“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।।
उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“
గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణం
ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం
“సకల జీవకోటి చేత సేవలూ, పూజలు అందుకుంటున్న గజవదనునికి, వెలగపండును, నేరేళ్ళు (Elephant apple (Kaith) and Jambolana (Jamun)మున్నగునవి భుజించేటటువంటి, ఉమాపుత్రుడు, వేదనలను బాపు వాడైన స్వామి గణేశుని చరణారవిందములకు నమస్కరించుచున్నాను.”
ఈ ప్రార్థన అనాది కాలం నుండి భారతదేశములో ప్రచలితమైయున్నది.
“కరి మింగిన వెలగ పండు: అని సుమతీ శతకకారుడు నుడివిన మాటలు గొప్ప జాతీయముగా చెలామణి కాబడుతోంది.
గజాననునికి ఇష్టమైన పదార్ధాలలో వెలగపండ్లు మాత్రమే కాక నేరేడు పళ్ళు (Indian black plum), ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు, నేరేడు ఫలం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నవి. నేరేడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీకి ఉపయోగితమౌతూన్నవి.
ఋతుపవన సీమలలో పెరుగుతుంది ఈ సతత హరిత తరువు. ఆరోగ్య సంవర్ధని ఐన నేరేడు పండుకు పండగల రోజులలో తినవలెనని నియమ సిద్ధాంతాలను ఏర్పరచుటచే, అడపాదడపా నేరేడు పండును భారతీయుల ఫలహార, పదార్ధముగా వినియోగంలోనికి వస్తూనే ఉన్నది. ఇట్టి సూత్రములు ఉండకున్నచో, ప్రజలకు పరిచయానికి దూరంగా ఒక అడవి చెట్టుగానే మిగిలిపోయేది.
పండుగల వేళలలో వింత ఐన వగరు రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కలిగిస్తూన్న ఈ పండు కథా కమామిషూలను కొంచెం పరిశీలిద్దామా?
॑॑॑॑॑॑॑॑
బాలక్రిష్ణమూర్తి ఫ్యాన్సీ డ్రస్సులు, బాల బాలికల విచిత్ర వేషధారణల పోటీలు, ఈ హంగామాలూ, “శ్రీ క్రిష్ణాష్టమి” నాడు, మన ఆంధ్రప్రదేశ్ లో శ్రావణ, భాద్రపద మాసాలలో, పండుగ నెలలలో నేరేడుపండును ఒకటైనా తినాలంటారు. ఆహార విషయాది నియమాలలో – పొరపాటున జరిగే జీవ హింసఅనే పాపమును నివృత్తి చేసేటందుకని- ఈ నేరేడు పండును తినాలని ఒక సరదా సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. నేరేడుపండు మేన ఛాయ శ్రీ కృష్ణమూర్తిది.
॒॒॒॒॒॒॒॒
గుజరాతీ భాషలో “లంబూ జీవతి ఛే| తో జంబూ ఖావు ఛే||” అనే సామెత ఉన్నది. అంటే నేరేడును తింటే చక్కెరవ్యాధి పరారు అని అర్థం
నేరేడు చెట్టు బహుళ ప్రయోజనకారి. రైల్వే స్లీపర్లు, పొలాల్లో మోటారు పంపు సెట్లకు ఆధారముగా, పెట్టెలు వగైరా వస్తు తయారీ- ఇత్యాదులలో చెట్టుపట్ట (బెరడు) ఉపయోగంలో ఉన్నది. నేరేడు పండు. నేరేడు చెట్టు 100 సంవత్సరాలు ఉండే ఘన మహా వృక్షము.
॑॑॑॑॑॑॑॑
“జంబూ ద్వీపము”; శ్రీకృష్ణమూర్తి దేహఛాయకు ప్రతిబింబము కాబట్టి, గుజరాత్ మున్నగు రాష్ట్రాలలో జంబూ తరువును పవిత్ర పాదపముగా గౌరవిస్తారు. కార్తీక మాసము “పిక్ నిక్” లూ, వనభోజనాల సందడి- ముఖ్యంగా నేరేడు, ఉసిరిక చెట్లు ఉన్న తోటలను వనభోజనాలు చేసేటందుకు ఎన్నిక చేస్తారు. *
॑॑॑॑॑॑॑॑
ఈ మహావృక్షము పేరు ఆఫ్రికా దేశాలలో ఉన్నది. ఇంతకీ సంస్కృత పదమైన “జంబూ” అనే మాట”జంబులా ట్రీ” గా ఆఫ్రికా ఖండానికి ఎలాగ చేరింది?
పోర్చుగీసులు వాళ్ళు వలస సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నములో భారతదేశానికి వచ్చారు. అప్పుడు అలాగ అప్పట్లో కేవలము ధనము మాత్రమే కాక ప్రకృతి దినుసులు కూడా ఆదానప్రదానములలో విదేశాలకు తీసుకుపోబడినవి. పోర్చుగీసులు 16 వ శతాబ్దిలో ఇండియాకు వచ్చారు. (పోర్చుగీసులను “బుడతకీచులు” అని కూడా పిలిచేవారు). కొందరు పోర్చుగీసులు ఈ విత్తనాలను విదేశాలకు చేర్చారు. వాళ్ళు అప్పట్లో బ్రెజిల్ దేశానికి వెళ్ళారు. అట్లా వారు కాలూనిన బ్రెజిల్ సీమలలో జంబూబీజములను చల్లారు. బ్రెజిల్ వాతావరణము అనుకూలత చేత నేరేళ్ళూ అక్కడ నలుమూలలా విపరీతంగా అభివృద్ధి గాంచినవి.
బ్రెజిల్ దేశములోని వాతావరణము ఇటువంటి వృక్షాలు పెరగడానికి అనువుగా ఉండడంతో ఆ వాతావరణములో జంబూపాదపములు ఏపుగా పెరిగినవి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆ దేశమంతటా చిటికెలో వ్యాపించినవి. అచ్చటి ప్రజలు “Jambula tree”అంటూ ఈ చెట్లను పిలుస్తారు.
॑॑॑॑॑॑॑॑
మొత్తానికి ఈ పేరును మూల ధాతువుగా ఉన్న పాశ్చాత్యదేశాలలోని నామావళిని పరిశీలిద్దాము.
మాల్ దీవులలో – “ధంబూ” : jawanise – “juwet”, “dhuwet”
పోర్చుగీస్:- Jamelaw, jambOlaw, jalat
॑॑॑॑॑॑॑॑
ఇలాగ జంబూ ధ్వని ప్రధానముగా అనేక భాషలలో కాస్త స్థానిక భాషల యాసల మార్పులు చేర్పులతో జంబూ ఫలము, జంబూ చెట్టు వన్నె వాసికెక్కింది. మన దేశాలలో కన్నా, పశ్చిమ ఖండాలలో ఈ పళ్ళ రసాలను, కలర్సు తయారీ, హెల్త్ డ్రింక్స్, ఖాద్య పదార్ధాలకు మంచి రంగునూ, అదనపు రుచినీ కలుగ జేసే అనుపానంగానూ బహుళ స్థాయిలో వాడుతున్నారు.విదేశీ లిటరేచర్ లోనూ ఈ జమ్బూ వృక్షమునకు చోటు కలిగినది కూడా!
“Strange Fruit” అనే పాట హిట్ ఐనది.