ఈ పది పేర్లనూ మారువేషంలో ఉన్న అర్జునునికి చమత్కారంగా “పూసలు గుచ్చి” వేసారు. శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే తెలుగు సినిమాలో వీరార్జునునికి ఇలాటి వింత నామకరణం చేసిన ప్రఖ్యాత తెలుగు సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు గారు.
*******
బాలిదేశ చక్రవర్తి అర్జునుని కథే “అర్జున వివాహము”. ఈ కథాంశం ఇండొనేషియాలో ఆబాలగోపాలమూ ఇష్టపడే కథా ప్రదర్శనా కళా స్వరూపము.
అర్జున వివాహము ఇతివృత్తాన్ని ఆస్థాన కవి కణ్వ మహా భారతమునుండి గైకొన్నాడు. బాలిదేశ ద్వీపసముదాయాలలో నేటికీ ఆదరించబడుతున్ననృత్య, నాటక కళా రూపము. మన దేశములోని ప్రాచీన కావ్యం “కిరాతార్జునీయా“నికీ, జావా దీవినందలి ప్రాచుర్యగాధకూ అనేక పోలికలు ఉన్నవి.
*******
కథాకమామిషూ
11వ శతాబ్దములో ఇండొనేషియా ప్రాంతమైన “కెదిరి” సామ్రాజ్యాన్ని ఆస్థాన కవి ‘కణ్వ’. తూర్పు జావాలో ఉన్న రాజ్యం కెదిరి. రేఖామాత్రంగా మహాభారత వివరములను స్వీకరించి తన స్వీయపంధాలో పాత్రలను తీర్చిదిద్దాడు కవి కణ్వ. మహాభారతమును చదివినవారికీ, ఆ కథ తెలిసిన వారికీ ఈ జావా గాధ లోని అంశాలకూ, వేదవ్యాస కృత “జయమ్” కూ, అలాగే భాస విరచిత “కిరాతార్జునీయము”నకూ గల సామ్య, భిన్నత్వాలను గుర్తు పట్టగలుగుతారు. మాయల మరాఠీ, కీలుగుర్రం, పాతాళభైరవి వంటివీ, సుప్రసిద్ధ “కాశీ మజిలీ కథలు” లోని అంశాలు- కథాక్రమములో కణ్వగ్రహించి, ఒక అందమైన కావ్యాన్ని జావా ద్వీపవాసులకు అందించిన తీరు ప్రశంసార్హమైనది.
*******
అర్జునుడు హస్తినాపుర ప్రభువైన పాండు రాజుకు మూడవ తనయుడు అర్జున్. అర్జున్ ఏకాగ్రత, ధీరతలను ఆర్జించి, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని, రానున్న మహాసంగ్రామంలో యోధానుయోధుడుగా తనను తాను మలుచుకొనుటకు సంకల్పించుకున్నాడు. అందుకై అర్జున్ తపస్సు చేయనారంభించాడు. ఈమన్ ఈమంతక రాజ్య పాలకుడు “నివాతకవచ”. పర రాజ్యాలను ఆక్రమించే క్రూరుడు. అధికారలాలస మిక్కుటంగా కలిగి, అనేక దుష్ట కార్యాలను చేయడానికి ఎంత మాత్రమూ సంకోచించని రాక్షసుడు నివాతకవచ. అతడు “దేవీ సుప్రభ” అనే స్వర్గ దేవత చాలా అందగత్తె అని విన్నాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. దేవేంద్రుని వద్దకు వెళ్ళిన నివాతకవచుడు “నీ కుమార్తె సుప్రబను నాకు ఇచ్చి వివాహం చేయి ఇంద్రా!” అని అడిగాడు. “నీవు నా ఆత్మజకు తగిన వరుడివి కావు” అంటూ ఇంద్రుడు తిరస్కరించాడు. క్రుద్ధుడైన నివాతకవచ నాకముపై దండెత్తి, మహేంద్ర భవనమును గెలిచి, ఆక్రమించాడు.
*******
మహేంద్రునికి మిగిలినది ఒక్కటే దారి, మానవుల సహాయాన్ని పొందడము. కనుక ఆతడు యోచించి, అర్జునుని వదకు వెళ్ళాలని తలిచాడు. ఆ తరుణాన అర్జునుడు ఇంద్రకీలాద్రిపైన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే భారత యుద్ధములో వీరునిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించుటకై, అందుకు తగినంత శక్తిసామర్ధ్యాలను ఆర్జించుటకై అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు “నా సమస్యలను పరిష్కరించి, నన్ను కాపాడగలిగే సామర్ధ్యాలు అర్జున్ కి ఉన్నవా?” అని సంశయము వచ్చినది. అర్జునుని పరాక్రమాన్ని పరీక్షకు పెట్టే అవకాశము, అర్జునునితో రణరంగమున ఎదుర్కొనుట!” అని అనుకున్నాడు.
అర్జునుని సామర్ధ్యాన్ని పరీక్షించ దలచాడు దేవరాజు. అందు నిమిత్తము ఏడుగురు అప్సరసలను నియమించాడు. “అర్జున తపోభంగము చేయుడు” అని సప్త అప్సరసలను పంపించాడు. వారిలో ఇద్దరు కొరవ వారికన్నా మిక్కిలి అందగత్తెలు. అచ్చరల హొయలులు, ఒలకబోసిన వయ్యారములు- అర్జునుని నిగ్రహాన్ని భంగపరచలేకపోయాయి.
*******
ఇంద్రునికి యుద్ధములో సహాయపడగలిగిన వాడు అర్జున. ఇది తెలిసిన నివాతుడు అర్జునునిపైకి మొమాంగ్ మూర్ఖ అనే రాక్షసుణ్ణి ఉసిగొలిపాడు. నివాతునికి అర్జునుడు అమేయ విక్రముడని అర్ధమైనది. అతడు అర్జునుని పైకి పోరాడమని- మొమాంగ్ మూర్ఖ అనే రాక్షసుని పంపించాడు. కొండ ఉన్న గ్రామానికి వచ్చాడు. అడవి పంది వేషాలను ధరించాడు. కామరూపధారి ఐన మొమాంగ్ మూర్ఖ పల్లెను ధ్వంసము చేసాడు.
పల్లె జనపదములను, అటవీ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత అర్జునుని భుజస్కంధాలపైన పడినది. ఇక తప్పనిసరై, కాస్సేపు తన మౌన తపముని పక్కన బెట్టి, విల్లంబులను చేత బూనాడు. ఒకే శరముతో వరాహ రూపంలోని మొమాంగ్ మూర్ఖని కూల్చాడు. ఇంద్రునికే కాదు, నివాతునికి కూడా “అర్జునుడే నిజమైన కథానాయకుడు, బాహు విక్రమశాలి” అని తేటతెల్లమైనది.
*******
అర్జునుడు ఆశ్చర్యపడేలా అప్పుడే అక్కడే అప్పటికప్పుడే ఒక కొత్త మనిషి ఎదురైనాడు. “ఈ సూకరమును (అడవిపందిని) నేను బాణముతో కూల్చాను” అన్నాడు. ఆశ్చర్యచకితుడైన అర్జునుడు ” కాదు, ఒక్క బాణముతో నేను ఈ వరాహాన్ని కూల్చాను” అన్నాడు. కొంతసేపటికి వాతావరణములో ఆగ్రహ సెగలు నిండాయి. ఇద్దరూ భూ నభోంతరాళాలు దద్దరిల్లేలా యుద్ధం చేసారు. కొసకు ఆ హీరో అర్జునుని కొట్టిన దెబ్బకు, అర్జునుడు నేలపై చతికిలబడినాడు. అతడెవరో కాదు, సాక్షాత్తూ పరమేశ్వరుడే!! (God Syiwa).
“స్వామీ, మహాదేవ శంభో! నీవని ఎరుగని నేను నీపై రణ దుందుభి మ్రోగించాను. నన్ను క్షమించు శివా!” అన్నాడు అర్జునుడు.
“అర్జునా! నీవే నిజమైన వీరునివి! నీవు అలౌకిక శక్తులను ఇప్పటికే సాధించినట్టి – పట్టుదల కలిగిన మహా యోధునివి. ఇదిగో! మహామహిమన్వితమైన పాశుపతము. దీనిని నీకు ఇస్తున్నాను. ఈ బాణం తిరుగులేనిది, భద్రం!” అంటూ అనుగ్రహించాడు పశుపతినాధుడు. శైవ (God Syiwa) ధూమరూపముగా మాయమైనాడు.
అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్ళసాగాడు. తపోగిరికి మరలిపోవుచుండగా అర్జునుని వద్దకు ‘ఇంద్రుడు పంపిన దూత ‘ వచ్చాడు. “అసురునిపై యుద్ధం చేయడానికై ఇంద్రుడు అర్జునుని సాయమును కోరాడు.
శరణాగతి అనగా శరణు కోరిన వారిని రక్షించడము తన కర్తవ్యమని భావించిన అర్జునుడు, వెంటనే తన అంగీకారము తెలిపాడు. అర్జునునితో రణ వ్యూహమును గూర్చి చర్చించాడు ఇంద్ర.
“ఆ రక్కసుడు తుది లేని వరము కలవాడు. ఆతని ప్రాణ రహస్యాన్ని తెలుసుకోగలిగితేనే అతడిని గెలువగలము అర్జునా!” అన్నాడు దేవాధిపతి. వారి పథక రచన ప్రకారము “సుప్రభ”ను నివాతకవచుని దరికి పంపాడు ఇంద్రుడు. ఆమెకు రక్షాకవచముగా వెంట వెంట వెళ్ళినవాడు కథానాయకుడైన అర్జునుడు.
“నివాతకవచుడు సూక్ష్మ రూపములో ఎవరికీ కనబడకుండా ఉండగలుగుతున్నాడు కదా!, ఆ రహస్యమేమిటి? దానిని నువ్వు కనుక్కోవలెను” అని గొప్ప విధిని ఇంద్రుడు అప్సరసకు పురమాయించాడు.
*******
అర్జున్ ఒక వ్యూహం పన్నాడు. అర్జునుని పధకమును ఇంద్ర, సుప్రభలు అంగీకరించినారు. సూక్ష్మరూపాన అర్జున్ రహస్యముగా సుప్రభను కాపాడుతూ బయలుదేరగా, ఆమె నివాతకవచుని వద్దకు వెళ్ళినది. ఆమెను చూడగానే నివాతకవచుడు సంతోషంతో సుస్వాగతం పలికాడు. సుప్రభ ప్రేమ పలుకులతో నివాతకవచుని మైమరిపించింది. “నీకు అద్వితీయ విజయాలు ఎలాగ లభిస్తూన్నవి? సునాయాసముగా విజేతవు ఔతూన్నావు, ఎలాగ? ” అంటూ అసలు ఊసును అడిగింది సుప్రభ.
నివాతకవచ సులభంగానే వివరించాడు – “చాలాకాలము క్రిందట నాకు యుద్ధ వేళలలో కొన్ని అద్భుత శక్తులను దేవతలు ఇచ్చారు.” అని చెప్పాడు. అంతర్హితముగా అక్కడే ఉన్న అర్జునుడు రాక్షసుని ప్రాణరహస్యం గూర్చి కొంత తెలుసుకున్నాడు. వెంటనే బైటి ద్వారం వద్ద రాక్షసులను బాణ పరంపరతో మట్టి కరిపించి, సుప్రభను తోడ్కొని ఇంద్రుని కలిసాడు.
*******
సుప్రభ తప్పించుకున్నదని తెలిసిన నివాతకవచ క్రుద్ధుడైనాడు. మళ్ళీ ఇంద్రలోకాన్ని మహాసైన్యాలతో ముట్టడి చేసాడు.
“ఇంద్రా! అర్జునా! పిరికిపందలలాగా లోపల ఉన్నారెందుకు? బైటికి వచ్చి ముఖాముఖీ నాతో పోరాడండి.” అని నివాతకవచ”పెడ బొబ్బలు పెట్టాడు. అర్జునుడు ఇంద్ర మహలు నుండి వెలుపలికి వచ్చి, ద్వంద్వ యుద్ధము చేయసాగాడు.నివాతకవచ ఎంతసేపటినుంచీ యుద్ధం చేస్తూన్నా, అలసట అతనికి కలగడము లేదు. భీకరపోరాటాన్ని చేస్తూంటే రోజులు గడిచిపోతున్నాయి. అంత సమరమునందూ నివాతకవచ తన నోరు తెరవకుండా జాగ్రత్త పడ్డాడు. అందుచేత అతనిని ఓడించడం కష్టసాధ్యమైంది.
అర్జునుడు మరొక ఉపాయాన్ని ఎన్నుకున్నాడు.
కింద పడినట్లు నటిస్తూ అర్జునుడు “నన్ను కనికరించు. నా దైవము ఆనతి పై నేను నిన్ను ఎదిరించాల్సి వచ్చింది. దయ చూపు!” అంటూ విలవిలలాడసాగాడు. అర్జునుడు నిజంగానే కిందపడ్డాడని అనుకున్నాడు రాక్షసుడు. అర్జునుని ఆ మాటలకు గటిగా నవ్వుతూ అన్నాడు “ఓ అర్జునా! నీవు మహా యోధుడవని విన్నాను. నాకు సమ ఉజ్జీవని అనుకున్నాను. కానీ చిన్న కోడిపిల్లలాంటి వాడివని నేననుకోలేదు” అన్నాడు. అది చెబుతూ “నా జిహ్వ మాత్రమే బలహీనమైనది. నాలుక లోనే నా ప్రాణము దాగిఉన్నది” అని అసలు గుట్టును విప్పేసాడు. “ఐతే నేనే సర్వం సహా చక్రవర్తిని అని నీవు ఒప్పుకున్నట్లే కదా!” అన్నాడు.
అర్జునుడు “ఔను!” అంటూ అంగీకారాన్ని తెలిపాడు.
“గెలుపు నాదే! నేనే గెలిచాను.” అని పట్టరాని ఆనందంతో దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసం చేయసాగాడు.
“హ్హ! హ్హ! హ్హ! పిరికిపంద………” అతని మాటలు పూర్తి అవుతూండగానే, అర్జునుడు పాశుపతాస్త్రం నుండి సంధించిన బాణం, ఆ నివాతకవచుని నోటిలోని నాలుకను ఛేదించింది.
*******
ఇంద్రుడు “అర్జునా! నీవు మాకు చేసిన మేలు మరువ లేనిది. నీ ఈ ధైర్య సాహస కార్యాన్ని భగవంతుడే కాదు, మానవజాతికి అమూల్య ఉపకారము. దేవుడు శివుడు నీకు అమోఘ ధనుర్బాణాలను ప్రసాదించాడు. ఇక నేను నీకు ప్రత్యుపకారమును ఏమివ్వగలను? బహుమానముగా సప్త దేవ కన్యలను నీకు ఇస్తున్నాను. ఈ ఏడుగురు సుందరీమణులను పరిణయమాడు” అన్నాడు. అర్జునుడు దివ్య కన్యలను పెళ్ళి చేసుకున్నాడు. వారిలో సుప్రభ, తిలోత్తమలు కూడా ఉన్నారు. స్వర్గ భోగాలను అనుభవిస్తూ దివిలో ఏడు నెలలు గడిపాడు అర్జున్.
తర్వాత ఇంద్రునికి వద్ద సెలవు తీసుకున్నాడు. నాకలోకవాసులకు వీడ్కోలు తెలిపిన అర్జున్ తన స్వదేశమును చేరి, తన దేశమునకూ, తన ప్రజానీకమునకూ రక్షణాది బాధ్యతలను నిర్వర్తించ సాగాడు. అన్న దమ్ములనూ, కుటుంబీకులనూ కలిసి, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపసాగాడు. అర్జున.
*******
మానవ ప్రయత్నమే గొప్పదని నిరూపించడమే భగవానుని అభిలాష. నిరర్ధక ప్రార్ధనాదికముల కంటే మానవుని ప్రయత్నబలమే సార్ధకమైనదని ఋజువు చేయదలిచాడు కవి. అట్లా ధ్యేయనిరూపణ చేసిన రచనను కణ్వుడు చేసాడు. మనిషి ప్రయత్న సిద్ధియే దైవ శక్తి కన్నా మేల్తరమైనది- అని, మనిషిలోని అంతర్లీన తేజస్సుకు పెద్దపీటను వేశాడు ఎంపు కణ్వ. మనిషి ప్రభావ ఉత్తేజాలను ఋజువు చేసే తరహాలో అనేక అంశాలు పుష్కలముగా ఉన్నవి కాబట్టి – కణ్వ రచన – జావాదేశ జనుల చేత ఇతిహాస స్థాయిలో గౌరవించబడ్తూ ఉన్నది.
*******