అప్పటికి ఆయన ఇంకా కవి లోకంలో పాల పళ్ళ పసి కూనయే! గురజాడ ఇంట్లో సమావేశమై, కవితా చర్చలతో కాలం గుబాళించినది. కొంత సేపు ఇష్టాగోష్ఠి జరిగింది. ఆ మీదట క్రిష్ణశాస్త్రి తన ఇంటికి వెళ్ళిపోయారు..
తీరా తన ఇంటికి చేరాక, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గమనించుకున్నారు – భావకవితలను రాసి, చదివి , అక్కడే మర్చి పోయామని. చిత్తుప్రతుల్లో రాసిపెట్టుకున్న ఊహలు, భావాలు కవన సృజనకర్తకు ఎంతో అమూల్యమైనవి కదా!
ఇంకేమున్నది?
గబగబా దుర్గాప్రసాద రావ్ ఇంటికి తిరిగి వచ్చారు దేవులపల్లి క్రిష్ణశాస్త్రి. “ఇందాక ఇక్కడ నా కవితల కాయితాలను మరిచిపోయాను” అంటూ తాను మళ్ళీ వచ్చిన సంగతిని గాభరాగా చెప్పారు. తామందరూ కూర్చుని పిచ్చాపాటీ చేసిన చోట ఇంటిల్లిపాదీ అంతా వెదికారు, కానీ దొరక లేదు.
దేవులపల్లి క్రిష్ణశాస్త్రి బాధ ఇనుమిక్కిలి ఔతూన్నది. పని పిల్లను పిలిచి అడిగారు దుర్గాప్రసాదు.
ಕನ್ನಡ ದಲ್ಲಿ ಇತಿಹಾಸ ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರಗಳು. ತಪ್ಪದೇ ವೀಕ್ಷಿಸಿ – ಅನ್ವೆಷಿ ವಾಹಿನಿ
అంతలో అక్కడికి “జాజి ”వచ్చినది. దుర్గాప్రసాదుగారి పెద్ద కుమార్తే అన్నపూర్ణ. ఆమెను ‘జాజి ’అని పునర్నామంతో వ్యవహరించే వారు. అక్కడికి వచ్చిన జాజి “దేని కోసం వెతుకుతున్నారు?” అని అడిగింది. విషయం తెలుసుకున్నాక, “ మీరంతా వెళ్ళాక, ఇందాక పనిమనిషి ఇల్లు తుడిచింది, అది కానీ తీసిందేమో?” సందేహం వెలిబుచ్చింది.
“సన్యాసీ! ఇందాక ఇక్కడ కాగితాల బొత్తి ఏమైనా చూసావా? కింద పడితే చూడకుండా ఊడ్చేసినావా? ”
“మరేనండీ, గది ఊడుస్తూంటే పాత కాయితాలు దొరికాయి. కుంపటి అంటించేందుకు పనికి వస్తాయని తీసి చూరులో దాచాను” అంటూ ఆ పేపర్ల బొత్తిని ఇచ్చింది.
“హమ్మయ్య!”అంటూ దేవులపల్లి వాటిని అందుకుని గృహోన్ముఖులైనారు. పాపం, అప్పటి హడావుడిలో పనిపిల్ల ఇంటి యజమానులు పెట్టిన కొంచెం చీవాట్లను తిన్నది కూడా!
చూరులో సన్యాసి దూర్చిన గుజిలీ ప్రతి ఇంకొటి, మరొకటీనా? అది “కృష్ణపక్షం” చిత్తు ప్రతి!
ఆ ప్రతి దొరికింది కాబట్టి సరి పోయింది, లేకుంటే, ఆధునిక కావ్య శాఖ ఐన భావ కవిత్వము సొగసు గుబాళింపుల పారిజాత పుష్పాలను కోల్పోయేదే. ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగు కవిత్వ ప్రపంచంలో “భావ కవితా శాఖ” ఆవిర్భావానికి ఆ సంపుటే కారణమైంది!