ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మంత్రద్రష్ట – ఒకటవ తరంగం

Like-o-Meter
[Total: 5 Average: 4.6]

శ్రీః

నా మాట

మొదటగా ’నా మాట’ అని ఇక్కడ రాసుకొన్నందుకు క్షమాపణలు.

ఎందుకంటే, అత్యంత నిబద్ధతతో, నియమ నిష్ఠలతో, అనేక సంవత్సరాలు శ్రమించి, ఎన్నో పుస్తకాల నుండి ఎన్నో విషయాలను సేకరించడమే కాక ఇతరుల అనుభవాలను, స్వానుభవాన్నీ క్రోడీకరించి రాసిన దేవుడి నరసింహశాస్త్రి గారి రచనలో ’నా మాట’గా చెప్పుకోవడానికి ఏముంటుంది? “ఆయన పక్కన నిలుచుకోవాలన్న ఉద్దేశం కాకపోతే!” అని నాకే అనిపించింది.

ఇది తప్పే !

ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి నాకున్న అర్హత ఏమిటి? అని తరచి ఆలోచించిన తరువాత ఆయనే తన ముందుమాటలో చెప్పినట్లు – విశ్వామిత్రుడి సిద్ధులు పొందిన, పొందగలవారు ఎందరో ఉన్నారు. ఆ సిద్ధులు లేకున్నా, రాకున్నా ఆ దారిన తప్పటడుగులు వేసే భాగ్యం నాకు కలిగింది. వారు వివరించిన విషయాలను ప్రత్యక్షంగా కాకపోయినా, అనుమాన ప్రమాణము చేత అర్థం చేసుకోగల శక్తి గురుకృప, దైవకృప వలన నాకు కలిగింది. దైవోపాసన వలన ఆయన చెప్పిన మాటల లోని సరియైన అర్థాన్ని గ్రహించగల శక్తి కలిగినది.

ఉపాసకులకు అంతర్ముఖంగా వచ్చే మార్పులు, అవి ఏ విధంగా అనుభవానికి వస్తాయన్నవి కొంతవరకూ అర్థమయింది. ఇందులోని వేదాంత విషయాలు అర్థం కాకుంటే అనువాదం చేయడానికి అది అనర్హతే అవుతుంది.

అర్థం తెలియని అనువాదముంటుందా?

రెండవది – ఇది కేవలం అనువాదమని చెప్పడానికి లేదు. దేవుడు గారి కథా, కథనాల్లో ఎక్కడా మార్పులుగానీ, తగ్గించడంగానీ చేయలేదు. కానీ అక్కడక్కడా, అవసరమనిపించిన చోట నేను నా అనుభవానికి వచ్చినవి, అర్థమయిన వాటిల్ని అదనంగా చేర్చి వ్రాసాను. ఆ వ్రాయడంలో వీలయినంత వరకూ దేవుడు గారి మనస్సులోకి తొంగి చూచి, “ఈ మాట వారైతే యెలా రాసేవారు” అని యోచించి, వారి శైలిలోనే రాయడం జరిగింది. సంభాషణలు, సన్నివేశాలు మూలరచనకు భంగం కానీ, విపరీతార్థాలు గానీ రాకుండు ఉండేట్లు జాగ్రత వహించి వ్రాయడం జరిగింది.

వీటన్నిటికీ మించి ’మహా బ్రాహ్మణ’ను మొదటిసారి చదివినపుడు ఏదో అంతఃశ్శక్తి నన్ను తట్టి లేపినట్లు, ఇది తప్పక అనువాదం కావలసిన పుస్తకమని నాకు తోచింది. అది చదివిన తరువాత నాకు వచ్చిన ప్రేరణ అంతా ఇంతా కాదు.

’మహా బ్రాహ్మణ ’ పేరును ’ మహా బ్రాహ్మణుడు ’ గా మార్చి ఉండవచ్చు. కానీ, నేటి కాల పరిస్థితులను బట్టి మరియు పేరేదైనను ఇది వశిష్ఠ విశ్వామిత్రుల కథ. కథ చదువుతుండగా పాఠకులకు వారిలో ఎవరు గొప్ప అన్నది ఒకరు చెప్పకుండానే విశదమవుతుంది.

దేవుడుగారు చివరికి గాయత్రి మంత్రము , సంధ్యా వందనము మొదలైన విషయాలపై తమ దృష్ఠిని కేంద్రీకరించినందున దానికి పరోక్షంగా వశిష్ఠుని పాత్ర ఉన్నా కూడా గాయత్రీ మంత్రాన్ని దర్శించినది విశ్వామిత్రుడే గనక ఆయనకు అన్వయించేట్లు “మంత్రద్రష్ట” అని పేరు పెట్టాను. ఇది అనువాదకుని అందుబాటులో ఉండే స్వేచ్ఛకు లోబడే ఉందని నా నమ్మకం.

ఈ అనువాదాన్ని చదివిన, చదవబోతున్న పాఠకులందరికీ నా ధన్యవాదాలు.

’విభాతమిత్ర’

 

 

 

 

 

 మంత్రద్రష్ట – ఒకటవ తరంగం తరువాతి పుటలో 

 

ఒకటవ తరంగం

ఆదిత్య భగవానుడు ఉషాదేవి చేతిని అందుకుని జగాల లోని సమస్త జీవరాశులకూ చైతన్యాన్ని కలిగిస్తూ తూర్పు సింహాసనాన్ని ఎక్కి వస్తున్నాడు.

నక్షత్రాలు దూరంగా పడమట దిక్కు అంతమయ్యే చోట అక్కడొకటి, ఇక్కడొకటి నిలచి కొత్త రాజు అధికారానికి వచ్చినపుడు మిగిలిన గత వైభవపు గుర్తుల వలె కాంతి తగ్గిపోతున్నాయి.

మహానుభావుల కీర్తి వలె ఆశ్రమాలలో హోమపు పొగ, సూక్ష్మంగా ఉన్నా కూడా సుగంధంతో కూడి ఆకాశ దారులలోకి ఎగసి తేలిపోతోంది.

సర్వాత్మకుడయిన సవితృ దేవుని కీర్తించే భట్రాజుల్లాగా సామగానం చేస్తున్న బ్రాహ్మణులను అనుకరిస్తున్నాయా అన్నట్టు నానా విధాల పక్షులు పాడుతున్నాయి.

ఆకాశం ప్రాతః కాలపు మనోహరమైన చల్లటి గాలిలో నిముష నిముషానికీ మారిపోతున్న రంగులతో ప్రకృతి సుందరి మనసుకు హాయిని కలిగిస్తూ కనిపిస్తున్నది.

వశిష్ఠ మహర్షి అప్పుడే ఉపాసన ముగించి, మూడు అగ్నులతో పాటూ మండుతున్న నాల్గవ అగ్నిలా వెలిగుతూ అగ్ని గృహంలో కూర్చొని ఉన్నారు.

అరుంధతీ మాత తన దైవ కార్యాన్ని ముగించుకుని లేచి నిలబడి, తన పతిదేవుడు రోజూ లాగే లేచి వస్తాడని కాచుకొనివుంది.

ఆయన పైకి లేవలేదు.

ఆ మహర్షి కన్నులు దిక్కులకు అవతల కనిపిస్తున్న దానిని పరిశీలిస్తున్నట్టు సూటిగా చూస్తున్నాయి. కనుబొమలు కొంచంగా వంగి, ఆ కనిపిస్తున్న దాని తీవ్రతను తెలుపుతున్నాయి. ముఖం కూడా గంభీరంగా మారి ఆ కనిపిస్తున్నది సంతోషించే విషయం కాదని చెప్పకనే చెబుతున్నది.

అలాగే కొంతసేపు వుండిన తర్వాత ఆయన ముఖం ప్రసన్నమైంది. అది చూచి అరుంధతీ దేవికి కూడా మనసు నెమ్మదించింది.

దూరదూరాలలో తిరిగిన మనస్సు వెనుకకు వచ్చినదా అనిపిస్తూ మహర్షుల ముఖం నుండి ఒక నిట్టూర్పు వచ్చింది. దాని వెనకే – “ఇంతే కదా!” అన్న తేలికైన భావంతో ఒక చిరునవ్వు కూడా ప్రశాంత సరస్సులో సహజంగా వచ్చే అల లాగా కనిపించింది.

దేవి అక్కడే నిలబడి చూస్తున్నది.

ఆమెకు ” ఇదేమిటి?” అని అడగాలని కుతూహలం. కానీ పతిదేవుని సన్నిధిలో తనంతట తానే మాట్లాడింది లేదు. అందుచేత మౌనంగానే ఉన్నది. బహుశః ఆ మౌనమే ఆమె యొక్క కుతూహలాన్ని తెలిపిందా అన్నట్టు వశిష్ఠులు మాట్లాడినారు – “ఏమి అవుతుందో అదే కానిలే!” అన్నారు.

ఆమెకు ఆ సూత్రవాక్యం మీద వ్యాఖ్యానం చేయాలనిపించలేదు. ఆమె తనను తాను నిగ్రహించుకోవాలని అనుకొన్నా లోపలవుండే స్త్రీ సహజమైన కుతూహలం “అంటే ఏమిటి?” అని ఆమె నోటి నుండి ప్రశ్నను బయటికి వచ్చేలా చేసింది.

వశిష్ఠులు నవ్వి “న్యాయమే! నీవడగక ముందే నేనే అంతా చెప్పవలసినది. ఆశ్రమపు అధిరాజ్ఞివి నీవు. ఆశ్రమపు విషయాలు తెలియాల్సిందే కదా! ఒక నూతన సృష్టి జరుగబోతున్నది. ఆ నాటకానికి ఆరంభం మన ఆశ్రమంలోనే జరుగబోతున్నది. ఓ దేవి, నీ ఆశ్రమంలో రక్తపాతం జరుగబోతున్నది. అది కూడా అంతా ఇంతా కాదు. ఆశ్రమపు భూమికి దాహం తీరేంత రక్తపాతం.” అని అన్నారు. మరలా కొనసాగిస్తూ –

“అంతటి బలి అవసరమా? అని మరలా ఒక నిట్టూర్పు వచ్చింది. బలి లేకుంటే ఫలమెక్కడుంది? ప్రకృతి చేసే రుద్ర భయంకర నాట్య ఫలంగా త్వరలో జరగబోతున్న ఆ నూతన సృష్టి వలన మంచి ఫలాన్ని కూడా చూశాను. అది తనంతట తానే కనిపించింది. అందుకే సంతోషమేసి నవ్వు వచ్చింది!”

అరుంధతి నిర్ఘాంత పోయింది. పాలిపోయిన ముఖముతో – “ఏమిటి? ఆశ్రమంలో రక్తపాతమే! అదీ మన ఆశ్రమంలో?” అన్నది.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

ఆమె మనోభావంను తెలుసుకున్న వశిష్ఠులకు ఇంకా నవ్వు వచ్చింది.

ఆమె మనసుకు ఎలా నచ్చుతుందో అలా ఒకసారి నవ్వి “ఏమంటారు దేవిగారు? ప్రకృతి తన ముఖాన్ని గంటు పెట్టుకొని ఉరుములు, మెరుపులతో ఆర్భాటం చేసి గొప్ప వృష్టిని వర్షించినపుడు మీ ఆశ్రమపు భూమిలో మట్టి బురదగా మారదా? అలాగని, ఉరుములు మెరుపులతో గొప్ప వృష్టిని వద్దంటారా? ఇది కూడా అలాగే. అవును! మీ ఆశ్రమంలో రక్తపాతం అవుతుంది. అంతే కాదు రక్తం యేరులై పారుతుంది. ఏం? ఎందుకు కాకూడదు? సత్వం, రజస్సు, తమోగుణాలతో కూడిన ఈ పంచభూతాల లోను, ఆ పంచభూతాల నుండి సృష్టించబడిన ఈ జగత్తులోనూ ఆ మూడు గుణాలు ఉండనే ఉన్నాయి. ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క గుణం మాత్రమే బలంగా కనిపించినా ఇతర గుణాలు కూడా అక్కడ ఉండనే ఉంటాయి కదా? అయితే అవి అణగి కూర్చొని ఉంటాయి.

దేవీ ఇది జగత్తు. ఘడియ ఘడియకూ మారడమే దీని గుణం. మానవుని మనస్సు ఆ మార్పును సహించలేక ఒకే స్థితిలో ఉండాలని కోరుతుంది. కానీ, సృష్టికర్త నియమం అలాగ కాదు. పాతది వెళ్ళిపోవాలి. కొత్తది వస్తూ ఉండాలి. అందువల్లనే, అప్పుడప్పుడు వున్న స్థితి హఠాత్తుగా మారిపోవడం కనిపిస్తుంది. అణగి ఉన్న గుణాలు రేగి పైపైకి వచ్చేది అందుకే. నదిలో ఉధృతంగా నీటి ప్రవాహం వచ్చి అంతటినీ పగులగొట్టి పోయినట్లు తమో గుణం రేగి అంతటినీ నాశనం చేస్తుంది. దానిని చూచి మనం బాధ పడటం అవసరమా? తమోగుణం వచ్చి అంతటినీ ఊడ్చుకొని పోకుంటే, రజో గుణం వచ్చి కొత్త ఆటను ఎలాగ ఆడుతుంది? మృత్యువు యొక్క రుద్ర నర్తనమే కదా నూతన సృష్టికి ప్రారంభం? ఈ తమస్సు, ఈ రజస్సు ఇలాంటి సంభ్రమంతో విజృంభించకపోతే సత్త్వగుణం ఎక్కడి నుండి రావాలి? రసం నిండిన పండు కావాలని కోరేవాడు పీచుకాయల వగరు, పులుపు వద్దంటే ఎలాగా? అన్నిటినీ జరిపించేది కాలం. ఆ కాలపు ఒక కొన – కరాళమయితే ఇంకొక కొన – శాంతమవుతుంది. సుఖమవుతుంది. అదే ప్రకృతి ధర్మం.

నిజానికి రెండూ ఒకటే! అయినా కూడా మొదలు, చివరలలో ఒకే భావం ఉండడం చాలా అరుదు. అంతే కాక, సుఖ-దుఃఖాలు రెండూ కూడా వికారాలే. ఒకటి స్వర్ణ కంకణమయితే, ఇంకొకటి లోహ కంకణం. స్వర్ణమే కావాలి, లోహం వద్దు అనే మన మనస్సుకు ఒకటి నచ్చింది, ఇంకొకటి నచ్చలేదు.

నచ్చింది ఇంకొంత కాలం ఉండాలి, నచ్చనిది వేగంగా ముగిసిపోవాలి అని తలుస్తాం. అది ఎందుకు అలాగ కావాలి? కావలసినదంతా వేగంగా ముగిసి, వద్దన్నది ఇంకొంత కాలం ఎందుకు ఉండరాదు? మనకు కావలసిందంతా ఇస్తున్న గోమాత, మన నందిని, ఒక్కొక్కసారి కొమ్ములు ఎగురవేస్తుంది కదా? దివ్య ధేనువులో కూడా ఒక్కొక్కసారి నచ్చని చేష్టలు కనిపిస్తాయి కదా? కాబట్టి, రానిలే! ఏమేమి రావాలో అదంతా రానిలే! కాలగర్భంలో అణగివున్నదంతా ఇవతలికి రానీ! అదికూడా దేవుడి లీల అంటే సరిపోతుంది కదా? లీల అనుకున్నపుడు దాని కరాళ రూపం కనిపించదు. ఉల్లాసకరమైన రూపమే కనిపిస్తుంది. అందుకే కాలానికి మనము దాసులం. కాదా?”

పతిదేవుని మాటవిని అరుంధతికి ఆశ్చర్యం కలిగింది.

“ఒకటి రెండు మాటలలో ముక్తసరిగా మాట్లాడి అంతా ముగించే వారు ఈరోజు, ఇంత దీర్ఘంగా మాట్లాడారు. ఎందుకని? ఏదో భయంకరమైన విషయమై ఉండాలి. ఆశ్రమంలో రక్తపాతమా? అదీ కూడా బ్రహ్మర్షుల ఆశ్రమంలో! ఎక్కడ చూసినా శాంతి నిండిన ఈ బ్రహ్మ భూమిలో రక్తపాతమా? ఎగిరే పక్షులు, ఈదే చేపలు కూడా ఎన్నడూ పోట్లాడుకోని ఈ భూమిపై రక్తపాతమా? కానీలే! నాకెందుకు? ఈ దేవుడు అంత వివరంగా చెప్పింది – ’నువ్వు సిద్ధంగా ఉండు’ అని తెలుపడానికే. వారి నోట వచ్చిందంటే అది నిజమే అవుతుంది. జరిగే తీరుతుంది. మనస్సులో గుర్తుపెట్టుకోవాలి. మనో వికారపు ఒక ముఖం సుఖమైతే, ఇంకొక ముఖం దుఃఖం. కానిలే, ఇష్టం లేని ఒక ముఖం కనిపించినప్పుడు కొంచం కష్టపడి ఈ ముఖాన్ని ఇటువైపుకు తిప్పుకుంటే సరి!” అని తనకు తానే ధైర్యం చెప్పుకొంది.

అయినా ’నేల తాగి, కక్కుకున్నట్టుగా పారే రక్తపాతం’ అనుకోగానే ఆమె గుండె బరువెక్కింది.

అక్కడే కూర్చొని అంతా సవిస్తరంగా అడగాలి అనిపించినది. కానీ, ఎప్పటినుంచో అలవాటైన దానిని జవదాటేదెలా? పతి అనుమతి లేనిదే అగ్ని గృహంలో కూర్చోవడమెలా? కాబట్టి, ఏమి అడగాలన్నా ఇక్కడ కాదు. ఇప్పుడు కాదు.

ఇలాగ తీర్మానించుకునే లోపలే గడచిన రాత్రి తాను చూచిన కల గుర్తుకొచ్చింది. అది అప్రయత్నంగానే నోటినుండి బయటికొచ్చింది.

“స్వామీ! నిన్న రాత్రి ఏదో కల. అంత సంతోషకరమైనది కాదు. అది గుర్తుకొచ్చినపుడు ఏదో చేదు మింగినట్లుగా ఉంది…” అంది.

వశిష్ఠులు దరహాసం చేసి – “అవునవును! నాలుక మీద ఆధారపడినపుడు చేదు చేదుగా, తీపి తీపిగా ఉంటాయి. అదే మన అధికారానికి చిక్కితేఅప్పుడు చేదు చేదే , తీపి తీపే…”

అరుంధతికి దాని తర్వాత మాట్లాడ్డానికి నోరు పెగలలేదు. “నిజం. వారు చెప్పినట్టు ఇష్టమైనది తీపిగాను, కష్టమైనది చేదుగాను ఉంటాయి. అంతా మంగళకరమైన వెలుగే! అది అర్థం కానంతవరకూ అమంగళం.అర్థమయిన తర్వాత మంగళమే!” అనుకుని ప్రసాద పుష్పాన్ని తీసుకొని, రక్ష ధరించి, పళ్ళెం దైవ సన్నిధిలో ఉంచి వెళ్ళిపోయింది అరుంధతి.

భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని ఒకరికి ప్రత్యక్షంగాను, ఇంకొకరికి పరోక్షంగాను తెలుసు. అయినా, ఎవరూ దానిని తప్పించేందుకు ప్రయత్నం చేయలేదు.

ఇంకా ఉంది…