ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

“సారంగధరీయము” త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన

Like-o-Meter
[Total: 0 Average: 0]

పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. ఆయన చిత్ర బంధ కవితా  చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము.


“కుధర సమాకృతి లాభ;

మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా;

కుధ ముఖ లిపులు(* సనిన గ:

ట్యధర దృగంగోక్తి నాసికాస్య నఖములౌ!  ”

[ ( = అర సున్న ]

తాత్పర్యము:-

ఆమె కుచద్వయము పర్వతమునకు సమానమైన ఆకృతిని అధికంగా పొందినవని- “కుధర సమాకృతి లాభము” అను దానిని గురించి- ఒక్కొక్క అక్షరాన్నీ తీసివేస్తూ వెళితే అవి వరుసగా:-

1) కుధర సమాకృతి లాభము =పర్వతానికి సమానమైన ఆకృతిని (కుచములు)

2) ధర సమాకృతి లాభము= భూమికి సమాన ఆకృతినీ(పిరుదులు)

3) రసమాకృతి లాభము= అమృత సంపద వంటి రూప ప్రాప్తిని (పెదవులు)

4) సమాకృతి లాభము= ఎగుడు దిగుడు కానట్టి రూప ప్రాప్తిని (చూపులు/ దృక్కులు)

5) మాకృతి లాభము= లక్ష్మీ దేవి/ “మా” వంటి ఆకార ప్రాప్తిని (అంగము)

6) కృతి లాభము= కావ్య రచనా రూపాన్ని- అంటే చమత్కారాన్ని (ఉక్తులు);

7) తి లాభము=  నువ్వు పువ్వును పోలిన దీప్తిని (నాసిక/ ముక్కు)

8) లాభము= చంద్రుని (లః) వంటి కాంతిని (అన్యము);

9)  భము=  నక్షత్రాతిశయమును (గోళ్ళు/ నఖములు)


ఇలాగ వరుసగా ఒకే ఒక్క పదమును- వాడుతూ, తెలుగు అద్భుత సారాంశ చమత్కారాన్ని సాధించాడు అవధాని . ఆంధ్ర వాఙ్మయ రమణీ మణికి అలంకారమైనది ఈ పద్య రాజము. ఈ పద్దెము- బ్రహ్మశ్రీ పోకూరి కాశీపత్యావధానులు రచించిన “సారంగధరీయము” లోనిది (2- 41) .

ఒక కావ్యములోని గొప్పదనాన్ని గ్రహించి, అద్దానిని అంకితముగా గైకొన్న “కృతిభర్త” లు కూడా చిరస్మరణీయులే కదా! అలాగ కావ్య ఘనతను కనుగొని, కాశీపత్యావధానులు  విరచించిన ఈ “సారంగధరీయము”ను స్వీకరించిన కావ్య రస పరిశీలనా సమర్ధులైన “శ్రీ సీతారామభూపాల్” గ్రంధమును అవధాని పండితుని నుండి అంకితముగా గైకొని ‘కృతి భర్త’గా కీర్తిని గాంచారు.

శ్రీ సీతారామభూపాల రాజా వారు ఈ త్ర్యర్ధి కావ్యాన్ని విని బహుధా ప్రశంసింస్తూ, “గ్రంధం వ్రాసి, పేరు పెట్టారా లేక నామకరణం చేసి,  గ్రంధాన్ని రచన గావించారా?” అని అంటూ,  కాశీపత్యావధాని చాతుర్యాన్ని మెచ్చుకున్నారు.

వదాన్యులైన “శ్రీ సీతారామభూపాల్ -“సారంగధరీయము” ని నాకు అంకితం సేయగలరా!?” అని కాశీపత్యావధానులుని కోరారు. వారు ఆ పుస్తక ముద్రణా బాధ్యతని సంతోషముగా స్వీకరించారు.

సారంగధరీయము”   త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన.

ప్రతి పద్యంలోనూ – ఈశ, చంద్ర. సారంగధర – ఈ మూడు కథల భావాలూ అంతర్లీనంగానూ, ప్రకాశంగానూ వచ్చేటట్లు చేయగలిగిన కవి కలము ధన్యత ఒందినది. ప్రాచీన ప్రబంధాదులలో ద్వ్యర్ధి కావ్యాలుగా

“రాఘవ పాండవీయము”, “యాదవ రాఘవ పాండవీయము” మున్నగు గ్రంధములు వెలిసినవి. కానీ, కాశీపతి వలె సాక్షాత్తు గ్రంధము యొక్క పేరునే రెండర్ధాలు, లేదా మూడు అర్ధాలు వచ్చేటట్లు తన కావ్యమునకే పేరును కూడా పెట్టుట- ఇచ్చట మాత్రమే సంభవమైనది, తెలుగు సారస్వత లోకములో ఇలాగ కనిపిస్తూన్నది “సారంగధరీయము” మాత్రమే అని నుడువగలము.


కాశీపత్యావధాని రచనలోని ఒక పద్యాన్ని గమనించుదాం.


“రాజిత నగాగ్రమున విహారంబు సల్పు;

నీలకంఠాతిశయము రాణిలుట కంటె

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు;

నీలకంఠాతిశయము రాణిలుట కంటె ” {2- 138}


ఈ చిన్ని పద్య రత్నము – “ద్విపాది”: మీరు పై పద్యాని పరిశీలిస్తే ఈ అంశము ఇట్టే బోధపడుతుంది.

“ద్విపాది” అనగా 1,2 పాదాలు – అలాగే 3, 4 పాదాలు ఏమాత్రం మార్పు లేకుండా అవే  అక్షరసముదాయ సంరంభములే! కానీ, మొదటి, రెండవ పాదాలలోని అర్ధాలూ, అలాగే- రెండవ, మూడవ పాదాలలోని భోగట్టా మాత్రం వేర్వేరు.

భావములు:-

“ప్రకాశించు పర్వత అగ్రమున వేడుకగా తిరుగుతూన్న ఈశుని గొప్పదనం కంటే” అని పైన చెప్పిన ప్రథమ, ద్వితీయ పాదాలకు అర్ధము.

“విరాజిల్లుచున్న చెట్టు చివరన సంచరిస్తూన్న నెమళ్ళ యొక్క (మయూరి/ మయూరములు) గోరోజనమును/ అతిశయాన్నీ  పరికించావా?” అని తదుపరి తృతీయ, చతుర్ధ పాదాల భావము.

ఇంతటి రమణీయకత కల కావ్య సుధలను గ్రోలిన “శ్రీ సీతారామభూపాల రాజా” తత్కృతి స్వీకర్త అవడంలో ఔచిత్య రామణీయకత ఉన్నదనడంలో సందేహమేమున్నది?


(ఆధారము:- పాటిబండ్ల మాధవ శర్మగారి  షష్ఠిపూర్తి  సన్మాన సంచిక: హైదరాబాదు; సెప్టెంబరు;1972).