ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బ్లాంక్ చెక్ – వంద రూపాయలు

Like-o-Meter
[Total: 1 Average: 3]

సమాజములోని అన్ని వర్గాలవారితో శరత్ చంద్ర చటోపాధ్యాయ్ స్నేహంగా మెలిగాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబు సన్నిహితులలో ఒకరు. ఆయన పాలిటిక్సు పరంగా ప్రఖ్యాతి గాంచాడు.అయితే స్నేహ హస్తమును చాచిన సందర్భాలు ఇక్కడ- అనగా శరత్ చంద్ర జీవితగాథలో మనకు అగుపిస్తాడు. శరత్ చంద్ర చటోపాధ్యాయ్ నాస్తికుడు అనే జనాభిప్రాయము విస్తృతముగా ఉంది.


ఒకసారి దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబుకు రాధాకృష్ణుల ప్రతిమను బహూకరించాడు. ఆ విగ్రహాన్ని శరత్ చంద్రుడు బహు భద్రంగా అట్టిపెట్టుకున్నాడు. అంతే కాదు! ఆ రాధాక్రిష్ణ విగ్రహమునకూ నిత్యమూ అర్చనలు చేసేవాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు స్వాతంత్ర్య సమర కాలమున సర్వ విదితుడు. ఆయన భోగి, త్యాగి, యోగి కూడా! కొద్దిమంది మాత్రమే ఆతనిని కథకుడు, రచయితగా గుర్తెరిగి ఉన్నారు. “
సాగర సంగీత్” అనేగ్రంథాన్ని దేశబంధు చిత్తరంజన్ దాసు రచించారు. ఆయన ఒక పత్రికను నెలకొల్పారు కూడా. “నారాయణ” అనే ఆ పత్రిక అధిపతిగా దేశబంధు చిత్తరంజన్ దాసు అనేక బాధ్యతలను నిర్విరామముగా నిర్వర్తించేవారు.

“మా పత్రికకు ఒక కథను పంపించండి” అంటూ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ ను కోరారు. దేశబంధు చిత్తరంజన్ దాసు కోరికపై శరత్ చంద్ర రాసి పంపించిన కథ పేరు “స్వామి”. ఆ కథను చదివిన చిత్తరంజన్ దాసు అమందానందకందళిత హృదయుడే ఐనాడు. ఆయన శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కి ఒక “బ్లాంక్ చెక్” ను పంపించాడు. చెక్కుతో పాటు ఒక ఉత్తరమును రాసి పంపించాడు – “మహోన్నతమైన ఒక రచయిత నుండి ఒక గొప్ప కథను నేనీనాడు సంపాదించాను.
దాని విలువ కట్టే సాహసమును చేయలేను. 
అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపిస్తున్నాను. మీ రచనకు మీ ఇష్టం వచ్చినంత మొత్తమును వేసుకుని మార్చుకొనవచ్చును.”

శరత్ బాబు తనకు తోచినంత ధనాన్ని, ఎంత డబ్బునైనా- చెక్కులో రాసి, తీసుకోగల అద్భుత అవకాశం అది. ఎందుకంటే చిత్తరంజన్ దాసు పత్రికాధిపతి మాత్రమే కాదు, ఆ దేశబంధు- రెండు చేతులా ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తూన్న వకీలు కూడా! ప్రఖ్యాతి గాంచిన లాయరు అతడు. కానీ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కేవలము నూరు రూపాయలకు మాత్రమే చిత్తరంజన్ దాసు ఇచ్చిన చెక్కుతో మార్చుకున్నాడు.

అటు దేశబంధు చిత్తరంజన్ దాసు, ఇటు శరత్ చంద్ర ఛటోపాధ్యాయల సంస్కార, అనుబంధాలకు ఎత్తి పట్టిన మణి దర్పణము ఈ సంఘటన.

@@@@@