ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

శాంతి నికేతన్ లో వీణా మాధురి!

Like-o-Meter
[Total: 1 Average: 3]

శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్.

ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మన తెలుగువాడే! ఆ సంగీతపండితుని పేరు “తుమురాడ సంగమేశ్వర శాస్త్రి“.

ఇదిఎట్లాగజరిగిందంటే :- 

పిఠాపురం రాజావారికి ఒక సంగతి తెలిసింది. “ఆ రైలుబోగీలో ఒక మహానుభావుడు ఉన్నారు, ఆయనే విశ్వకవి రవీంద్రనాథ టాగూర్.  మద్రాసుకు వెళ్ళి, తిరిగి కలకత్తాకు బైలుదేరారు రవీంద్రనాథ టాగూర్. రాజాగారికి ఇది తెలిసింది. ఇంకేమున్నది? రాజుగారు తలుచుకున్నారు, చుక్ చుక్ బండిని ఆపించారు. పొగబండిని పిఠాపురం లో నిలిపి, “విశ్వకవీ! మా ఊళ్ళో మూడు రోజులు ఉండండి. మా ఆతిధ్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ధన్యుల్ని చేయండి!” అని కోరారు.

ఆ మూడు రోజులు – అవి శాస్త్రీయసంగీత తరువుకు పూయించిన త్రిదళములు. 

వైణికవిద్వాంసులు సంగమేశ్వర శాస్త్రి మనోమోహనముగా వీణను వాయించారు. వీణాసుస్వర సునాదమాలలను ధరించిన రవీంద్రనాథ టాగూర్    ‘తాను లలితకళా తోరణం’  ఐనారు.

“సంగమేశ్వర శాస్త్రీజీ! మా శాంతినికేతన్ లో విద్యార్ధులకు వీణావాదనను నేర్పించండి. వైణికగురు పదవికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను.” వెదకకుండానే కాలికి చుట్టుకున్న పారిజాతాల హారాన్ని వెంటనే ఆనందంతో గైకొన్నారు తుమురాడ సంగమేశ్వర శాస్త్రి, కొంతమందిని వైణికులుగా తీర్చగలిగారు సంగమేశ్వర శాస్త్రి. కుటుంబబాధ్యతలు, స్వగ్రామముపై మరులు, సంగమేశ్వర శాస్త్రిని పిఠాపురం చేరేలా చేసాయి.  

అప్పటిదాకా తమకు తెలిసి ఉన్న ఉత్తరాది వాయిద్య, సంగీతాలు శాంతినికేతన్ ఉన్నవి. వీణా మాధుర్యాన్ని ఆస్వాదించిన రవీంద్రనాథ టాగూర్ శాంతినికేతన్ లో వీణియను పరిచయ ఘటనకు శ్రీకారం చుట్టడానికి మన రాష్ట్రం మూల హేతువు అయింది. 

॒@@@@@