ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

టాక్సీడ్రైవరు ఔదార్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

24 ఏప్రిల్ 1942. దీనానాథ్ మంగేష్కర్ మరణించారు. శవాన్ని ఇంటికి చేర్చాలి. అంబులెన్సు గురించి వాకబు చేస్తే, అదీ దొరకలేదు. టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. ఆ సమయంలో వచ్చాడు ఓ ముసలి టక్సీ డ్రైవరు.

“శవం ఎవరిది?” అని వాకబు చేసాడు. “ఎవరిదైతే ఏం? అడిగినంత డబ్బు ఇస్తాం కదా!” అన్నారు దీనానాథ్ కుటుంబ సభ్యులు.

“అసలు ఎవరిదో చెప్పొచ్చుకదా!” అన్నాడా డ్రైవరు.

“ఎవరైతే నేం ఓ గాయకుడు!” అని చెప్పారు కుటుంబసభ్యులు.

“గాయకుడా! పేరేంటి?”

“మాస్టర్ దీనానాథ్.”

“అంటే బల్వంత్ సంగీత మండలి నడిపినాయనేనా?” ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్.

“అవును ఆయనే.”

“అయ్యో పాపం, ఆయన నాటకాల వల్ల నేను చాలానే గడించాను. ఆయన నాటకాలు ఆడే థియేటర్లకు చాలామందిని టాక్సీలో తీసుకెళ్ళి నాలుగు డబ్బులు చేసుకున్నాను. మహానుభావుడు. మీరు డబ్బు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఆయన శవాన్ని నా టాక్సీలోనే తీసుకెళతాను” అన్నాడా టాక్సీడ్రైవరు.

దీనానాథ్ మంగేష్కర్ భోగభాగ్యాలలో తులతూగే రోజుల్లో ఈగల్లా ముసిరిన బంధుమిత్రులెవరూ ఆ రోజు కనబడలేదు. ఆ రోజు ఆయన శవాన్నీ తీసుకొని శ్మశానానికి వచ్చినవాళ్ళూ ఆరుగురంటే ఆరుగురే! వారిలో ఆ టాక్సీడ్రైవరు కూడా ఉన్నాడు.