అతని పేరు నందలాల్ బోస్.
నందలాల్ బోస్ గురించి ప్రస్తావించే సందర్భంలో అతని గురించి కొన్ని వివరములు:-
శాంతినికేతన్ గురించి తెలియని వారు అరుదు. రవీంద్రనాధ్ టాగూర్ మహదాశయాలకు ప్రతిబింబము అది. ప్రకృతిలోని స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ, మనిషిలో తనలోని కళలకు రూపమును ఇచ్చే ఆశయము నేపధ్యాలతో – స్థాపించిన పాఠశాల శాంతినికేతన్. నందలాల్ బోస్(1882-1966)- (బెంగాలీ ఉచ్ఛారణ ప్రకారము ‘నందోలాల్ బోషు’) చిత్రకళా శైలిలో భారతీయత ఉట్టి పడుతూంటుంది. లలిత కళలపట్ల నందలాల్ కు గల అభిరుచి, అవగాహనలు ఆతనిని వర్ణ కృషీవలుని చేసినవి. అందుచేతనే ఆతనికి రబీంద్ర నాధ్ టాగోర్, అవనీంద్ర నాధ్ మున్నగు వారి ప్రశంసలను లభించినవి. తత్ఫలితంగా ఉన్నత పదవిని పొందగలిగాడు. నందలాల్ బోస్ 1922లో శాంతినికేతన్ -లోని అంతర్విభాగమైన “కళాభవన్ కు ప్రిన్సిపాల్ ఐనాడు.
******
రవీంద్రనాధ్ టాగూర్ కుటుంబీకుల ఆదర్శాలు నందలాల్ బోస్ కు మార్గదర్శినిలు ఐనవి. అలాగే అజంతా గుహలలోని మురల్స్ స్ఫూర్తిని ఇచ్చినవి. ఖద్దరు, రాట్నచక్రము- అహింసావిధానము ద్వారా స్వాతంత్రోద్యమాలలో పాల్గొని దేశం మొత్తమూ గాంధీజీ ఆనతిని ఔదల దాల్చింది. ఆనాడు దేశం యావత్తూ మహాత్మా గాంధీ అడుగుజాడలను అనుసరించింది. నందలాల్ బోస్ భాగ్యవశాత్తూ నాటి స్వాతంత్ర్య సమరయోధులతోనూ, నేతలతోనూ ప్రత్యక్ష పరిచయ భాగ్యాలు కలిగినవి. దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకునిగా- సమస్త ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తూన్న చైతన్యమూర్తి ఐన బాపూజీని చూసిన మహత్తరదృశ్యాలను నేత్రద్వయాల నింపుకున్న అదృష్టాన్ని పొందిన వారిలో ఒకడు నందలాల్ బోస్. స్వయంగా చేయి తిరిగిన ఆర్టిస్టు ఐన నందలాల్ బోస్ కుంచెలో నుండి బొమ్మ పురుడుపోసుకున్నది.
******
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్” అని కదా సముద్రాల సూపర్ హిట్ సాంగ్ లోని ప్రధమ వాక్యాలు! సరే! ఇంతకీ లినోకట్ టెక్నిక్ అంటే?
లినోకట్ – కొంచెం క్లిష్టత కలిగిన మెథడ్ కోవలోనిది. సాధారణ చిత్రలేఖనములకు విభిన్నమైనది. లినోకట్ – మార్కెట్ లో ఉంటూన్న Murals కనువిందు చేస్తూన్నవి కదా! “మురల్స్ బొమ్మలు జనాలకు నచ్చుతున్నవి. లినోకట్ ఇంచుమించు మురల్స్ లాంటిదే అనవచ్చు. లినోనియన్ లోహపు షీటు మీద లినోకట్ – Imageచేస్తారు. కొన్నిసార్లు చెక్కబ్లాకు పైన చేస్తారు. డిజైనులను ఆ ఉపరితలాలపై చెక్కినట్లుగచేస్తారు. ఇందుకు కొన్ని పరికరాలను వడుతారు. “V” షేపు కొసల చాకును గానీ, chiselని గానీ gouge ని గానీ ఉపయోగిస్తూతూ బొమ్మను చెక్కుతారు. ఇది ఉబ్బెత్తుగా ఎత్తుపల్లాలు కొంచెం ఉబికినట్లుగా అగుపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే – 3D చిత్ర పటము- అన్నమాట!
******
సరే! వీనికీ, ఇతర పెయింటింగు విధానాలకూ – ఒక వింత వ్యత్యాసం ఉన్నది, అదేమిటంటే అద్దములో మనము చూసే దృశ్యములు ఎలాగ కనిపిస్తూంటాయి?
Linocut లను చేతితో అదే రీతిగా చేస్తారు. రివర్స్ గా సిద్ధం చేసిన ఇట్టి చిత్ర/ శిల్పము- ను పేపరు మీద, ఫాబ్రిక్, వస్త్రం మీద అచ్చు వేస్తారు. ఇందుకు రోలర్, బ్రెయర్ (rooller, brayer) మాదిరి అదనపు సాధనములు ఉపకరిస్తారు. అలాగ నందలాల్ బోస్, లినోకట్ – స్టైల్ ద్వారా వేసిన బొమ్మ- నేటికీ అనేక సందర్భాలలో పున@ పునః ప్రాదుర్భవిస్తూనే ఉన్నది. రోడ్డు కూడలిలో నిలిపే మన జాతిపిత బాపుజీ విగ్రహములకు – అలనాడు బోస్ గీసిన నాటిలినోకట్ చిత్రమే మూలస్తంభము. 1930 ల్లో వేసిన ఆ నాటి ఆ Dandi March చిత్రము ఇందరి మన్ననలనూ, ఆమోదముద్రను పొంది, చరిత్రాత్మకతను గడించి, సార్ధకమైనది.