ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

కథాకళి కథ – నటరాజ రామకృష్ణకు ప్రేరణ

Like-o-Meter
[Total: 0 Average: 0]

కథాకేళి – నాట్య ప్రక్రియ, కేరళ రాష్ట్రంలోనే కాదు,cప్రపంచంలో గుర్తింపు పొందిన విశిష్ట సాంప్రదాయ నృత్యము. కేరళ సీమకు ఈ కథకేళి- ప్రత్యేక గుర్తింపును తెచ్చింది- అనడంలో అతిశయోక్తి లేదు.


కథ = Story

కేళి= ఆట/నాట్యము

నాట్య రూపకము, Dance Drama గా దిన దిన ప్రవర్ధమానమౌతూన్న కథా కేళి ప్రేక్షకుల కన్నుల పండుగ.

నటరాజ రామక్రిష్ణ నాట్యములోని అగణిత విశేషాలనూ, అమూల్య వ్యాసములు, అనేక అమూల్యమైన గ్రంధ సంపుటీ, సంకలనాలు రమారమి 40 పుస్తకాలు ఆయన కలమునుండి తెనుగువారికి అందినవి. నటరాజ రామక్రిష్ణ ప్రాచీన సాంప్రదాయ నాట్యాలలో కల అద్భుత విశేషాలను అన్వేషిస్తూన్నారు. అనుకోకుండా. అసంఖ్యాక నూతన అంశాలు వానిలో ఉన్నాయని, తాను కనిపెట్టి,  కళాభిమానులకు అందించారు. ప్రాచీన భారతీయ నాట్యము ఒక కళగా అభివృద్ధి చెందిన వైనం ఆయనకు అమితంగా ఆసక్తిని కలిగించింది.

ఆయనలో జిజ్ఞాసను రేకెత్తించే (కేరళలో జరిగిన) సంఘటనలలో కథకళి ప్రఖ్యాతిని గూర్చి పరవశత్వంతో ఇట్లా తెలిపినారు.

ఒక రోజు ఒక “కథకళి నాట్యాచార్యుడు” నెమ్మదిగా నడిచి వెళుతూన్నారు. అంతలో ఆయన్ని చూచి ఓ కుక్క “భౌభౌ” మంటూ మొరిగింది. నాట్యాచార్యులు ఆ శునకాన్ని చూసాడు, కానీ అదరక బెదరక అక్కడనే నిలబడ్డాడు. ఆ గ్రామ సింహాన్ని చూస్తూ, ఔడు గరిచి, దాని పైకి –రాయి తీసుకుని, విసిరి కొడుతూన్నట్టు-  నటించాడు. ఆతని అభినయాన్ని చూడగానే, ఆ గ్రామ సింహం భయపడ్తూ నేలపై చతికిలపడి కూర్చున్నది. ఆ సంఘటన గురించి అంచెలంచెలుగా ఆ సీమ కలెక్టర్ కి తెలిసింది. ఆ కళాకారుని పిలిపించి, కలెక్టర్ అడిగాడు ““నాట్యాచార్యా! మీరు చూపుతోనే ఒక కుక్కను భయపడేట్టు చేసారట! అది ఎలాగ జరిగింది? ఎలాగ  యాక్షన్ చేసారు? మాకు కూడా చూపిస్తారా?”.

“ఇలాగ అభినయించానండీ!” అంటూఆ నర్తకుడు బాటపైన జంతువును అదిలిస్తూన్నట్లుగా-తాను ఏ రీతిని చేసాడో చూపించాడు. ఆ నర్తనాభినివేశ చాతుర్యాన్ని తిలకించిన కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. నర్తన విశిష్టతను అడిగి, తెలుసుకున్నాడు. ఆ అధికారి “ఆచార్యా! కథకళి నృత్య , నటనా వైశిష్ట్యాన్ని మీ వలన అర్ధం చేసుకున్నాను. మీకు  శత కోటి కృతజ్ఞతలు.కథకళి చాలా గొప్పగా ఉన్నది. ఈ నాట్య కళను దేశ దేశాలలో ప్రచారం చేద్దాము’ అని అన్నాడు ఆ కలెక్టర్.

అంతే కాదు, ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు కూడా. అప్పటికప్పుడు ఆ పనిని ఆచరణలో పెట్టాడు కూడా! కేరళ సీమ గర్వించదగిన కథాకళీ నిష్ణాతులను, ఆ నాట్య శాస్త్ర పారంగతులను,  ఆచార్యులను

నలు దిక్కులకూ పంపించి, కేరళ కథాకళికి గుర్తింపు తీసుకుని వచ్చాడు.

నటరాజ రామక్రిష్ణను ఈ వాస్తవ విశేష సంఘటన అమితంగా ఆకట్టుకున్నది. తెలుగు నేలపై, మన ఆంధ్ర దేశములో మనదైన – “కూచిపూడి నాట్యము”  కునారిల్లుతున్నది. ఇంకా చెప్పాలంటే అసలు అలాంటి ప్రక్రియను ఆంధ్రులు దాదాపు మరిచిపోయారు అని ఒప్పుకోవాల్సి వస్తున్నది. మన వారికి అసలు తెలీదనేది చేదు నిజం. నటరాజ రామక్రిష్ణ కూచిపూడి నత్యాన్నే కాదు, తన కృషితో ఆంధ్ర నాట్యమునూ, దేవాలయ నాట్యములనూ నవ్య నవ్యంగా పల్లవింప జేసి, మహనీయుల వరుసలో మహోన్నత స్థానాన్ని సముపార్జించిన మనిషి. ఆ నాట్యాచార్యుని “పద్మశ్రీ”  వంటి అనేకానేక బిరుదము లు తామే అలంకృతములైనవి అనేది సత్య వాక్కు.

నటరాజ రామక్రిష్ణ కు స్ఫూర్తి కలిగించిన కేళి సంఘటన ఆయన జీవిత కథాగమనంలో మేలిమి బంగరు మైలురాయి.