ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

పునీతా గాంధిః – ఓ తాళపత్ర వినతి

Like-o-Meter
[Total: 0 Average: 0]

“పునీతా గాంధిః త్వత్ పద పరిచితా;
రామ నగరీ గరీయః ప్రస్థానః”

ఈ వాక్యాలను తాటాకుపత్రాలలో వారు ముగ్గురూ రాసి ఇచ్చారు. అందుకున్న వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ.

“భారత దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను. ఇది విచిత్రంగా ఉన్నది. ఇలాటి స్వాగత పత్రమును ఇంతదాకా నాకు ఎవరూ ఈయలేదు కదూ! ” అంటూ ఆశ్చర్యపడ్డారు మహాత్మా గాంధీజీ.

చీరాలలొ “రామదండు” ను స్థాపించిన దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య మంచి దక్షత గల నేతగా పేరుకెక్కారు. రామదండు అంటే “చిన్న మిలిటరీ దళము” అని ప్రశంసలను పొందినది. దుగ్గిరాల మిత్ర వర్గంలోని వారు అబ్బూరి రామకృష్ణా రావు. అక్కడ ఆయన ఒక చిన్న ఇల్లును కట్టుకున్నారు. (అబ్బూరి రామక్రిష్ణారావు గారు “నదీ సుందరి” – మున్నగు రచనలతో తెలుగు సాహిత్య మార్గంలో పూజాపుష్పములను ఉంచారు). బసవరాజు అప్పారావు మిత్ర త్రయంలోని మూడవ మనిషి. వీరి కృషితో “ఆంధ్ర విద్యాగోష్ఠి” అనే చదువుల నిలయం వెలిసినది.

ఈ మువ్వురు స్నేహితులు “రాక రాక మన త్రిలింగ దేశములో అడుగుపెడుతున్నారు బాపూజీ. ఆయనకు చిర కాలమూ మదిలో గుర్తు ఉండిపోయేలాగా స్వాగతం పలకాలి, ఎలా? ఏ పద్ధతిని ఆచరిద్దాము?” ఇలా వారు మనసులో ఎంతో ఆలోచించారు. ఆ ఆలోచనా ఫలితమే- తాళపత్ర వినతిపత్రము. వారు పై శ్లోక వాక్యాలను శ్రమతో, కష్టపడి రాసారు. ఒక తాటాకుల పుస్తకములాగా తయారుచేసి, అందులో భద్రంగా చుట్టి బోసినవ్వుల బాపూజీ కి వినయ విధేయతలతో ఇచ్చారు. ఆప్యాయతతో అందుకున్నారు గాంధీ తాత.