ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బాపూజీ – రామభక్తి

Like-o-Meter
[Total: 0 Average: 0]

“నమో నమో బాపూ! మాకు న్యాయ మార్గమే చూపు!”

గాంధీని ప్రభావితం చేసి, ఆయనను “అహింసా ఆయుధము”ను కనిపెట్టేలా చేసినది ఏమిటి?

బందరు అంటే కోతి అని అర్ధం. ఆంధ్ర దేశంలో బందరు ఉన్నది. గుజరాత్ లోని పోరుబందరు ఉన్నది. మరి పోరుబందరుకు ఒక విశిష్టత ఉన్నది. పోరుబందరు మహాత్మాగాంధీ జన్మస్థానమై, చరిత్ర పుటలలో శాశ్వత స్థానాన్ని ఆర్జించింది. పోరుబందరుకు తూర్పు వైపు “బిలేశ్వర్ కోవెల” క్రీ. శ. 7 నాటిది. ఈ ప్రాచీన దేవళము పేరును మన స్వాతంత్ర్య విజయ సారధి ఐన మహాత్మా గాంధీ తన ఆత్మ కథలో ప్రస్తావించాడు.

మహాత్మా గాంధీకి “రామ నామ పారాయణము” అంటే ఎంతో మక్కువ అని అందరికీ తెలిసిన విషయమే. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ కి బాల్యములో దయ్యాలు, భూతాలు అంటే భీతిల్లే వాడు. “రంభ” అనే ఆయా బాల గాంధీ సంరక్షణ చూసేది. ఆ ముదుసలి దాది “భయం వేసినప్పుడు ‘రామ రామ ‘ అని మంత్రం జపించు. నీ భయం చిటికెలో మటుమాయమౌతుంది” ఈ చిట్కాను అక్షరాలా పాటించిన గాంధీ ఎల్లప్పుడూ ఈ విశేషాన్ని తలుచుకుంటూండే వాడు. చిన్ననాట తన మనసులో పెద్దలు మంచి బీజములను నాటారు. ఆ బీజము వృక్షములా పెరిగి, తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే పరికరము ఐనదని – కృతజ్ఞతతో ఆ గురుతుల్యులను తలిచాడు గాంధీజీ.

******

బిలేశ్వర్ కోవెల లో పరమేశుని బిల్వపత్రములతో పూజిస్తారు. ఆ పల్లెటూరులో నివసిస్తూన్నాడు లాడా మహరాజ్. ఈయన రామాయణమును వివరించి చెప్పే విధానం మృదులతరమైనది. లాడా మహరాజ్ బోధించే రామాయణ ప్రవచనములను ఆలకించడానికై ప్రజలు ఆహ్వానిస్తూండేవాళ్ళు. గాంధీజీ తల్లి దండ్రులు పుత్లీ బాయి, చంద్ గాంధీ. గాంధీజీ కుటుంబం పోరుబందరులో కొన్ని సంవత్సరములు ఉన్నది. మోహన్ దాస్ తండ్రి- కరమ్ చంద్ గాంధీ కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడ్డారు. అప్పుడు లాడా మహరాజ్ ని “రామాయణ ప్రవచనములను వినిపించండి” అని లాడా మహరాజ్ ని పిలిపించినారు. (“సుధామ పురము” అనేది పోరుబందరు ప్రాచీన నామము)

******

చిన్ననాటి నుండే శ్రీమద్రామాయణము పట్ల, ఆ ఇతిహాసంలోని పాత్రల పట్ల, అనుబంధాల పట్ల ఎంతో మమకారము ఏర్పడింది బాపూజీకి. అందుచేత రామాయణ ప్రవచనములను ఆసక్తితో, భక్తి వినమ్రతలతో వినే శ్రోతలలో ముఖ్యుడుగా ఉంటూండే వాడు ఈ భవిష్యత్ భారత జాతిపిత. గాంధీజీ లోని సహజమైన ఈ భక్తిప్రపత్తులచే హరికథకుడు లాడా మహరాజ్ కి ప్రేమ కలిగింది. అతను అనేక వాస్తవ సంఘటనలను గాంధీకి చెబ్తూండే వాడు. లాడా మహరాజ్ చెప్పిన ఈ అంశం బాపూజీకి బాగా జ్ఞాపకం ఉండేదిగా ఐనది. లాడా మహరాజ్ ఇలాగ వక్కాణించాడు.

ఆలాగున వక్కాణించిన లాడా మహరాజ్ జీవిత విశేషాలలో ఒకటి ఇది.

ఒకసారి లాడా మహరాజ్ కి కుష్ఠు రోగం వచ్చింది. ఆ రోజులలో మందులూ మాకులూ లేని వ్యాధిచే సంఘములో అతడు వెలివేయబడి, చాలా మనో వేదనను అనుభవించాడు. పౌరాణిక మహరాజ్ ఆర్తితో భగవంతుని శరణు వేడాడు. లాడా మహరాజ్ ఇంటికి చేరువగా బిలేశ్వర ఆలయం ఉన్నది. కోవెలలో కొలువు ఉన్న స్వామి బిలేశ్వరుడు ఐన పరమేశుడు. అర్చకస్వాములు నిత్యం మారేడు ఆకులతోనూ, విభూది, పూజా సామగ్రితోనూ పూజలు చేస్తూంటారు. ప్రతిరోజూ పాత ఆకులను తీసి, మళ్ళీ మర్నాడు కొత్త పత్రములతో అర్చనలు చేసే వారు. అలాగ వాడిపోయిన, పారేసిన పత్ర పుష్పాదులను “నిర్మాల్యం” అని అంటారు. లాడా మహరాజ్ ఆ పూజాద్రవ్యాది నిర్మాల్యములను ఇంటికి తెచ్చుకునే వాడు. .ఆకులను నలిపి, మేనుకు పులుముకునే వాడు. నిరంతరమూ రామ నామ జపం చేస్తూ, తన గాయాలకు పసరును రాసుకున్నాడు లాడా మహరాజ్. చిత్రంగా లాడా మహరాజ్ ఒంటి చీడ కుష్టు మటు మాయమైంది. 

లాడా మహరాజ్ దోహాలు, చౌపాయీలు గానం చేస్తూ అర్ధ తాత్పర్యాలు విడమర్చి శృతిపక్వంగా చెప్పే వాడు. 

జనులకు వినిపించుటకై లాడా మహరాజ్ పోరుబందరుకి వచ్చినప్పుడు ఆయన దేహంపై ఎలాటి వ్యాధి చిహ్నాలు లేవు.

******

లాడా మహరాజ్ ఆశువుగా చెప్పే గాన సుధలను బాల గాంధీ తన్మయత్వముతో ఆస్వాదించాడు. 13 ఏళ్ళు ప్రాయము గల నాటి గాంధీ భక్తిభావాలకు పునాది ఐనది. శ్రీమద్రామాయణ ఐతిహ్య భావజాలము. గాంధీజీ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్ది, భారతీయుల మన్ననలను అందుకున్నాడు ఏ రాజులూ, ప్రభుత్వాలూ ఇవ్వ నవసరం లేని బిరుదులను గాంధీజీ పొందాడు.

జాతిపిత, మహాత్మా, బాపూజీ (గుజరాతీ భాషలో “తండ్రి” అని ఆప్యాయతా పూర్ణ భావం) ఇత్యాది బిరుదులు హిందూ దేశ చరిత్రలోని స్వర్ణాక్షరములు ఐనవి. గాంధీజీ అనుసరించిన మార్గ నిర్దేశకత్వ సిద్ధాంతములు అతి శక్తివంతమైన మానవతా మహా వృక్షపు తల్లి వేళ్ళు. ఆయన బోధనా సూక్తులు వైపు కేవలము ఇండియాయే గాక, యావత్ ప్రపంచమూ దృష్టి సారించేలా చేసినవి. 

ముక్తాయింపుగా చెప్పారు బాపూజీ “నాటికీ, నేటికీ, ఏనాటికి భక్తి సాహిత్య సామ్రాజ్యాన శ్రీ తులసీ దాసు విరచిత రామాయణము ధగధ్ధగిత మణి మకుటము- అని నేను తలుస్తున్నాను.”

******