ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అలక్ నిరంజన్! అలక్ నిరంజన్!

Like-o-Meter
[Total: 0 Average: 0]

“అలక్ నిరంజన్” అనే ఊత పదం బహుళ వ్యాప్తిలో ఉండడం మనకు తెలిసినదే కదా!

’అలక్ నిరంజన్’ అనగా “లక్షణములను తటస్థ చిత్తముతో భావించే వాడు” అని భావము. ఈ అలక్ నిరంజన్ అనే మాటకు 6-7 వ శతాబ్దముల నాటి నుండీ ఒక మంత్రము వలె జనవాక్యమై ప్రచారములోనికి వచ్చింది. నేడు ఆ “అలక్ నిరంజన్” పదము ఒక ఊనిక కల ఊత పదంగా అనేక జిహ్వాలపైన ఆడుతున్నది. అసలు ’అలక్ నిరంజన్’అనే శృతి సుభగమైన ఈ పదము ఎక్కడినుండి వచ్చింది?

అలక్ నిరంజన్  అనగానే యోగ సాంప్రదాయ అనుయాయులకు, నాథ సాంప్రదాయ ప్రవర్తకులకూ తటిల్లతలలాగా హృదయాలలో మెరిసే వ్యక్తియే “మత్స్యేంద్ర నాథ్”. నిర్గుణ బ్రహ్మ తత్వ ప్రతిపాదిని ఈ పదము. శ్వేతేశ్వర ఉపనిషత్తు నుండి ఈ యోగ సాంప్రదాయ వేద వాక్యము- గ్రాహ్యమైనది. పరమ శివుని- “సత్ + చిత్ + ఆనందమూర్తి-” గా భక్తుల హృదయాలలో సాక్షాత్కరించడమే ఈ అలక్ నిరంజన్- పద సాకారత్వ మహిమ.

మనము చైత్ర మాసములో నూతన వత్సర శుభ ఘడియలను ఆహ్వానిస్తూ, ప్రసాదమును స్వీకరిస్తాము. అదే పంథాలో బెంగాల్, మున్నగు రాష్ట్రాల వారు వైశాఖ మాసములో కొత్త సంవత్సరమును ఉత్సాహభరితంగా చేసుకుంటారు. అదే రోజున మత్స్యేంద్ర నాథ్ జాతర జరుగుతుంది.

మాయా మచ్చీంద్ర- సినిమా తెలుగు 1975 లో వచ్చింది. (ఐతే సినిమా హిట్ అవలేదు). ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, రామకృష్ణలు ప్రధాన నటులు.


మత్స్యేంద్ర నాథ్  శిష్యులు రెండు వర్గాలు – ముని యోగి చౌరంగిలు, గోరఖ్ నాథ్ వర్గీయులు.

గోరఖ్ నాథ్ మత్స్యేంద్ర నాథ్ శిష్యుడు. పింగళ అనే రాణి మత్స్యేంద్ర నాథ్ ను ప్రేమించి, పెళ్ళాడింది. గోరఖ్ నాథ్ తన గురువు ఉన్న దేశానికి (మధ్య భారత దేశములోని- త్రియా/ తర్యా సీమ)కు వెళ్ళాడు. భోగవిలాసాలలో మునిగి తేలుతూ, లోకములోని ప్రజల బాధలను గమనించని స్థితిలో ఉన్న మత్స్యేంద్ర నాథ్ లో జాగృతిని కలిగించాడు. గురువును అతి స్వతంత్ర బుద్ధితో, చాలా చనువు తీసుకుని, హెచ్చరిస్తూ,
మరల నిర్దేశించుకున్నట్టి మార్గములోనికి నడిపగలిగిన వింత ఘటన ఇది. గురు శిష్య బంధములో విభిన్న శైలిని ఆవిష్కరించిన సంఘటన, హిందూ ఇతిహాస, పురాణ గాథ- బహుశా ఇది ఒక్కటేనేమో!

అలాగే కేవలము సిద్ధాంతాలకే పరిమితము చేసేయకుండా, మాటల సూత్రాల గిరి గీతలలో  ఇమడ్చకుండా మానవులు ఆరోగ్య, జ్ఞాన, సముపార్జన లక్ష్యాలను రూపొందించిన అద్భుత యోగ గురువు మత్స్యేంద్ర నాథ్. నాథ సాంప్రదాయ స్థాపకుడైన మత్స్యేంద్ర నాథ్ “మీననాథ్” అనే పేరుతో కూడా  పిలువబడ్తున్నాడు. మత్స్యేంద్ర నాథ్ జాతర, అనగా మత్స్యేంద్ర నాథ్ రథ యాత్రను నేపాల్, మహారాష్ట్ర, బెంగాల్ ఇత్యాదిగా-
ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజు “నేపాల్ సంవత్” (New Year 1129 NS (Nepal Sambat)అంటే “నేపాలీయుల నూతన సంవత్సరము పండుగ”ను మన దక్షిణాదిలో “ఉగాది పండుగ” లా అన్న మాట.