ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఫిజీ దీవుల్లో బద్రీనాథ్ మహారాజ్

Like-o-Meter
[Total: 0 Average: 0]

1874 నుండి ఫిజీ దీవులకు బ్రిటీష్ కాలనీలు- ఏర్పడసాగాయి. ఆంగ్లేయులు రబ్బరు తోటలు, తేయాకు, నీలిమందు తోటలను వాణిజ్యదృక్పధముతో విరివిగా పెంచసాగారు. ఆయా ఉద్యాన పెంపకములు పెద్ద ఎత్తున నిర్వహిస్తూండడంతో వారికి కూలీల ఆవశ్యకత మిక్కుటంగా కలిగింది. తత్ఫలితంగా మన దేశంనుండి అప్పటి “బ్రిటీష్ పాలిత ఇండియా” నుండి అనేకమందిని ఫిజీ ఐలాండ్స్ కు తరలించుకువెళ్ళారు. కార్మికుల విధులకై స్వచ్ఛందముగా వేలాది మంది భారతీయులు అక్కడికి వలసలు (migrate/ migration) వెళ్ళారు. ఆ సమాజములో మన వారు క్షీర నీర న్యాయముగా కలిసిపోయి, అచ్చట పురోగతికి మూలస్తంభములుగా నిలబడ్డారు.

బద్రీనాథ్ మహారాజ్(బద్రీ దత్) 1868 లో ఉత్తరాఖండ్ లోని (బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న) బామోలీ గ్రామంలో జన్మించాడు. 1889 లో కాంట్రాక్టు లేబర్ పనికోసం, వలస కార్మికునిగా (indentured labourer) ఫిజీ దీవులకు చేరాడు. పనిపాటులలో సోమరితనాన్ని ఇష్టపడే వాడు కాదు. ఠలాయించి, పని ఎగగొట్టే సోమరికాదు అతను. కనుకనే ఆతడు కష్టించి పనిచేసి, “చురుకైన రైతు”గా పేరు తెచ్చుకున్నాడు. అతి కొద్దికాలంలోనే “విజయవంతుడైన కర్షకుడు” అని ప్రశంసలు పొందాడు.

బద్రీ మహారాజ్ రైతే కాదు రాజకీయవేత్త మరియు మానవతావాది కూడా. ఆతడు రెండు సార్లు ఫిజీ పార్లమెంటులో పదవులను నిర్వహించాడు ఫిజీ దీవులలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. ఈ విషయాన బద్రి దత్ సమకాలీనుల నుండి వ్యతిరేకతలను  ఎదుర్కొని, స్థిరంగా నిలిచి, తన ఆశయాలను అమలు పరిచాడు. అలాగే పంచాయతీలను పునరుద్ధరించాడు. అక్కడ ఉన్న భారతీయులకై విద్యా సదుపాయాల ఆవశ్యకతను గుర్తించాడు.

ఆతని అంతర్మధనముతో అవిరళ కృషి ఫలితముగా అక్కడ పాఠశాలలు నెలకొల్పబడినవి. రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్ లో భారతీయుల నిరంతర శ్రమ వలన కొంగ్రొత్త సంస్కరణలు రూపుదిద్దుకున్నవి. రాకిరాకీ అనే పట్టణమునకు సమీపంలో 1898 లో నిర్మించినట్టి మొదటి స్కూలు -Wairuku Indian School. Fiji లో చారిత్రక సంఘటన అది.


ఫిజీలో 1893 లో “ఆర్యసమాజము” కార్యకలాపములు  జరుగుతూండేవి. 1902 లో ఇండియా నుండి- షయూ దత్ శర్మ రాకతో ఊపందుకున్నవి. బద్రీ చేరికతో ఆర్యసమాజము- సమాజసేవ, సంస్కరణలు అత్యున్నతశృంగములకు చేరినవి. ఈ క్రమంలో అనేకమంది భారతీయుల నిరంతర కృషితో అక్కడ అనేక రంగాలలో ప్రజానీకము ప్రగతి గాంచారు. నేటికీ బద్రీ శ్రీకారము చుట్టిన సేవలను, ప్రోగ్రాములనూ ఆర్యసమాజము వారు కొనసాగిస్తున్నారు.