ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మంకు తిమ్మ కగ్గ- కన్నడ “వేమన” పద్యాలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. “పెంకె ఘటం వీడమ్మా!” అంటూ ఆ రోజులలో విసుక్కోవడమూ కద్దు. అలా “పెంకి పెళ్ళాం” అనే సినిమా కూడా వచ్చింది. రాజసులోచన హీరోయిన్, ఎన్. టి. రామారావు హీరో. షేక్ స్పియర్ డ్రామా “The Taming of the shrew” అనే కథాంశముతో భారతీయతతో రంగరించి చేసిన తెలుగు సినిమా అది. 

సరే! ఇంతకీ ప్రస్తుతం “మంకు” అనే ఈ పద మీమాంస ఎందుకు వచ్చింది?

*******************

ఆట వెలది అనగానే మనకు ఠకాల్న జ్ఞాపకం వచ్చే కవి “మహా కవి వేమన”.  “విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటంతో ఛందో బద్ధ శతక పద్యాలలో మకుటాయమానమై ప్రభలీనుతూన్నది కదా. మన తెలుగు కవి వేమన్న- తన పద్యాలలోని పోలికలు నిత్య జన జీవితాల నుంచి గైకొన్నాడు. అలవోకగా అనేక భావలను శ్రోతలకు చిటికెలో బోధ పడేటట్లుగా రాసిన ఆటవెలదులు. అతి సామాన్యమైన పోలికలతో అనంత భావాలను “కొండలను చూపిన అద్దము” వోలె ఉన్నట్టి ఆ చిట్టి పద్దెములు ప్రజల చేత “ఔరా!” అనిపిస్తూ ముక్కుల మీద వేళ్ళు వేసుకునేట్లు చేసినవీ అంటే ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.

*******************

మన పొరుగు రాష్ట్రమైన కర్ణాట రాష్ట్రములోని “మంకు తిమ్మ” రచనలు కూడా వేమన సూక్తులను బోలినవి. 

“మంకు తిమ్మ కగ్గ”గా (ಮಂಕು ತಿಮ್ಮನ ಕಗ್ಗ) పిలువబడే పద్యాల గుచ్చాన్ని అల్ల్లినది ప్రముఖ కన్నడ కవి డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప. వీరు డి.వి.జి అన్న హ్రస్వ నామముతో సుప్రసిద్ధులు. కర్ణాటక సీమలో బహుళ వ్యాప్తిలో ఉన్నవి. సమత్వ భావనను జగతికి చాటిన వాక్కులు, కగ్గ పద్దెములు. సంఘములోని మూఢనమ్మకాలను, దౌష్ట్యాన్నీ ఎత్తిచూపుతూ కేవలము పండితులనే కాక పామరులను సైతం ఆకట్టుకున్నవి.

కవి పరిచయము

కృష్ణమూర్తి నాడిగ గారు బురదలో కూరుకుని మరుగున పడిన సహస్ర దళ నళినములను లోకానికి కరతలామలకం గావించారు. తీరా బైటికి తీసాక అవి మామూలు పువ్వులు కావు, అపరంజి పద్మములు- అని తెలుసుకుని, యావత్తు కన్నడ సారస్వత సీమ అచ్చెరువుతో ఆనందంలో ఓలలాడింది. అంతటి అద్భుత అమూల్య ముక్తక కౌస్తుభములను కావ్య ప్రపంచమునకు అందించగలిగిన భాగ్యశాలి D.V.G. కి “డాక్టరేట్”ను 1975 లో Karnataka state Government ఇచ్చింది.

అంతేనా! ఆయన అనేక గౌరవ పురస్కారములను అందుకున్నారు.

1974 లో “పద్మభూషణ్ అవార్డు”ను కర్ణాటక ప్రభుత్వం 1974 లో ఇచ్చి, గౌరవించింది. 1970 లో 90 వేల రూపాయల పారితోషికమును రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చి, సన్మానం చేసింది. ఈ మాన్యతా సభ బెంగుళూరులోని “రవీంద్ర కళాక్షేత్ర” లో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ చేతుల మీదుగా D.V.G. అందుకున్నారు. ఆ నాటి సభాసదులు మరొక మంచి సంఘటనా సరోరుహమును తమ మానససరోరములలో నిలుపుకోగలిగారు.

అదేమిటంటే- D.V. గుండప్ప- తాను పొందిన 90,000/- నూ అప్పటికప్పుడే బెంగుళూరులోని “గోఖలే ఇన్ స్టిట్యూట్” కు విరాళముగా ఇచ్చారు. (“Gokhale Institute of Public Affairs (GIPA) located in Bull Temple Road, Basavanagudi.

1988 లో భారతీయ పోస్టల్ సర్వీసు వారు “stamp of Dr. Gundappa” ను రూపొందించి ఆ మహనీయునికి నివాళులు అర్పించింది. డి.వి.జి.- గా విఖ్యాతి గాంచిన “డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప” మంకు తిమ్మ కగ్గ ప్రోక్త కబ్బములను వెలుగు లోకి తెచ్చి, ప్రాచీన, అర్వాచీన కర్ణాటక సాహిత్య నందన వనములో కొత్త పూల మొక్కలను విరగబూసిన ఘనతను దక్కించుకున్నారు.

****************

మచ్చుకు కొన్ని ‘తిమ్మ’ నుడువులు చూద్దాము:-


జన్మస్థలి నుండి కడలి వేపు సాగుతూన్న నది- సాంతం :
ధరణిలోని సారములను సంగ్రహిస్తు సాగును:
వసుధకు తన విలువలు కొన్నిటి నిచ్చును: మార్పు పరస్పరం:
మనుజ సంతానపు గుణ విశేషమ్ము లీలాగుననే జరుగును:
పరిణామము పరిధి చాల విస్తృతము తెలియగా!- మంకు తిమ్మ
(412 ముక్తకము)

 *******************

నర నారీ మోహమ్ములు సృష్టించును
కుటుంబమును, వంశమ్మును:
కుటుంబమ్ము కొరకై- గృహము:
తదుపరి ఇరుగు పొరుగు:
ఆ వెనుకనె గ్రామమ్ము-
అటు పిమ్మట దేశములు, సమాఖ్యలున్ను!
(There is only one POD):-
మడుగు కేవలమ్మొక్కటే!
కేంద్రము నుండి ఒక చిరు కదలిక మాత్రమ్మే –
వందలాది అలల వ్యాప్తి అన్ని దిశల కలిగించెను:
ఈ ప్రపంచ / సంసార బిందు రీతి ఇదియే మంకు తిమ్మ!

[406 ]

*******************

జనక తనయ దర్శనమున చపలు డాయె రావణుడు:
కనక మృగ (బంగారు జింక= మాయ లేడి) దర్శనమున జానకియు చపల యాయె!
 జన వాదన తెలిసినదే! నిందింతురు దశకంఠుని, 
కనికరము సీత పైన! మనసు (యోచనల) స్పందన లెటులౌనో 
దుస్సాధ్యము అరయంగా! మంకు తిమ్మ! [383]
 

*******************

మంకు తిమ్మ కగ్గ పద్యాలలోని మౌలిక లక్షణములు :-

1) అన్నీ 4 లైన్లు/ (చౌపది రచనలు)

2) ఆది ప్రాస- నాలుగు వాక్యాల్లోనూ ఉంటుంది:

తెలుగు ఛందో పద్యములలో మోస్తరుగానే మంకు తిమ్మ పద్య వాక్యాలు నాల్గింటిలోనూ ప్రతి రెండవ పదము నాల్గింటిలోనే అదే ఉంటుంది.

3) వీనినే – ముక్తకములు (“ముక్తకగళు”) అంటారు.

4) అంకిత నామము అన్నిటికీ ఒకటే అది- “మంకు తిమ్మ”.[“విశ్వదాభిరామ వినుర వేమ” – అనే మకుట వాక్యము వేమన పద్యాలలోని నాలుగవ వాక్యము. దీనిని పోలినదే – “మంకు తిమ్మ”]

5) 943 ముక్తకగళు:

ఈ అంకెను గమనిస్తాస్తారా?!:-

9-4-5=0: 9+4+5=18=1+8=9 :

6) 945 ముక్తకములలో మానవత్వము, మానవ స్వభావాదుల గురించి మంకు తిమ్మ అనేక ప్రశ్నలను లేవనెత్తాడు. వానిలో 595 సూటి ప్రశ్నలున్నవి.

*******************

 ఈ పేరులో ముచ్చటగా మూడు పదములు కలవు.

1) మంకు = మందకొడిగా:

2) తిమ్మ= పల్లెటూరి బైతు- అనే మాట,

ఆధునిక కాలంలో “ఎర్ర బస్సు ఎక్కి వచ్చాడు” అనే వాడుక విసృతంగా వ్యాప్తిలో ఉంది. ఆట్టే లోకజ్ఞానం లేని అమాయకుడు- అని అనవచ్చును (“country Bumpkin”). భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అనే అర్ధం కూడా ఉంది.

3) కగ్గ = అయోమయం: కాస్త తిక్క ఉన్నవాడు; అలాగే – “వేదాంతి” అనే అర్ధం సైతం ఉన్నది.

ప్రాచీన కన్నడ భాషా పదవల్లరులతో (హళేగన్నడ) గుబాళించిన పూ రేకుల అల్లికలు ఈతని “మంకు తిమ్మ కగ్గ” పద్యములు.

*******************