ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మంత్రద్రష్ట – ఆరవ తరంగం

Like-o-Meter
[Total: 4 Average: 4.8]

 

ఐదవ భాగం ఇక్కడ చదవవచ్చు – మంత్రద్రష్ట – అయిదవ తరంగం

 

మధ్యాహ్నం మూడవ ఝాము.

సూర్య భగవానుడు పశ్చిమ దిగంతం వైపుకు పరుగును ఆరంభించాడు.

శ్రమజీవులందరూ విశ్రాంతి తీసుకొని ఆ దినపు కార్యం ముగిసిందా లేదా అని సరి చూసుకొనే కాలం. వశిష్ఠులు తమ పర్ణ కుటీరంలో ఒక కృష్ణాజినం పైన కూర్చుని, ఒక పీటను ఆనుకొని ఒరిగి కూర్చునివున్నారు. ఏదో ఒక ఆలోచన వచ్చి తీవ్రంగా మనసును తొలచి వేస్తుండగా దానిని సులభంగా పక్కకు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుంది.

దేహభారం ఒరిగివున్న పీటపై వేసి మనసును ఎదుటనున్న కార్యం పై కేంద్రీకరిస్తున్నట్లున్నది.

అరుంధతీ దేవి ఎదురుగా కూర్చొనివుంది. ఆమెకు ఏదో శీతలమైనట్లు శ్వాస ఎగబీలుస్తున్నట్లుంది.

ఆశ్రమంలో రక్తపాతమైనప్పటి నుండీ ఆమెకు మనసు, శరీరం రెంటికీ నెమ్మది లేదు. ఏదో ప్రకోపానికి లోనై, ముగుతాళ్ళను తెంచుకొని, బంధనంను విడిపించుకొనుటకు పెనగులాడే ఎద్దులా ఆమె మనస్సూ, శరీరమూ ఆశ్రమపు శాంత జీవనం కోసం హఠం చేస్తున్నట్లున్నవి. అయినా, మగనిపై కోపించినా ఆ కోపాన్ని చూపే అవకాశం లేకుండా అతనికి వశమయిన భార్యలా ఆమె మనసూ, శరీరమూ ఆమె స్వాధీనంలోనే ఉన్నాయి.

వశిష్ఠులు ఆమె వైపు చూసారు.

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

పరుగెత్తి వచ్చి, రెండు చినుకులను కురిసి మళ్ళీ పరుగెత్తి పోయే మేఘంలా పట్టు తప్పిన అతని మనసు కూడా ఒక చిరు దరహాసాన్ని అతని ముఖంపై చమక్కుమని మెరపించి అంతలోనే ఎక్కడికో పరుగెత్తి పోయినట్లయింది.

ప్రసన్నంగా ఉన్నా ఇలా అన్యమనస్కంగానే ఆమెను చూస్తూ – “దేవీ! నీకు ఆశ్రమంపై ఉన్న మమత వలన ఈనాటి ఘటన గురించే ప్రబలంగా ఆలోచిస్తున్నావు. ఆ కౌశికుని వైపు కూడా కొంచం ఆలోచించు! లోకంలోని రాజాధిరాజులనందరినీ గెలిచి వచ్చినవాడు ఇక్కడ, ఈ ఆశ్రమంలో తన శౌర్యానంతా పణంగా పెట్టి ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. ఇలా జరిగినపుడు అతనికి మన పై విద్వేషం రగలడంలో ఆశ్చర్యం లేదు. బ్రహ్మద్వేషం చేయవచ్చునా అనే లోకం ఇంకొక అడుగు ముందుకువేసి ’రాగద్వేషాలు రెండూ మనో వికారాలు. కావాలి కావాలి అనేది రాగము, వద్దు వద్దనుకొన్నది ద్వేషము. అభిముఖమైనపుడు రాగము, విముఖమైనపుడు ద్వేషము’ అని ఎందుకు తెలుసుకోవడం లేదు?

కౌశికునికి కామధేనువు కావలన్న కోరిక పుట్టింది. దానిని పొందడానికి మనం అడ్డు అని అతనికి అనిపించినది. అతని అర్థకామమునకు మనం అనుకూలమైనపుడు అతను మనకు భక్తుడవుతాడు. కానీ ఇప్పుడు అతడు మనల్ని ’నా పనికి అడ్డంగా ఉన్నా’రని అనుకొని మనల్ని ద్వేషించడం సహజమే కదా! కాబట్టి రాగద్వేషాలు రెండు కూడా వికారాలని అనుకొన్నవారు ఆ రెంటికీ వశులు కారాదు. దేవీ! ఈ మాట సరే గానీ ఇప్పుడు కౌశికునికి పుట్టిన ఆక్రోశం అకారణమైనదని అనుకుంటున్నావా? అది అకారణం కాదు. దాని వెనకున్న కారణం మనకిప్పుడు తెలియకున్నా అది ఉండనే ఉంది. ఆ ఆక్రోశం రాబోయే దానికి శుభసూచన. అతని హృదయంలో ఇంతటి తీవ్రమైన భావన రాకున్న సమృద్ధి అయిన తన రాజ్యాన్ని వదలి తపస్సుకు వెళ్ళడం ఎలా సాధ్యమవుతుంది?

’నీకు కావలసినదాన్ని తపస్సుతో సాధించ’ మని నేను చెప్పినప్పుడు ఆ రాజు మనసు ఒప్పుకోలేదు. దానిని కాల్చి, బూడిద చేసేటందుకే ఈ వినాశనం జరిగింది. ఈ ఆక్రోశం, ఈ క్రోధం కావలసివచ్చాయి. నొచ్చుకొని వేడెక్కినట్లు ఇప్పుడు తపస్సుకు సిద్ధమయింది. కౌశికుడు తన రాజ్యాన్ని కుమారునికి అప్పగించి , తాను తపస్సుకు పోబోతున్నాడు. ఆ తపస్సులో నిష్ఠాగరిష్ఠుడై, సాత్త్వికుడు కావాలి. దానికన్నా ముందే తన లోపలున్న రజోగుణాన్ని కడిగివేసుకోవడానికి లోకంలో ఒక విప్లవం కావాలి. పెరిగి నిలుచున్న అడవిని కొట్టివేయాలి లేదా దహించాలి. లేదంటే అడవిని మళ్ళీ పెంచడానికి వీలుకాదు. ప్రకృతి కూడా కొట్టివేయడం కన్నా కాల్చడం సులభమనే కాలుస్తుంది. అది సహించలేని మానవుడు తన సొమ్మేదో పోయినట్లు బాధ పడతాడు. సరే! ఆ విషయం వదలి ముందరి కార్యాన్ని చూడు. వామదేవుడు వచ్చాడా? ఈ నాటకంలో అతనిది పెద్ద పాత్రే సుమా!” అని అన్నాడు.

****

వామ దేవుడు వచ్చాడు.

గురువుకు నమస్కారం చేసి, కూర్చోవడానికి అనుజ్ఞ పొంది కూర్చొన్నాడు.

వశిష్ఠులు ముసిముసిగా నవ్వి – “వామదేవులకు రాజగురువుయ్యే యోగం వచ్చినట్లుంది” అని అన్నారు.

వామదేవుడు ఒక గడియ పర్యాలోచన చేసి “అర్థం కాలేదు?” అని వినయంగా పలికాడు.

వశిష్ఠులు నవ్వుతూ ” కొండపైని సరోవరపు నీరు మైదానప్రాంతంలో నదిగా ప్రవహించవలసి ఉంది. ఆయకట్టును చూచి, ఒక్క రాయిని సడలిస్తే చాలు నీరు బయటికి పరుగెడుతుంది. అటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. రాజా కౌశికుడు తపస్వి కౌశికుడు కాగలడు. తన బాహుబలంతో సాధించలేనిదాన్ని తపోబలంతో సాధించాలని రాజ్యంను వదలి, హిమాచలంను ఆశ్రయించబోతున్నాడు. అక్కడ అతనికి ఈశ్వరానుగ్రహం సంపాదించే మార్గం చూపేవారు ఒకరు కావాలి. దెబ్బ తిని చెలరేగిన అతని మనసు తీవ్రమైన శ్రద్ధ వైపుకు తిరిగింది. ఆ శ్రద్ధను సరియైన దారిలోకి మళ్ళించేందుకు ఒక విసనకర్ర కావాలి. ఆ విసనకర్ర నువ్వే!” అని అన్నారు.

వామదేవునికి ఇంకా ఏదో సందేహం!

అన్వేషి ఛానెల్ – మరుగున పడిన చరిత్రను వెలికి తెచ్చే డాక్యుమెంటరీలు

 

“అంటే, ఈశ్వరానుగ్రహం పొంది కౌశికుడు మళ్ళీ ఆశ్రమానికి వచ్చి యుద్ధం చేస్తాడా?” అని అడిగాడు.

వశిష్ఠులు శాంతులై, నిశ్చలులై, నెమ్మదిగా పలికారు – ” ఔను. అది అట్లే జరగాలి. రాయి కరిగి అద్దం కావాలంటే అడవిలో ఒక భాగం కాలి బూడిద కావాలి. ఇది ప్రకృతి నియమం. మన ఆశ్రమంలో ఇంకొకసారి శస్త్రాస్త్రాల విజృంభణమయిన తర్వాత కొత్త సృష్టి ఆరంభమవుతుంది. అది మనకు కావలసిన రీతిలో జరగలేదని మనం కోపిస్తే మనమే పిచ్చివారమవుతాము. వామదేవా! ప్రకృతి నియమాలకు అడ్డుగా ఉన్న వాటిని తీసివేసి, పనులు కొనసాగేట్లు సహాయం చేయడం బ్రాహ్మణ ధర్మం. అందువలన, ప్రకృతి రౌద్రరూపాన వచ్చినా ఆహ్వానించాలి. జగత్తు యొక్క హితం కోసం తపస్సు చేసే బ్రాహ్మణుడు తన ప్రియాప్రియాలను పట్టించుకోరాదు. అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తం చేయడానికి కావలసిన శక్తిని కేంద్రీకరించుకొని ఒక ముఖం నుండి స్వీకరించి, ఇంకొక ముఖం నుండి వికేంద్రీకరించి లోకానికి ఇచ్చే యంత్రమే తానని గుర్తెరిగిన బ్రాహ్మణుడు యంత్రంలానే ప్రియ-అప్రియాలకు అతీతుడై ఉంటాడు. కౌశికుడు అంతటి యంత్రం కాగలడు. యంత్రాన్ని జోడించే భారం మానవునిదే. మనదే. ఇప్పుడు విడిభాగాలు వేరే వేరేగా ఉన్నట్లు ఉండడం వల్ల కౌశికుడు విముఖడై మమ్మల్ని ఆరాధుస్తున్నది. అది అలానే విముఖంగానే పెద్దది కావాలి. అలా విముఖమై పెరిగి చివరికి తాను విముఖమై ద్వేషం చేత ఆరాధించినది ’ఇది తానే. తనదే. వేరే కాదు’ అని తెలుసుకొని దానితో తాదాత్మ్యం చెందుతాడు. కాబట్టి ఆ నమ్మకం మనకున్నందున మన కర్తవ్యం మనం చేయాలి?”

అందుకు వామదేవుడు – “గురుదేవుల ఆజ్ఞ సకలంగా నెరవేర్చగల శక్తి నాకు వచ్చుగాక! ఈ అనుజ్ఞను ఇలా ఎందుకు చేసారని నేనెందుకు అడగాలి? నేనొక ’దర్వి’ని మాత్రమే (దర్వి అంటే యజ్ఞంలో ఉపయోగించే చెక్క గరిట). దర్వి ఉన్నది యజమాని ఉపయోగం కోసం. యజమాని ఆ దర్వితో తీసుకున్నఆహుతిని ఎక్కడైనా ఉపయోగించుకోని గాక. అగ్నిలోనో, నీటిలోనో, స్థలంలోనో – ఎక్కడ ఉపయోగించినా దర్వికి దానివల్ల ఎలాంటి హాని లేదు. అదేవిధంగా భగవానుల ఆజ్ఞను నెరవేర్చడమే నా పని. కాబట్టి, ఇదిగో బయలుదేరుతున్నాను!” అని అన్నాడు.

వశిష్ఠులు ఆశ్రమపు పర్ణశాల గోడల మధ్య కూర్చున్నా విశాల జగత్తులో ముందు ముందు విచిత్ర కథనంతో జరుగవలసిన కథకు బీజాన్ని వెదకి తీస్తున్నవారి వలె అన్యమనస్కంగా, అనన్య దృష్టితో ఇలా అన్నారు – “నీవు హిమాలయంలో ఉండు. కౌశికుడు అక్కడికి వస్తాడు. అతడికి ఏమి చేయాలో తెలియదు. అతడు వచ్చినపుడు మాటలలో పెట్టి, అస్త్రాలన్నీ రుద్రుని దగ్గరే ఉన్నాయిని చెప్పి, రుద్రారాధనా క్రమాన్ని అతనికి బోధించు.”

ఎంత నిగ్రహించుకున్నా వామదేవునికి సాధ్యం కాక కంట్లో నీళ్ళు దూకుతుండగా – “ఆ అస్త్రాలనన్నింటినీ సంగ్రహించుకొని వచ్చి మన ఆశ్రమాన్ని నిర్మూలిస్తాడో ఏమో?” అని అన్నాడు.

మనస్సంగా నిండుకున్న దుఃఖము పాములపుట్టలా పెరిగింది అనడానికి గుర్తుగా అతని గొంతు గద్గదమయింది.

“నీవు ఇప్పుడు విచారించవలసింది ఈ ఆశ్రమానికి ఎదురయ్యే క్షోభను గురించి కాదు. రాబోవు మహాకాలంలో జరగవలసిన దేవకార్యం గురించి మాత్రమే. భయంతో కూడిన ఇప్పటి ప్రణాళిక జరగబోయే మంగళకార్యానికి అడ్డు రాకూడదు. భవిష్యత్తు తెరను తొలగించి చూడాలని ఉంటే చూడు! అని అన్నారు వశిష్ఠులు.

వామదేవుడు చూసాడు.

అతని మనస్సు, ఇంద్రియాలు, కాలంలో గల అవ లక్షణాలను అవతలికి నెట్టివేసి, భవిష్యత్తును కరతలామలకం చేసుకుని చూసాడు. అతడి మనస్సులోని దుఃఖం సంపూర్ణంగా నాశనమై దాని స్థానంలో అంతే గొప్పగా ఆనందం నిండింది.

ఆసనం పైనుండి లేచి, గురువుకు వందనము చేసి, అనుమతి కోసం నిలిచాడు.

వామదేవుని దుఃఖం నివారణ అయినట్లే అరుంధతి దుఃఖం కూడా నివారణ అయింది. ఆమె మనసు ప్రసన్నమయింది.

గురుదేవులు వామదేవుణ్ణి “కృతకృత్యుడివి కమ్మ’ని ఆశీర్వదించారు.

శిష్యుడు గురుదేవునికీ, గురుపత్నికీ సాష్టాంగ నమస్కారం చేసి హిమాలయాల దిశగా కదిలాడు.

 

ఇంకా ఉంది…