ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వైవిధ్య భరిత వీణలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

విద్యల దేవత శ్రీ సరస్వతీ దేవి వాయిద్యము “కచ్ఛపీ వీణ”. కచ్ఛపి – అనగా “తాబేలు డిప్ప”. ప్రాచీన కాలాన మన హిందూ దేశంలో కూర్మము డిప్పకు 

తీగలను బిగించి, తంత్రీ వాయిద్యాన్ని తయారు చేసారన్న మాట!

హైందవ సంస్కృతిలోని అవినాభా సంబంధం కలిగి ఉన్నది వీణ – ఆది వాయిద్య పరికరము, ప్రపంచ తంత్రీ సంగీత పరికరాలకు మూల రూపిణి. శృతి సుభగమైన స్వరాలను నెలకొల్పిన ఘనత వీణదే! కాబట్టి శ్రీ వాణి ఆప్యాయంగా మీటే వాయిద్యంగా – సుస్థిర స్థానాన్ని సముపార్జించినది.

ప్రజలు సరస్వతీ దేవి ని అర్చన చేసేటప్పుడు ఆ పూజా విధానాలను సొగసుగా మన “వీణ”కూడా “వర వీణ”గా అందుకున్నట్లే కదూ! తద్వారా సంగీతాది లాలిత్య కళలూ, విద్యలూ కూడా పూజ్యనీయాలు ఐనాయి, ఈ పరిణామం మన దేశ సంస్కృతికి ఒక విభిన్నతను సమకూర్చినాయి.

ఇలాటి ఘనతను గడించిన వీణియలలో అనేక నవ్య స్వరూపాలను గడించి, శతాధిక నామావళితో చారిత్రక స్థానాన్ని పొందాయి.

కల్హార వాసిని, వర వీణా మృదుపాణి ఐన శ్రీ శారదా దేవి ‘కచ్ఛపి’ – శ్రీ కూర్మము యొక్క పై డిప్ప కాయను వీణ ఒళుసుగా మలచబడినదని చెప్పుకున్నాము కదా!

 

వీణలోనిభాగాలు:

 

1. ప్రవాళము = వీణ ఒళపు (Tha Neck of Lute)  ;

 

2) కకుభము / ప్రసేవకము =  కరివె ((The Belly below the Neck of Lute) ;

 

3) కోలంబకము = వీణ తంత్రి, ఒళగ మొదలైన మొత్తము (The Body of Lute);

 

4) ఉపవాహము = నిబంధనం = వీణా తంత్రులు కట్టబడు చోటునకును మరియు బిరడాలను కలిపి పిలిచే పేరు ; ( The Tie);

 

5) కోణము = కొడుపు (Bow) – వీణ వగైరాలను వాయించే కొడుపు, దీని సామాన్య నామమే – కోణము.

వీణకు పర్యాయ పదాలు అగణితాలు. వీణ, వీణియ, వల్లకి, విపంచి, తీగలు బిగించబడిన వాటిని తంత్రీ వాయిద్యాలు – అంటారు. సితార, ఏక తార, గిటారు మున్నగునవి. వీణాది తంత్రీ వాద్యాల నుండి వెలువడే స్వరాలకు సాహిత్యంలో అందమైన పర్యాయ పదాలు ఉన్నవి. క్వణము, నిక్వణము, నిక్వానము; ఉదాహరణకు – వీణా నిక్వణము. ఇలాగే ప్రక్వణము, ప్రక్వాణము ఇత్యాదులు వీణా ధ్వనుల వైవిధ్య సూచిత పద వల్లరి.

మన సంగీత ప్రపంచానికి ( ప్రపంచ సంగీతానికి కూడా ) పునాదులు సప్త స్వరములు వీణ తొండము నుండి  వీణ  కంఠమునందు దాకా ఉద్భవితూ, విస్తరిస్తూ ఉండే ఈ స్వరములే సప్తస్వరములురిని– లు. వీనికి స్వభావ స్వరూపాలను అనుసరించి, పరివ్యాప్తిలో ఉన్న పేర్లను గమనించండి. అవి – షడ్జమము, ఋషభము, గాంధారము, మద్యమము, పంచమము, దైవతము, నిషాదము. ఈ ధ్వనుల సారాంశమును గురించిన చర్చలు ఎంతో విపులీకరతను ఆశిస్తూ, సంగీత శాస్త్రజ్ఞులకు మరెంతో ఆప్యాయకరమైనది.

ఇక వీణా వాయిద్యాన్ని గురించి కొంచెము పరిశీలింతము. పాల్కురికి సోమనాథుడు తన “బసవ చరితము”లో అనేకానేక వీణలను నామములతో ప్రస్తావించెను. పరమేశుడు కైలాసములో, తన భక్తులు వాయిస్తూన్న అనేక రకాల వీణా నాదాలను వింటూ ఆనందించిన నాదలోలుడు.

 

వీణలు:

1. రావణ హస్తము; 2. బ్రహ్మ వీణ; 3. కైలాస వీణ; 4.ఆకాశ వీణ; 5.పినాక/కి వీణ; 6. సారంగ వీణ; 7.కూర్మ వీణ; 8.స్వాయంభు వీణ; 9. గౌరీ వీణ; 10. కిన్నెర వీణ;

భక్తులు ఈ వీణా వాదనంలో ఒక సారి వాయించిన దండెలను మార్చి, కొత్త రాగాలతో సంగీత అర్చన చేస్తూన్నారు.

 

1.మొగచాళము; 2.నవరాణము; 3.సవఠాణము; తాళ పట్టి; 4.కత్తరి; 5.సారణి – వంటి రాగాలువాతావరణాన్ని మనోజ్ఞ భరితముగా, హృద్యంగమంగా చేస్తూన్నవి.ఈ రాగాలతో “సకలేశ! నిత్య కళ్యాణి, అవధరించవయ్యా! ప్రాణ నాయక! నాద మూర్తి!….. ” అని రాగం పలికిస్తూ ఉండగా, దానికి తగిన తాళానికి అనుగుణముగా సప్త స్వరాలలో ” ఇరవై రెండు శృతులలో ” ప్రభవిల్లుతూన్నవి.

 

అలాగ కూర్చిన శృతుల తగిన తాళానికి అనుగుణముగా సప్త స్వరాలలో”ఇరవై రెండు శృతులలో” ప్రభవిల్లుతూన్నవి. అలాగ కూర్చిన శృతులలో “నారాటకావుళము” అనే ఘనతర రవము , “చౌ దళము”అనే శరీరముతో అనిబద్ధ రీతిలో సంధించి,గమక సప్తకము పలికేటట్లు, మంద్ర, మధ్య, తారా స్థాయిలలో ఉత్పత్తి ఐనవి.అలాంటి తారా స్థాయిలతో – “లయ” ను తప్పనీయక, శుద్ధ సాళగములు రూపొందే విధముగా – దేశి మార్గ సాంప్రదాయాలతో నవ్య గతులు వచ్చినవి. అవి – “ద్రుత, మధ్య, తాళ మాన గతులను” చూపుతూ సాగినవి.

 

ధాతుల సంగతులను, జాతుల రీతిని గూర్చి నిబద్ధ రూపంలో వైళము, తాళము, సాళి, వెళ్ళావెళ్ళ, జాయానుజాయి, సంచితము, పంజళము, ఖచరము, విషమము, గ్రహ మోక్షణము, భజవణి, రవణి, భరణి, మిఠాయి, నిజవణి, నివళము, నిచయము, వైధసము, నిగతి, సుధాయి, సన్నిహితము, మిశ్రమైన గ్రహ త్రిత్రయము, అంశుక లలిత గాఢము, రాగ కాకువు, గాఢము, దేశికాకు, సింధు, కరుణాకాకు, నఖకర్తరి, హళువాయి, దరహర, సమవాయి,గుండాగుండి,  భ్రమర లీల, గురుడి, మోడామోడి, పొరిరవాళము, అక్షాయి హొయలు, “రిక్ఖల విళగు చొక్కాయి” మొదలైన ఠాయములు  వెలువడిన “నాద జగత్తు” అక్కడ వెలసి, ప్రేక్షకుల శ్రవణ, వీక్షణాది పంచేంద్రియాలతో పాటుగా సర్వేంద్రియాలనూ మిరుమిట్లు గొలిపించినది.

 

దేశాక్షి, ధన్వాసి, దేశి, మలహరి, సకల రామ క్రియ, లలిత సాళంగ, నాట, గుజ్జరి, మేఘరంజి, వేళావుళి,చిత్ర వేళావుళి, మాళవి, సిరి, వరాళి, కాంభోజి, గౌళ పంచకము,బంగాళ గురిజ, భైరవి ద్వయం, నారంగబడ పంజరము, గుండ క్రియ, కౌశిక, దేవ క్రియ, మధ్యమావతి, తోడి, యావసతము మున్నగునవి – స్త్రీ రాగ, పురుష రాగములు.

 

ఇంతటి సువిశాల సంగీత ప్రపంచాన్ని తన ప్రబంధంలో విపులీకరించిన సోమనాథుని వంటి మహా సంగీతజ్ఞుడైన కవి, “బసవ చరితము” రచయిత పాల్కురికి సోమనాథుడు మన తెలుగువాడు అవడము మనకెంతో గర్వ కారణము కదా!

 

ఆధునికకాలంలోవీణ:

 

ఆధునిక కాలంలో కూడా వీణియది సర్వోన్నత స్థానమే! ఈమని శంకర శాస్త్రి, చిట్టి బాబు మున్నగు వారు భ్రమర గీతము, కోకిల నాదములు, బృంద వాయిద్య రచనలతో వీణా నాద మాధుర్యాన్ని పాశ్చాత్య మ్యూజిక్ జగతికి పరిచయం చేసి, వారిని మంత్ర ముగ్ధులను చేసారు.

 

వీణా వాయిద్యానికి సోదరీ మణులుగా పేర్కొనదగినవి – సితార, గిటార్, తంబురా మున్నగునవి. సంగీత ప్రపంచములో ‘గ్రామీ అవార్డు,’  అత్యుత్తమమైనది. 1968 లో యెహుదీమెనూహిన్ తో కలిసి, రూపొందించిన “East meets West”  అనే ఆల్బం కు గ్రామీ అవార్డ్ లభించినది.

 

అలాగే 1994 లో గ్రామీ అవార్డు విశ్వ మోహన భట్  కు లభించినది. “మోహన వీణ” ను  కనిపెట్టిన వ్యక్తి ఈయన. గిటార్ విద్వాంసుడైన విశ్వ మోహన భట్ సృజించినట్టి “మీటింగ్ బై ది రివర్”(“Meeting by the River”) అనే ఆల్బమ్ నకు Grammy award దక్కినది.

 

పాశ్చాత్య ప్రజలకు మన ఇండియా లోని  సాంప్రదాయ సంగీత శ్రావ్యత గురించి ఆసక్తి కలుగుటకు అది ప్రథమ సోపానము. Western Music World నకు మన హిందూ దేశ సంగీతములోని సున్నిత మాధుర్య పరంపరల యొక్క ఔన్నత్యాన్ని పరిచయం చేసి, వారికి ఆ అంశముపై అవగాహనలను కలిగేట్లు చేసినది. వీణా నాద స్వరాలు ఎంతో శ్రవణపేయమైనవి. కావుననే సాహిత్యం:- లో భావ వీణ, రాగ వీణ, మనో వీణ, హృదయ వీణ ఇత్యాదిగా అనుపమానమైన, అద్వితీయ స్థానాలను పొందినవి.

 

అనేకానేక సినిమాలలో వీణ మీద పాటలు, బ్యాక్ గ్రౌండ్ లో వీణా నాద సృజనలతో ప్రేక్షక హృదయాలు సునిశితమైన సున్నిత అనుభూతులతో రాగ భరితాలౌతూ రంజిల్లినవి.

 

“ఓ వీణ సఖీ! నా ప్రియ సఖీ! నా చక్కని రాజెట దాగెనో?”

 

“వీణలోనా? తీగలోనా? – ఎక్కడున్నదీ రాగము? – అది ఎలాగైనది గానము?…….”

 

ఇలాగ లెక్కలేనన్ని పాటలు ఈ నాటికీ వర్ధమాన గాయకుల పెదవులపై నవనీత సుధా సదృశంగా రంగరించబడుతూనే ఉన్నవి కదా!

(This article was originally published in భావవీణ – March 2007 – Page 57 )

 

 

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>