ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మహాదేవి – నాల్గవ భాగం

Like-o-Meter
[Total: 3 Average: 4.3]

చిక్షురుణ్ణి అల్లంత దూరం నుంచే చూసిన మహాదేవి కళ్ళు అరుణాలయ్యాయి.

బాష్కల దుర్ముఖులను చీల్చి చెండాడినా, మహిసుడు రాకుండా మరో దానవుణ్ణి తనపైకి పంపటం చూసి వాడి వెర్రితనానికి నవ్వు వచ్చిందామెకు.

ఆ దానవుణ్ణి ఒక మశకం వలెనే చూస్తూ, శంఖం పూరించింది. శింజినిని లాగి ధనుష్టంకారం చేయగా ముల్లోకాలలో ఆ ధ్వని విస్తరించి భూకంపాలు సృష్టించింది. మంగళసూచకంగా ఘంటానాదమూ చేసింది. ఇవన్నీ ఏక సమయంలో చేస్తున్న ఆ ప్రబలను చూసిన చిక్షుర సైన్యానికి గుండెలవిసిపోయాయి. ఆ శబ్దానికే కొందరు ప్రాణాలు వదిలి వేశారు.

చిక్షురుడికి చిర్రెత్తుకొచ్చింది – “ఓరీ పిరికి పందల్లారా! ఇటువంటి గర్జనలెన్ని వినలేదు? ఇంత మాత్రానికే ప్రాణలు వదిలే పిరికిపందలా నా సైనికులు?  ఐనా, ఏమిటి విశాలాక్షీ, నీ వీరంగం? మా మహారాజు మహిషుడు కోరి వరిస్తుంటే, యీవిధంగా వేషాలు వేయటం ఏమైనా బాగుందా? అసలు నీకీ ఆయుధాలేమైనా నప్పుతున్నాయా? వొట్టి అజ్ఞానంలో ఉన్నావు సుమా! హాయిగా మా రాజుతో కలిసి క్రీడించవమ్మా అంటే, కాదు కూడదంటూ యుద్ధాన్ని కోరుకునే నీవంటి పిచ్చిదానికి సరైన సమాధానం చెప్పటానికి మా రాజే రా నవసరం లేదు. నేను చాలు. అసలు సంగ్రామంలో ఆనందం ఏముంటుంది చెప్పు? రక్తపుటేరులూ, ఎముకల పేర్లూ, రాబందుల రెక్కల చప్పుళ్ళూ, నక్కల ఊళలూ తప్ప! పైగా వీర మరణమంటూ గొప్పలు పోవటం! ఇవన్నీ వద్దుకనీ, మహిషుడితో సురత కేళికి సిద్ధంకా!”

మహలక్ష్మి కోపానికి యీతని మాటలు ఆజ్యం పోశాయి. ‘ఓహో! బాగానే ధర్మ పన్నాలు వల్లిస్తున్నావ్! ఒక వివాహితను కోరుకునే మీ నాయకునికి బుద్ధిచెప్పే న్యాయమేమీ చదవలేదా నువూ? ఐనా నీతో మాటలనవసరం. మాటలు చాలించి నీ ఆయుధ ప్రయోగ మేపాటిదో చూపించు.” అంది హేళనగా.

ఆమె కవ్వింపు చూసి కసి పెరిగిన చిక్షురుడు బాణాపరంపరను సంధించగా అన్నిటినీ క్షణంలో తుత్తునియలు చేసిందా దేవి. గదతో తలమీద మోదేసరికి, రథం లోనే మూర్చ పోయాడు. ఇది చూసి వెంటనున్న తామ్రుడు కూడా ఆ చండికాదేవిని ఎదిరించటానికి ప్రయత్నిచగా, వాని బాణలను కూడా అవలీలగా తుంచివేసింది. క్షణం ఆలస్యం చేయకుండా, తామ్ర చిక్షుర శరీరాలను బాణాలతో నింపేసిందామె.

రక్తం ఓడుతున్నారిద్దరూ. నిండా విరగగాసిన మోదుగు చెట్లవలె కనిపిస్తున్నారు.

SUBSCRIBE TO ANVESHI CHANNEL
EXPLORE UNTOLD HISTORY

ఐనా, ఇద్దరూ తేరుకుని, గదతో ఒకరూ, కత్తితో మరొకరు ఆమెపై దాడి చేయటానికి వస్తుండటం చూసిన ఆ వీరాంగన, దీర్ఘాసినీ, ధనుస్సునూ ఇరువురిమిదకు ప్రయోగించగానే, ఇద్దరూ హరీమన్నారు.

దేవతల జయజయ ధ్వానాలు, మహర్షుల ఆశీర్వచనాల ఘోషలు దశదిశలకూ వ్యాపిస్తున్న కలకలం, మహిషుడి మదిలో కలవరం రేపింది.

మహిషుడి మతి భ్రమించిందా అన్నట్టు, తరువాత ఆతని ఆజ్ఞపై అసిలోముడు వచ్చి “అనిత్య దేహమంటూ, సుఖాలను అనుభవించేందుకు, సౌగత మతాన్ని (బౌద్ధము – గమనిక ఇప్పటి బౌద్ధం కాదు) స్వీకరిస్తే సుఖంగా ఉంటుందనీ, లేదంటే, ధర్మ బద్ధంగా అర్థ కామాదులను ఆరాధిస్తూ దానవ నిర్మూలనాన్ని ఆపివేయమనీ” మహాలక్ష్మికి హితవు పలికాడు.

ఓపికగా మళ్ళీ మహాదేవి తానిక్కడికి వచ్చిన కారణమూ, మహిష మర్దనం చేయకుండా తిరిగి వెళ్ళబోనన్న దృఢ నిశ్చయమూ కూడా చెప్పింది. వెనుకకు మరలి మహిషుని చేతుల్లో చావటం కంటే యుద్ధ భూమిలో మరణించటమే మంచిదనుకున్న అసొలీముడూ, అతని వెన్నంటి వచ్చిన బిడాలుడూ, తమ శక్తినంతా వినియోగించి పోరాడినా చివరికి, నరకలోకపు తలుపు తట్టటం తప్పలేదు.

మహాలక్ష్మి అధిరోహించిన సింహం కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు, మిగిలిన దానవ సైనికులను చీల్చి చెండాడి తన ఆకలి తీర్చుకుంది.

మిగిలిన ఒకరిద్దరూ మహిషుడి ముందు తలవంచుకుని నిలబడి యుద్ధరంగ వార్త వినిపించారు.

మహిషుడు క్రోధమూ, దుఃఖమూ పెల్లుబుకుతున్నా నిగ్రహించుకుని, ఇక తానే వెళ్ళి ఆ వనిత మనోగతమేమిటో తెలుసుకోవాలనే నిశ్చయించుకున్నాడు.

దారుకుణ్ణి పిలిచి సాంగ్రామిక రథం సిద్ధం చేసుకు రమ్మన్నాడు.

వెయ్యి గాడిదలు పూన్చిన ఆ రథం ముందు నిలిచింది. పతాకము రెపరెపలాడుతున్నది. వివిధ ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నపాటున బయలుదేరి వెళ్ళబోతూ, ఆ సుందరాంగి వర్ణన మనసులో మెదిలింది. మన్మథ భావం మళ్ళీ మదిలో గిలిగింతలు రేపింది.

అంతా మాయా విభవం! అంతటి దుఃఖంలోనూ నవ మన్మథాకారంలోనే ఆ ధీర వీర సుందరీమణి ఎదుట నిలవాలనుకున్నాడు మహిషుడు. తన సమ్మోహన రూపం చూసైనా తనను ఆమె వరిస్తే, క్షమించి హృదయరాణిని చేద్దామని అతని ఆశ.

‘హయ్యో రామా!! ఇదేమి ఆడపిచ్చిరో దేవుడా!! సామీ !! వీడు నిజ్జంగానే ఎనుబోతుగాడు!! ఇదేంది, ఇంతమందిని సంపుతున్న ఆడదాన్ని సూసి, భయపడి మళ్ళీ తోకెత్తి, ఉచ్చలు పోసుకుంటా పరిగెత్తిపోవాల్సింది పోయి, మొగోడిగా ఆమెనెట్టైనా లొంగదీసుకోవాలనుకునే ఆణ్ణి, నిలువునా సీల్చి పాతరెయ్యాల్సిందే గందా!!’ ఇంత కథనూ వింటూ, యీ సందర్భంలో అవేశానికి గురైన పామర ఆవేశమది.

అక్కడున్న అందరి స్పందనా దాదాపు ఇలాగే ఉండటం వల్ల, ఆ గొంతునెవరూ అడ్డుకోలేదు.

సూతులవారి వాక్ప్రవాహం కొనసాగుతొనే ఉంది ఇలా..’మానవ రూపంలో యుద్ధరంగానికి వచ్చిన ఆ మహిషుణ్ణి వెంటనే గుర్తు పట్టింది – మహాలక్ష్మి!! దిక్కులు పిక్కటిల్లేలా శంఖాన్ని పూరించింది. నిజానికి ఆ ధ్వనికి దగ్గరున్నవారి చెవుల్లోంచీ రక్తపుటేరులు పారాలి. కనీ, మహిషుడు ఇదేమీ లెక్కచేయక నిబ్బరంగా, ఆమె సమీపానికి వచ్చి, రథాన్ని ఆపాడు. గొంతులో మాధుర్యం నింపుకుని అన్నాడు..’దేవీ!! అదేమిటో నీవు నావాళ్ళనందరినీ చీమలవలె నలిచివేసినా నీమీద నాకు కోపమే రావటం లేదు. పైగా నీ శౌర్య సంపత్తిని చూసి ముచ్చట వేస్తున్నది. నాకు తగిన జోడీ ఇన్నాళ్ళకు దొరికిందని సంతోషంగా ఉంది. ఇద్దరూ సమవయస్కులం. సమాన ధైర్య సాహసాలున్నవాళ్ళం.ముఖ్యంగా సమాన సౌందర్య బల దర్పితులం కూడా!! ఈ కారణాలవల్ల, నన్ను వరించటమొక్కటే నీవిప్పుడు చేయవలసినది. నీతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను. నీ కోపోద్రిక్త దృక్కులలోనూ నాకు కామ పీడిత దృక్కులే కనిపిస్తున్నాయి. సంగరంలో నీ కౌశలానికి జోహార్లు!! మదన కదన రంగంలోనూ నీ కౌశలాన్ని దర్శించాలని మనసు తహతహలాడుతున్నది!! నేనిప్పుడు నీ దాసుణ్ణి!! నన్ను పరిగ్రహించి మదన కీలలనుంచీ కాపాడు!’

కామాతురాణాం న భయం న లజ్జా..మహిషుణ్ణి జాలిగా చూసింది మహాదేవి..’దానవాధమా!! నేను వివాహితను. నన్ను చూసి ఇలా ప్రేలటం, అభిలషితం కాదు. ఐనా సరే, ఇది నీ జన్మ సహజ గుణం కాబట్టి క్షమించివేస్తున్నాను.నీ వాళ్ళనింతమంది ప్రాణాలు హరించినా, నీకు అర్థం కావటమే లేదు!!నీవు నన్నొక మమూలు మహిళగా భావించి, నా పొందు కోసం వెంపర్లాడుతున్నావు. నేను నిన్ను తుదముట్టించేందుకు వచ్చిన శక్తిస్వరూపను!! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవారితో పాతాళానికి పారిపో!! అక్కడ నీ వంశీకులింకా ఉన్నారు కదా, వారితో, నీ శేష జీవితం గడుపు!!లేదూ, ఇంకా నా పొందు కోరుతానంటే, ధనుస్సు ఎక్కుపెట్టు!! అప్పుడిక నీ వినాశం తప్పదు కాక తప్పదు!! ఇది తథ్యం..!!’

మహాదేవి హెచ్చరికలన్నీ తృణప్రాయంగా తోస్తున్నాయి.’ఎంతసేపూ యుద్ధం యుద్ధం అంటావెందుకు, నేను నిన్ను నా హృదయసీమకే మహారాణిని చేస్తానంటుంటే?? నీతో యుద్ధం చేసి నిన్ను క్షతగాత్రురాలిని చేయటమా?? ఊహించలేకుండా ఉన్నాను కోమలగాత్రీ!! పోనీ, నీకు నా మీద మరులు కలగటం లేదంటే చెప్పు, నిన్ను వదిలేస్తాను. క్షమించి వదిలేస్తాను. ఎందుకంటే, నిన్ను ప్రేమిస్తున్నాను కదా!! నీ దేహం రక్తసిక్తమవటం చూడలేను!! నీ తనూలతను చిద్రం చేయటం, నావంటి పురుషోత్తమునికి తగిన పనే కాదు!! స్త్రీని సమ్హరించటం నా దృష్టిలో అపకీర్తే!! స్త్రీ హత్య, బల హత్యా, బ్రహ్మ హత్యా – వీటన్నిటికీ పాప పరిహరాలు కూడా చేసుకోవాలి కూడా!! నాకివన్నీ ఎందుకు చెపు?? అసలు నాకింకా అర్థం కానిదొక్కటే!! ఎంత సేపూ యుద్ధం యుద్ధం అన్న మాట తప్ప వేరే మాటే లేదు నీ దగ్గర!! ఇంతగా నీకు యుద్ధం పట్ల ఆసక్తిని కలిగించిన వాణ్ణి ముందుగా సమ్హరించాలి. చక్కగా విష్ణుమూర్తితో లక్ష్మీదేవి, నాకు వరమిచ్చిన చతుర్ముఖుడితో సరస్వతీ దేవి, కైలాస వాసితో ఈశ్వరీ – వీళ్ళందరినీ చూసైనా నేర్చుకో! నాతో సుఖించు! నీవు పట్టవలసినది, యీ ధనుస్సును కాదు!! చక్కెర విలుకాని విల్లు!! నీవు, బాణాలను ప్రయోగించరాదు!! చూపుల తూపులను సంధించాలి!! కరవాలాన్ని పట్టవలసిన చేతులా నీవి?? కమ్మని బిగి కౌగిళ్ళను సంధించవలసిన చేతులు!! యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించవలసిన కర్కశ హృదయం కాదు, మన్మథ క్రీడల్లో ప్రావీణ్యాన్ని చూపించవలసిన మనసు ఉండాలి నీకు!! ఇదంతా ఎందుకు?? ఇంతకూ ఆ మన్మథుడెక్కడికి వెళ్ళిపోయాడబ్బా?? అతని బాణాలన్నీ నామీదకే సంధిస్తున్నాడు. నీపట్ల చాలా దయచూపుతున్నాడే!! మీవాడు కదా!! పోనీలే!! కానీ ఇప్పుడు నన్ను తృణీకరిస్తున్నావు కదా!! మళ్ళీ పశ్చాత్తాప పడి నాలాంటి వరుని కోసం వెదికి, ఆ మందోదరిలా నిరాశపడుతావేమోనని ముందే హెచ్చరిస్తున్నాను..’ అని ఆగాడు.

ఇంతవరకూ అతని మాటలనంతగా పట్టించుకోని మహాలక్ష్మికి, యీ మందోదరి కథేమిటో తెలుసుకోవాలనిపించింది. ‘నేనీ మందోదరిని గురించి విననేలేదే?? ఆ కథేమిటో చెప్పు, మహిషా!!’అంది కుతూహలంగా మహాదేవి.

“మహిషా.’ .అని తనను సంబోధించినందుకే సంబరపడి పోయాడు అసురుడు. తాను చెప్పే యీ కథను విన్నదంటే, తప్పకుండా, తన దారిలోకి వస్తుందనిపించింది అతగానికి!! అందుకే తానూ ఉత్సాహంగా మొదలెట్టాడు.

ఈ భూగోళం మీద సింహళం అనే ఒక దేశముంది. సస్యశ్యామలంగా ధన ధాన్య సమృద్ధులతో అలరారే ఆ చోట చంద్రసేనుడనే రాజు. చాలా ధర్మ పరాయణుడు. మృదుస్వభావి. శూరుడు. ధర్మవాది. ధర్మ శాస్త్ర నిఉణుడు కూడా!! అతని భర్య పేరు గుణవతి. పేరుకు తగ్గట్టే, చాలా శీలవతి. పతిభక్తి పరాయణ. వీరికి ఇద్దరు కుమర్తెలు. మొదటి కుమర్తె మొందోదరి. రెండవ కుమార్తె,ఇందుమతి.

మందోదరికి యుక్త వయసు రాగానే పెళ్ళి చేయదలచి, సంబంధలు చూస్తున్నారు. మద్ర దేశాధిపతి సుధన్వుని కుమారుడు, కంబుగ్రీవుడు,మందోదరికి అన్నివిధాలా తగిన వరుడనిపించి, చంద్రసేనుడు, గుణవతితో చర్చించాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. గుణవతిని మందోదరికీ విషయం చెప్పి ఒప్పించమన్నాడు తండ్రి.

మందోదరిని దగ్గరికి తీసుకుని, తల్లి, సంబంధం గురించి చెప్పింది. కనీ మందోదరి ..’ఛీ ఛీ!! పెళ్ళా!! నాకా!! వద్దే వద్దు. నేనిలాగే కన్యకగానే జీవితం గడిపేస్తాను. స్వతంత్ర జీవనం నాకు చాలా ఇష్టం. తపస్సు చేసుకుంటూ, నా బ్రదుకు నెను బ్రదుకగలను..’అనేసింది.

తల్లి నిర్ఘాంతపోయింది. ఎందుకీ నిర్ణయం..’ అని అడిగింది.

‘అమ్మా!! పెళ్ళి అనేది స్త్రీ జీవితానికొక గుది బండే!! ఎప్పటికీ, అత్తవారింటి సేవలోనే తరించాలి. మొగుడికి బానిసగా ఉండాలి. ఇంతా చేసి, అతని మనసు పరస్త్రీ వ్యామోహంలో మునిగితే అది కూడ సహించాలి!! పోనీ అదీ సహించినా, అప్పుడు కూడ సుఖ శాంతులుంటాయా అంటే దానికీ నమ్మకం లేదు. ఏక్షణానైనా విడిచిపెట్టవచ్చు కూడా!! అప్పుడిక ఆమె గతి అధోగతేగా!! పోనీ ఇవన్నీ కాక, భర్త ఖర్మగాలి, హరీమంటే, ఆ బాధ ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు?? ఒంటరి స్త్రీకి రక్షణేదీ? ఇవన్నీ ఎందుకు చెప్పు?? హాయిగా ఒంటరిగా జీవితం గడపటమే హాయి అని నా ఖచ్చితమైన నిర్ణయం..’ అని చెప్పింది స్పష్టంగా.

తల్లి ఆమెకేమీ చెపలేక, ఆమె చెలికత్తెలకు చెప్పింది – కాస్త అవకాశం వచ్చినప్పుడల్లా, మందోదరి మనసు మార్చే ప్రయత్నం చేయమని!! వాళ్ళూ ప్పుడప్పుడూ చెబుతూనే ఉన్నారు. మందోదరి తన మాటే తనదని చెబుతూనే ఉంది.
రోజులు గడుస్తున్నాయి.ఒకరోజు మందోదరి, చక్కగా అలంకరించుకుని, వన విహారానికి వెళ్ళింది. అక్కడ చెలికత్తెలతో కలిసి, అందమైన సుమ సంచయంలో మునిగి ఉంది.

ఇంతలో అక్కడికి, కోసలాధిపతి వీరసేనుడొచ్చాడు. మందోదరి సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె చెలికత్తెను పిలిచి, ఆమె వివరాలన్నీ తెలుసుకున్నాడు. తన మనసును ఆమెకు చేరవేయమన్నాడు.

గుణవతి మాటలు గుర్తొచ్చాయి పరిచారికకు!! వెంటనే, మందోదరికి, అతని వివరాలందించి, అతని మనసులోని మాటను కూడా తెలిపింది.

మందోదరి, సైరంధ్రిని ఘాటుగా హెచ్చరించింది – పెళ్ళి ప్రసక్తి మళ్ళీ తీసుకురావద్దని. నిస్సహాయంగా వీరసేనుడు వెనక్కి వెళ్ళీపోయాడు.

కొన్ని రోజులు గడిచాయి.

మందోదరి చెల్లెలు ఇందుమతి యుక్త వయస్సుకు రావటం, స్వయంవరం చాటించటం, ఆ స్వయంవరానికి వచ్చిన ఒక రాకుమారుణ్ణి ఆమె ఇష్టపడటమూ, అత్యంత వైభవోపేతంగా ఆమె వివాహ సన్నాహాలూ – అన్నీ చక చకా జరిగిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, మందోదరి మనసుకు, మదన విహారంలో తొలి రుచి తెలిసింది. ఆ స్వయంవరానికి వచ్చిన మద్ర దేశాధీశుదు చారుదేష్ణుడు ఆమెకు చాలా నచ్చాడు. అతనో మంచి మాటకారి, అందగాడు కూడా!! ఆడవారి విషయంలో మరింత చతురుడు.

మందోదరి అతని వలలో పడ్డది. తండ్రికీ విషయం చేరవేసింది!! తల్లిదండ్రులిద్దరూ బోలెడంత ఆనందించారు. రెండు పెళ్ళిళ్ళూ ఆర్భాటంగా చేసివేశారు.

చారుదేష్ణుడు, మందోదరితో పాటు, మరెన్నో విలువైన కానుకలనూ చేపట్టి, మద్ర దేశానికి వెళ్ళిపోయాడు.

కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఒకసారి చారుదేష్ణుడు, తన సేవకుని భార్యతో క్రీడిస్తుండగా, మందోదరి పరిచారిక చూసింది. మందోదరికి తెలియజేసింది. భర్తపై నమ్మకమున్న మందోదరి, ఆమెనే కోప్పడింది. మరి కొన్ని నాళ్ళకు, ఒక వేశ్యతో సహా మందోదరికే పట్టుబడిపోయాడు చారుదేష్ణుడు. మోసపోయానే..అని మందోదరి విలపించింది. కానీ చేతులు కాలాక వలె, ఆమె పశ్చాత్తాపం, నిష్ఫలమై పోయింది. సంసార సుఖాలను పరిత్యజించి, అంత:పురంలోనే ఒంటరిగా, కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితం గడిపింది పాపం మందోదరి..!!’ ఆగాడు మహిషుడు.

పాపం..అన్నమాటను ఒత్తి పలికిన మహిషుణ్ణి, జాలిగా చూసింది మహాదేవి.

మహిషుడు మళ్ళీ అన్నాడు..’ఆ మందోదరి వలె, సరైన సమయంలో అందివచ్చిన అదృష్టాన్ని అందుకోకుండా, గత జల సేతు బంధనం చేస్తే వృధా కాబట్టి, నన్ను వరించు, సుఖసీమల అంచులదాకా వెళ్ళివద్దాం రా సుందరీ!!’
మహాదేవి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అందుకుంది. ‘ఓరోరి మహిషా!!నీకు చావు మూడింది కాబట్టే ఇటువంటి ప్రేలాపనలు చేస్తున్నావు. నిన్ను సమ్హరించమని దేవతలు ప్రార్థిస్తే నేనిటు వచ్చాను. అదే నా లక్ష్యమిప్పుడు!! చివరిసారి హెచ్చరిస్తున్నాను. పాతాళానికి పారిపో,లేదా, యుద్ధానికి సన్నద్ధుడవు కా!! ఇక్కడే ఇంకా నిలబడ్డావో, ప్రాణాలతో ఉండటం కల్ల!!’

మహిషాసురుడికి, ఆమెను తనదారిలోకి తెచ్చుకోవటం అసాధ్యమని తెలిసిపోయింది. ధనుష్టంకారం చేశాడు. దుర్ధరుడూ, తామ్రుడూ, త్రినేత్రుడూ – అందరూ మహిషుడి నలువైపులా నిలుచున్నారు. కానీ, మహాదేవి చేతిలో కాసేపటిలోనే కళ్ళు మూశారు. అంధకాసురుడనేవాడిలా వచ్చి అలా, అమ్మవారి సిమ్హానికీ ఆహారమైపోయాడు.

మహిషాసురుడికి, మతి చలించింది. తన వైపు వీరాధివీరులందరినీ, యీ విచిత్ర వనిత దునుమాడింది. ఇక తానే యీమెతో పోరాడలి. అంతే!! పిచ్చి కోపంతో బాణాల వర్షం కురిపించాడు. అన్నిటినీ మార్గ మధ్యంలోనే తుత్తునియలు చేసిందామె!! గదను విసిరిందామె!! అది నేరుగా మహిషుడి ఎదనే తాకింది. క్షణం మూర్చపోయినా వెంటనే తేరుకుని, తానూ గదను ప్రయోగించాడు. అది సిం హం మెడను తాకింది. విలవిలలాడిందా సిమ్హం!! బలిష్టమైన పంజా విసిరిందది, మహిషుడి పైకి!! చాకచక్యంగా తప్పించుకున్నాడు వాడు!! పురుష రూపం వదిలి తానూ సిమ్హమయ్యాడు. దేవి కూర్చున్న సిం హం పై దాడి చేశాడు. మహాదేవి వజ్రసమాన బాణాలను ప్రయోగించింది. దెబ్బకు మహిషుడు మత్తేభమయ్యాడు. రణరంగమంతా వీరంగం వేశాడు. ఒక పర్వత శిఖరాన్ని, తొండంతో పెకలించి, మహాదేవి మీదకు వేశాడు. కానీ, మహాదేవి వేసిన తీక్ష్ణమైన బాణాల ధాటికి, కొండ పిండిపిండైంది. విజయ గర్వంతో కూడిన ఆమె నవ్వుతో దిక్కులు ప్రతిధ్వనించాయి. ఇంతలో, అమ్మవారి సిం హం, మత్తగజం కుంభ స్థలం మీదకు లంఘించి, గోళ్ళతో చీల్చివేసింది. కానీ మహిషుడు మాయావి కాబట్టి, వెంటనే, శరభ రూపం ధరించేశాడు.

ఎనిమిది కాళ్ళతో, మహా పర్వతాకారం!! పెద్ద వటవృక్షం వలెనే, కదలి వస్తున్నది!! అన్ని వైపులకూ సమానంగా సంచరిస్తున్నది!! సృష్టి నిశ్చేష్టితమై పోయింది!! అశ్శరభ శరభ అని రాక్షస సైన్యం, చిందులు తొక్కుతూ, శరభ రూపంలోని మహిషుడికి ఉత్సాహం పెంచుతున్నారు.

మహిషుడు, మహాదేవికి దగ్గరలో ఉన్నాడు. పదునెక్కిన కత్తితో మహాదేవి శరభుని తలమీద మోదింది. శరభుడు ఏమాత్రమూ చలించలేదు. అర్ధచంద్రాకార బాణలు ఎనిమిదింటిని ఒక్కసారిగా ప్రయోగించి, శరభుని కాళ్ళను ఖండించివేసింది. మహాశరభం చతికిలబడింది. కత్తీ, పరశువూ, ఈటే, గదా, బల్లెమూ, బాణాలూ. ఇలా అన్ని ఆయుధలనూ ఒకేసారి ప్రయోగించింది – మహాదేవి!! దానికి తోడు శంఖాన్ని విజయ చిహ్నంగా పూరించింది!! ఘాంటానాదాలతో శరభుడి చెవులు చిల్లులు పడ్డాయి. ఎటూ వెళ్ళలేక, నిలబడనూలేక మహిషాసుర రూపంలోని శరభుడు, కుప్పకూలిపోయాడు.

మహిషుడు, మళ్ళీ నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తోక ఝాడిస్తూ, గిట్టలతో మట్టగిస్తూ, కొమ్ములతో కుమ్ముతూ, ముందరికాళ్ళతో నేలను తవ్వుతూ.. భీభత్సం చేస్తున్నాడు. కొమ్ములతో మహాదేవిని పొడిచేందుకు ముందుకు దూసుకువస్తూ, గర్జిస్తున్నాడు..’నీపని ఇప్పటితో సరి!! ఏదో ఆడదానివి అని వదిలేస్తే, నన్నే మట్టుపెడతానంటావా? నీ ధైర్యం చూసుకునా ఆ దేవతలు, ఆకాశం నుండీ నీకు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు?? పిచ్చి వాళ్ళు!! నీకు పద్ధెనిమిది బాహువులున్నాయనికదా నీ గర్వం!! నా బలం ముందు నీ బాహువులెందుకు పనికి వస్తాయి?? ఇదిగో, యీ క్షణం నుండీ, యీ సర్వ జగత్తూ దేవతాశూన్యమైపోబోతున్నది. కాసుకో..నిలు..నిలు..’ అంటూ, వెంటపడ్డాడు.

మహాదేవికిక వీణ్ణి సహించే ఓపిక పోయింది.’ఓరీ దున్నపోతా!! నా దెబ్బలనుంచీ తప్పించుకోవటానికి, ఇప్పటిదాకా ఎన్నెన్ని ఆకారాలు ధరించావు?? ఐనా, ఎన్నెన్ని దెబ్బలు తిన్నావు?? ఇంకా నీకు బుద్ధిరాలేదన్న మాట!! ఇదిగో, ఇంక సహించలేను!! ప్రేలాపనలు మాని నా ముందు నిలబడు!! నిన్ను యీ క్షణమే తుదముట్టించేస్తా!!’ ఈ మాటలంటూ, మహాదేవి, సువర్ణపాత్రికనెత్తి, ద్రాక్షాసవాన్ని గటగటా త్రాగింది. అగ్ని కణాలు కళ్ళలోంచీ రాలుతుండగా, త్రిశూలాన్ని చేతబూనింది. దృఢంగా మహిషుడి కొమ్ములు విరిగేలా ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగందుకున్నాడు.

మహాదేవి వెంబడిస్తూనే ఉంది.

అమె అలా తరుముతున్నకొద్దీ, మహిషుడు, ప్రాణభీతితో, పరుగులు పెడుతూనే ఉన్నాడు.

దేవతలు దుందుభులు మ్రోగిస్తున్నారు. పుష్ప వర్షం కురిపిస్తున్నారు. ఉచ్చైశ్రుతులలో మహాదేవీ స్తుతి కొనసాగిస్తున్నారు.

ఒంటరి మహిషుడు, వేషాలు మారుస్తున్నాడు. ఐనా మహాదేవి త్రిశూలంతో వాణ్ణి తరుముతూనే ఉన్నది.

త్రిశూలానికి అందకుండా వాడు చేసే ప్రతి చర్యనూ మహాదేవి కర లాఘవంతో, తిప్పికొడుతూ, వాణ్ణి గాయపరుస్తూనే వెళ్తున్నది. ఒక్కసారి సింహం నుంచీ కిందకు దిగి, వాని గుండెల్లో త్రిశూలాన్ని దింపిందాతల్లి.

ఈ దెబ్బకు, కళ్ళు తేలవేసినవాడల్లా, అంతలోనే తేరుకుని, అమ్మవారినే కాళ్ళతో బలంగా తన్నాడు వాడు.

విజయ గర్వమనిపించిందో ఏమో, దిక్కులు దద్దరిల్లేలా భీషణంగా అరచాడు. అంతలోనే లేచి నిలబడ్డాడు కూడా.

‘మహాదేవి భీకరంగా గర్జించింది..’ఒరే మహిషమా!! నీ పని ఇక సరి!! ఇదిగో..యీ నూరంచుల చక్రాయుధం, నీ కుత్తుకను తెగవేసేందుకు వస్తున్నది కాచుకో!! ఈ వైష్ణవ శక్తిని,మహాలక్ష్మిగా ఆజ్ఞాపిస్తున్నాను,నిన్ను బలి తీసుకునిగానీ తిరిగి రావద్దని!! ఆఖరి సారిగా ఊపిరి పీల్చుకో!! ఇప్పుడిక మృత్యువునాహ్వానించు!! అదిగో నీకోసం, నరక ద్వారాలూ తెరచుకున్నాయి!! యముని మహిషపు లోహ ఘంటానినాదం నీకు వినబడుతున్నదా లేదా?? వెళ్ళిరా ఇక!!”

ఈ మాటలంటుండగానే, విష్ణుచక్రం మహిషుడి కుత్తుకను త్రుటిలో తెంచి వేసింది. వాని కంఠభాగం నుంచీ వేడి నెత్తురు, పైకి చిమ్మింది. తల తాటి పండువలె, చాలా దూరానికి వెళ్ళీ పడిందెక్కడో!! కిందికి ఒరిగిన వాని శరీరం,రక్త ధారల సెలయేరులతో తడిసి ముద్దై, గిరగిరా బొంగరం వలెనే తిరిగి, నేలకొరిగింది.

మహిషుని మృతికి మతులు పోయిన సైనికులు, గగ్గోలుగా చెల్లాచెదరౌతుంటే, మహాదేవి సింహం వారిని అన్నివైపులనుంచీ తరిమి, నోటగరచుకుని, ఆకలి తీర్చుకున్నది.

దేవతలు, మహాదేవి జయగీతాలు పాడారు. దేవతాంగనలు ఆమెకు దిష్టి తీశారు. దివీ, భువీ, ఆమెను నుతించాయి.
మహిష వధ తరువాత, మహాదేవి, ప్రశాంతత మొగాన ప్రతిఫలిస్తుండగా, ఒక పరిశుభ్రమైన చోట, తన మృగేంద్ర వాహనం మీద చిరునవ్వులు చిందిస్తూ ఆసీనురాలైంది.సింహం కూడా ఎమీ జరగనట్టే, నిల్చుని వున్నది.
బ్రహ్మాది దేవతలు, వినయ ముకుళిత హస్తాలతో మహాదేవిని స్తుతిస్తున్నారు..’జగదీశ్వరీ!! త్రిమూర్తులను కూడా నియంత్రిస్తూ, జగదధినాయకిగా,నీవే కదా, మమ్ములనందరినీ నడిపిస్తున్నది??కీర్తి, మతి, ధృతి, కరుణ, గతి, విద్య, క్షమ, పుష్టి, కళ,ఉమ, రమ, కాంతి, మేధ – ఇవన్నీ నీవే కదా తల్లీ!! అన్నిటివెనుకా నీ శక్తే కదా ఉన్నది??
ఎప్పటికప్పుడు యీ సంగతి తెలిసేలా నీవు చేస్తున్నా, మూర్ఖ మానసులు, నిన్ను కాక, తక్కిన దేవతలనే ఉపాసించటం ఎంత హాస్యాస్పదమమ్మా!! వాళ్ళనందరినీ కూడా నీవు పెద్దమనసుతో క్షమిస్తున్నావు కదా!!
నీ పాద రజ ప్రభావంతోనే సృష్టి, స్థితి, లయాదులు, యే విధమైన ఆటంకమూ లేకుండా ఇన్ని యుగాలుగా జరిగిపోతూనే ఉన్నాయి. నీ అపారమైన కరుణను ఏమని పొగడగలం??
మాపైనే కాదు, అసురులపైన కూడ నీవు దయనే వర్షించావు. వారికి స్వర్లోక సుఖాల మీద ఉన్న మరులును కనుగొని, వారిని యుద్ధంలో వధించి, వారికి, స్వర్గలోక ప్రవేశార్హతను ప్రసాదిస్తున్నావే!! ఈ సత్యాన్ని కనుగొనలేని వాళ్ళు అజ్ఞానులే తల్లీ!!
పరాదేవతా!! నీ పతి స్థానీయుడైన పరమాత్మలో చిఛ్ఛక్తి ఉన్నది కాబట్టే, అతను కూడా జగత్తులో అభివ్యక్తమౌతున్నాడు.అతడు కాక మరెవ్వరూ నువ్వు లేకుండా కదలటానికీ, మెదలటానికీ కూడా అశక్తుడే కదా తల్లీ??
ఈ అఖిల విశ్వమూ, ఇలా ఆవిర్భవించటానికి ముందు కూడా నీలోనే ఉన్నది. ఇప్పుడు కూడ నీలోనే ఉన్నది. అందరికీ నీవే అధికారిణివి!! జయోస్తు!! విజయోస్తు!!
ఇప్పుడు ఆ మహిషాసురుణ్ణి ఒక్క పోటుతో సం హరించి, నీ అపార కృపా దీక్షను లోకానికి విదితమొనరించావు మహాదేవీ!! ఇలాగే ఇక ముందు కూడా అహంకార గర్విత దానవాధములనుండి జగత్తును కాపాడుతూ ఉండవలసినదని, నిన్ను వినయ మానసంతో వేడుకుంటున్నాం మహాదేవీ!!’
వారి యీ స్తుతికి సంతసించిన మహాలక్ష్మి, ‘తప్పక వస్తాను!! ఇంతకన్నా దుస్సహమైన కార్యమైనా సరే, మానవాళికి మేలుచేసే మీకోసం చేయటానికి నేనెప్పుడూ సం సిద్ధురాలనే!! అటువంటి అవసరాలప్పుడు, ఎటువంటి జంకూ గొంకూ లేక, నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆయా ఆపదలు తొలగిస్తాను..’ అని అభయ ముద్రనిచ్చింది!!
దేవతలూ, మానవులూ ఏకస్వరంతో అన్నారు..’ఆపదలు లేని వేళలలోనూ, నీ స్మరణను నిరంతరం మరువక చేసే వరమివ్వు తల్లీ!! నీ పదపద్మాల నిరంతర సేవనమే మా భావనంగా మనగలిగే జీవితాలనివ్వు మాతా!! నిన్ను కాదన్న దేవతైనా మానవుడైనా – మంద భాగ్యుడే!! సుఖ దు:ఖాలకు అతీతంగా, ఎల్లప్పుడూ, నిన్నే తలచుకునే మమ్ములను సదా కాపాడ వేడెదము జగన్మాతా!! నీ చరణ పద్మ రజో రేణువే – మా అపరిమిత సౌభాగ్యమమ్మా!!
అన్యధా శరణం నాస్తి, త్వత్ పదాంబుజ రేణుత:
అందరినీ ఆశీర్వదిస్తున్న ముద్రలో అంతర్ధానమైంది – ఆ మహాదేవి తన మణిద్వీపంలో తిరిగి కొలువయ్యేందుకు!!!!!
అంతవరకూ ఓపికగా యీ మహిషాసుర వధ ను విన్న పామరులు ..కొందరందుకున్నారు భక్తి పారవశ్యంలో!! ..
దేవి మాయమ్మా దేవి మయమ్మా
కరుణించి మము బ్రోవు మహదేవివమ్మా..
జయ జయా పలికేము, జగదంబవని నీకు
మాయామతుల మమ్ము మమతతో కరుణించు…. దేవి..
మహిషాసురుని పొగరు నణచిన తల్లీ,
మాలోని పసరముల నణచవే దేవీ
ఎదుటివారల బాగు కంటి మంటగ జూచు
కుటిల బుద్ధుల మతుల మంచి బాటల జూపి……..దేవి..
మనసునే గుడి చేసి మది నిన్నె దలచేము,
కలిమిలో కష్టాల నిను మరువకుండేము
హారతూలెత్తేము, సిం హ వాహిని నీకు
పరమ పావని మహాదేవి, జయకారిణీ………………………దేవి..
వారి పాటను విన్న మరో ఆరాధకుడు, తనదైన రీతిలో అమ్మకు జయజయ పలికాడు.
నీలోత్పల నిను వేడెద!!
మా లోపలి మలినములను మదినెంచక నీ
హేలా మేళన చర్యల
బాలా!! తొలగింపవమ్మ!! పాటలగంధీ!!
జయ జయ హే జగదీశ్వరి!!, జయ మహిషాసుర మర్దిని !! జయహే జననీ!!
సకలార్థ సిద్ధి దాయిని, సుర సన్నుత!! సర్వ శక్తి సంయుత శక్తీ!!
మయి తిష్ట మహాదేవీ!! యథా తిష్టతి విష్ణునా,
అభయం కురు సర్వేషాం!! మహా వృద్ధీ !! నమోస్తుతే!!
మయి తిష్ట మహాదేవీ!! యథా తిష్టతి ఈశునా,
అభయం కురు సర్వేషాం!! మహా తుష్టీ !! నమోస్తుత్తే!!
మయి తిష్ట మహాదేవీ!! యథా తిష్టతి తాతనా!!
అభయం కురు సర్వేషాం!! మహా సిద్ధీ !! నమోస్తుతే!!
మయి తిష్ట మహాదేవీ!! యథా తిష్టతి సృష్టినా
అభయం కురు సర్వేషాం!! రక్షమాం!! శరణాగతం !!
ఈ కథనంతా వ్యాస ముఖత: విని తరించటమే కాక, నైమిశారణ్య పవిత్ర క్షేత్రంలో ఆయా గాధలు అక్కడున్న సకల జనులకూ ఓపికగా వినిపిస్తూ తరింపజేస్తున్న సూతులవారి విశాల హృదయానికి ప్రణతులర్పించారు వారందరూ.

 

స్వస్తి.

 


దేవీ భాగవత పారాయణ సమయంలో, సాధారణ భక్తురాలిగా నా మదిలో తలెత్తిన కొన్ని సందేహాలూ, విస్మయాలకు తావిచ్చేందుకే, ఇందులో మూలంలో లేని కొన్ని పామర పాత్రలను స్వీకరించటం జరిగింది. సహృదయ పాఠకులు మన్నింతురు గాక!! చివరి దేవీ స్తుతి కూడ నా మది సవ్వడే. ఇందులోని దోషములన్నీ నావి. నా సాహసాన్ని మన్నించి, పఠించి, నక్షత్ర ముద్రలతో ప్రోత్సహించిన పాఠకులందరికీ కృతజ్ఞతాంజలులు.

డా. శ్రీమతి పుట్టపర్తి (నల్లాన్ చక్రవర్తుల) నాగపద్మిని