతూ మళ్ళీ నీటిలోకే ఆటలా దూకేస్తున్న చేపల గుంపులు.

ఒక్కోసారి అదేదో వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు చేపల పరుగులు.

అంతలోనే వాటిని పట్టుకుని, కబళించేందుకై నోరు తెరచుకుని వస్తున్నపెద్ద చేపలు.

వీటన్నిటి మధ్యా నిశ్చలంగా, కళ్ళు మూసుకుని, ఊపిరిని బిగబట్టి జలసమాధిలో ఒక స్త్రీ.

ఆ నీటిలో మునిగి ఆ జల జీవుల మధ్య ఎటువంటి భయమూ లేకుండా కళ్ళు మూసుకుని ధ్యానమగ్న అయిన ఆ స్త్రీ ఎవరు?

ఇక్కడామె ఏమి చేస్తున్నది?  తపస్సా? తపస్సే ఐతే ఎప్పటినుంచీ చేస్తున్నది? ఏ ఫలాన్ని ఆశించి యీ తపస్సు? అసలు ఇంతటి భయంకర జలధిలో ఊపిరి బిగబట్టి ప్రాణాలను ఫణంగా పెట్టి ఆమె ఇలా చేస్తుందంటే ఏ శాప కారణమో కాదు కదా?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆమె మనసే కదా చెప్పాలి మరి!

ఇంతకూ ఊపిరి బిగబట్టి జలసమాధిలో ఉందే కానీ మనసు ఊరకుంటుందా? దాని దారిన అది తన యీ తపస్సుకు నేపథ్యాన్ని తలచుకుంటూ,ఆ జలధిలోనూ ఆరని పశ్చాత్తాప జ్వాలల్లో రగిలిపోతూ, ఇప్పుడు తాను చేస్తున్న యీ కఠిన తపస్సుకు తాను కోరిన ఫలితాన్ని గురించి కూడా, లోలోపలే ఆ సృష్టికర్త ను వేడుకుంటూనే ఉంది పాపం.

ఆమె మనసులో సుళ్ళు తిరుగుతున్న ఆమె నేపథ్యాన్ని మాటల్లో అనువదించుకుంటే. -శరీరం నుండీ విడివడి, ఒక ఆత్మగా ఆమె తన పూర్వ జన్మను పరికిస్తున్న తరుణంలో – తర్కాతర్కాలకు అతీతంగా, ఒక చిత్ర కథన రీతిలో మీనాక్షి కథ ఇప్పుడు ఆవిష్కృతమైంది.

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY
 

‘ఎంత శాంత సుందరాలా దృక్కులు? ఎంతటి శీతల కల్పవృక్ష ఛాయలాదృక్కులు? ఎంతటి పవిత్రతా మందిరాలా దృక్కులు? ఆ చూపులకే బందీ ఐపోయాడు కదా ఆ పుంసాం మోహన రూపుడు?

మరి తనకెందుకురాలేదా దృక్కులు? ఈ శాంత సుందరిని ఇప్పుడా చూడటమిలా?

ఊహూ…ఇప్పటి అనుభవమే కాదిది!

ఈమె జీవితంలో ఎన్నెన్ని సంఘటనలు జరిగిపోయాయో తెలియదూ తనకు? ఎన్ని ఒడుదుడుకులను చూసింది ఈమె ఇప్పటిదాకా జీవితంలో! తాను భూపుత్రికనని ఎన్నిసార్లో చెప్పుకునేది వివిధ సందర్భాలలో. అంటే, ఒకరకంగా ఓర్పుకూ, సంయమనానికీ, వైవిధ్యానికీ అలాగే దృఢ సంకల్పానికీ కూడా తన ఆదర్శం భూమాతే అని చెప్పుకోవ టం కాక మరేమిటి? ఎందుకలా చెప్పుకునేదో కానీ, యీమె జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు, ఏమాత్రం ఊహించలేనివి కూడా జరిగిపోయాయి. ఐనా ఎంత నిబ్బరం యీమెలో? తన పతిదేవుడు రాముణ్ణే తలచుకుంటూ, ఎన్నెన్ని కష్టాలను అలవోకగా యీదేసిందీవిడ?

ఈమె కొచ్చిన కష్టాలన్నీ తన వల్లే నని లోకం కోడై కూస్తూనే ఉంది ఇప్పటిదాకా? ఐనా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటూనే ఉంటారందరూ. అంటే, ఒక జీవికి జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనా ముందే వ్రాసి పెట్టబడే ఉంటుందనీ, అలా జరిగి తీరటమే కానీ ఫలానా వారి వల్లే ఇదంతా జరిగిందనీ నిర్ధారించి చెప్పలేమనే కదా అర్థం? మరి నన్నెందుకు అందరూ ఆడిపోసుకుంటారో అర్థమే కాదు!”

మీనాక్షి కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.

అలా కన్నీళ్ళు తుడుచుకునే క్రమంలో తన కళ్ళ అందాలు గుర్తొచ్చాయామెకు.

ఒక్కసారిగా శరీరంలోకి విద్యుత్తు పాకినట్టయింది.

“తన చూపులెప్పుడూ కసి చూపులంటుండేవాడు తన భర్త విద్యుజ్జిహ్వుడు. తన చూపులెప్పుడూ రెచ్చగొట్టేలా ఉంటాయంటూ అల్లుకుపోయేవాడు తన పెనిమిటి. తన కళ్ళు మైకపు గనులనీ, వాటిలో పడ్డవాడికి విముక్తే లేదనీ ఎంత మురిసిపోయేవాడో! కానీ యేమిటి లాభం? ఎంతగానో ప్రేమించి మరీ పెళ్ళి చేసుకున్నా, జీవితంలోని ఆనందాన్ని పూర్తిగా గ్రోలక ముందే తన భర్త తన సోదరుడి కరవాలానికే బలై కనరాని లోకాలకు వెళ్ళిపోయాడు.’’

తమాలవృక్ష శాఖలలో దాదాపు దాక్కున్నట్టుగానే కూర్చుని, సీతాదేవి పవిత్ర సౌందర్యాన్ని వీక్షిస్తూ, విస్తుపోతున్న మీనాక్షి మనసులోని కలకలమిది.

ఇలా చాటునుండీ ఎవరినీ చూడకూడదని తననెవరో హెచ్చరిస్తున్నట్టే ఉంటుందెప్పుడూ!

అసలిలా యీ జగన్మోహన సుందరిని యీమె పతిదేవునితో సహా ఆనాడెప్పుడో, మృదు మంజుల శృంగార క్రీడలలో చాటునుంచీ ఓ సారి చూసిన తరువాత గుండె ఏదో తీయని బాధతో మూల్గింది. ఆ స్థానం అసలు తనది కాదూ? అని పదే పదే ప్రశ్నించింది.

ఆ బాధలో కాస్త ఉపశమనానికై కళ్ళు అలా వాల్చిందో లేదో…ఒక కల.


ఆ కల తననింకా వేటాడుతూనే ఉంది.

కారణం, యీ సీత శాంత సుందర విగ్రహం తన జీవితాన్నింకా ప్రశ్నార్థకంగానే నిలపటమే కదా?

ఇప్పుడు కూడా ఆ కలలోని ప్రతి దృశ్యమూ, కళ్ళకు కట్టినట్టే గుర్తుంది.

అది స్వర్గ లోకం.

తానొక గంధర్వ కన్యట!

వివాహితైనా మనసులో మరులుగొలిపే విష్ణువు రూపం. తన మనసు ఎప్పుడూ అతని చుట్టే పరిభ్రమిస్తూ ఉండేది.

ఆయన అర్ధాంగిగా లక్ష్మీదేవి సర్వలోకాధీశ్వరిగా మన్ననలందుకుంటుంటే తన మనసులో ఏదో ఈర్ష్య.

తన స్థానాన్ని దురాక్రమణ చేసి, ఆ శ్రీమన్నారాయణుని దేవేరిగా హృదయాన్ని అధిష్ఠించిందేమిటి యీవిడ? అని ఒకటే అక్కసు. వీలు దొరికితే చాలు, భర్తకు తెలియకుండా వారి ఏకాంత క్రీడలను కూడా చూస్తూ కోపాగ్ని కీలలను వారిపై కురిపించాలన్న ఆత్రుత.

ఓసారిలాగే చాటునుంచీ వాళ్ళ సరస సల్లాపాలను గమనిస్తూ, పంటి బిగువున కోపాన్ని అణుచుకుంటున్న తరుణాన ఏమైందో ఎమో కానీ ఉన్నట్టుండి వారిరువురిపై ఒక దట్టమైన తెర కమ్ముకుంది.

మనసు దహించుకుని పోయింది.

ఎక్కడిదీ తెర? తనకూ, తన ప్రత్యర్థులకూ మధ్య??

కోపంతో దగ్గరగా వెళ్ళి చేతులతో తొలగించాలనే చూసింది. కానీ, ఆ తెర నిజంగా తెర కాదు.

స్పర్శతో తెలిసింది అది సర్ప ఫణి అని.

అంటే, విష్ణువుకు ఎల్లవేళలా శయ్యగా, గొడుగులా,నివాస భూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, ఆనుకునే దిండుగా, ఏ సమయానికి ఎలా కావాలో అలాగే సేవలందించే శేషుడీయన!

తానిలా చాటునుండీ, లక్ష్మీ నారాయణుల శృంగార క్రీడలను చూడటం దాస్య భక్తికి నిదర్శనంగా కొనియాడబడే యీ శేషుడికీ కోపం తెప్పించిందన్న మాట! ఇంకేముంది? ఇలా పడగలతో వారిని కమ్మేసి, వారి చుట్టూ తెర కల్పించి, తన ఈర్ష్యా దృక్కులనుండీ తన స్వామిని, కాపాడుకున్నాడీ స్వామి భక్తుడు.

చాలా కోపం వచ్చింది యీ ఆదిశేషునిపై.

అడ్డు తొలగమని శక్తి కొద్దీ పిడి గుద్దులు కురిపించింది. ముక్కు మీద మరీ ఎక్కువగా. పడగ మీదా ఎడ పెడా కాళ్ళతో తన్నింది.

ఏమి చేసినా అడ్డు తొలగడే?

ఇంతలో ఎక్కడినుంచీ వచ్చాడో తన భర్త వచ్చేశాడు. తన భార్య ఇలా ఆదిశేషుడిపై పిడికిళ్ళతో చేస్తున్న యుద్ధం చూసి వారించబోయాడు. కామంతో కళ్ళు కప్పిన తాను అతని మాట వింటేనా!

నిజానికి అతనేగా నా భర్త! తన భార్య ఇలా సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి వాహనం పై పిచ్చి కోపంతో విరుచుకు పడటం తట్టుకోలేక పోయాడాయన.

“‘నీవిప్పుడు చేసిన యీ చెడ్డ పనికి ఫలితంగా యీ ఆదిశేషుడే నీ భరతం పట్టబోతాడు, తొందరలోనే! నీ భర్తనే అవమానపరచావు కాబట్టి నీకు దాంపత్య సుఖమూ దక్కదు…పో భ్రష్టా!” అని గట్టిగా శాపం ఇస్తున్నప్పుడే….

కల చెదిరిపోయింది.

ఒళ్ళంతా చెమటలు.

అంటే…ఆ కల నిజమేనా? నా యీ జన్మ ఆ శాప ఫలితమేనా?

తాను మరచిపోలేని ఆ కల గుర్తుకొచ్చి, మీనాక్షి మనస్సు అగ్నిగుండంలో వేగిపోతున్నట్టుగా కుతకుతలాడి పోయింది.

గతమంతా గిర్రున ఓసారి కళ్ళముందు సాక్షాత్కరించింది.

(ఇంకా ఉంది…)