Like-o-Meter
[Total: 0 Average: 0]
“హరే క్రిష్ణ చెట్టు” అమెరికా లోని న్యూయర్క్ పట్టణంలో ఉన్నది. అది సరే! ఐతే ఏమిటీ? అని సందేహమా! అందులో చెప్పుకోదగిన విశేషం ఏమిటీ అని సంశయమా!
ఆ The Hare Krishna Tree పవిత్ర వృక్షంగా భావించబడుతూన్నది. ఆ పాదపం వయసు చాలా ప్రాచీనమైనది! వాతావరణ ఆటుపోట్లను తట్టుకుని, నిలబడిన తరువు అది.
A.C. Bhaktivedanta Swami Prabhupada, 1966 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ లో “హరే క్రిష్ణ భక్తి ఉద్యమము”ను నెలకొల్పారు. భక్తి వేదాంత స్వామివారు “కలి సంతరణ ఉపనిషత్తు”లోని
“హరే క్రిష్ణ హరే క్రిష్ణ – క్రిష్ణ క్రిష్ణ హరే హరే – హరే రామ హరే రామ – రామ రామ హరే హరే!” అనే శ్రవణప్రియమైన, పుణ్యదాయకమైన మంత్రాన్ని విశేషంగా ప్రచారం చేసారు.
Elm tree గా ఆంగ్లంలో పిలువబడే ఆ చెట్టు నీడలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద అనుయాయులు “హరే క్రిష్ణ” పదే పదే మంత్రోచ్ఛారణ చేస్తూ, తన్మయులౌతూ నాట్యం చేసారు. ఆనాటి సమావేశంలో భక్త్యావేశంతో పరవశులైన వారిలో సుప్రసిద్ధ బీట్ కవి కళాకారుడు అల్లెన్ జిన్స్బర్గ్ (Allen Ginsberg) కూడా ఉండటం విశేషం.
అక్టోబర్ 16, 1966 న సుమారు రెండు గంటల సేపు ఈ అద్భుత సంఘటన ఆ ఎల్మ్ చెట్టు నీడలో ఆవిష్కృతమైనది. నేటికీ హరే క్రిష్ణ సిద్ధాంత భక్తులు తమ భక్తికి ప్రతీకగా ఆ చెట్టును కొలుస్తూన్నారు. ఆ ఎల్మ్ తరువు వద్ద పుష్పముల దండలను, పూల గుత్తులనూ, ఇతర కానుకలను, టోకెన్ లనూ అక్కడ పెడ్తూంటారు. హరే క్రిష్ణ భక్తులు ఐచ్ఛికంగా ఈ పవిత్ర వృక్షమును పరిరక్షిస్తూన్నారు. The East Village Parks Conservancy వారి తోడ్పాటు ఈ మహత్కార్యానికి లభిస్తూన్నది. ఆ పర్యావరణ పరిరక్షణలో ఈ ‘తరు అర్చన’ కూడా ఒక అంతర్భాగమే కదా!