ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

యాళీ స్థంబాల కథ కమామీషు

Like-o-Meter
[Total: 0 Average: 0]

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు.

గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు –  ఇత్యాది నివాసములకు, దూలము, స్తంభాలు ఆధారములు. గుళ్ళు, గోపురముల స్తంభములను బోసిగా ఉంచకుండా, శిల్పములతో నింపి,  స్తంభములను చూపరులను అచ్చెరువు పొందేలా చేసేలాగా మలిచిన ప్రక్రియ, మన దక్షిణాదిన ఊపందుకున్నది. ఫలితంగా లక్షలాది చేతులు శిల్పకళలను, జీవనోపాధిగా పొందినవి.

యాలీ సంస్కృతపదం “వ్యాల” నుండి పుట్టింది. ప్రతిమా శాస్త్రమునకు మేలిమిమలుపులు ఈ “యాళీ స్తంభముల శిల్పకళలు”. నిజానికి యాలీ శిల్పం కొన్ని జంతు స్వరూప సమ్మేళనము. సింహం తల, ఏనుగు దంతాలు,  పాము తోక – ఇత్యాదుల మిశ్రమ రూపం యాలీ. ఒకరకంగా ఇవి త్రి డైమెన్షన్ విగ్రహాలని చెప్పవచ్చు.

సింహ వ్యాల, గజ వ్యాల, అశ్వ వ్యాల (గుర్రము వదనం), శ్వాన వ్యాల (కుక్క ముఖము) ; ఎలుక ముఖం ఇత్యాది ఆవిష్కృతులు అగుపడుతున్నవి. ఇదే మాదిరిగా ఇతర జంతువుల ముఖములు సైతం కలిగినవి. వాటి నడుములు సన్నగా, నాజూకుగా ఉంటాయి. దుష్ట శక్తులను నిలువరించే యక్షిణీ దేవతలు, శక్తులు, ప్రతీకలుగా యాలీ కళాభినివేశం అభివృద్ధి గాంచింది.

యాలీ ప్రతిమా కళలలకు ప్రోత్సాహం లభించినది.అత్యధిక శాతం తమిళ నాడులోని, సేలం జిల్లాలోని “తరమంగళం”  ఇందుకు నిదర్శనం. శిల్పనైపుణ్య శైలికి అత్యధిక ఆస్కారం కలిగించిన రీతి స్తంభములను రూపొందించి విగ్రహములు, ప్రతిమలు, దేవాలయాలలోని అణువు అణువునూ కళా పూర్ణంగా తీర్చిదిద్దిన విధానం, మన భారతదేశములోనే ఒనగూడినది, ఇది మనకు గర్వకారణం.

తరమంగళంలోని ఆలయమే కాకుండా కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో, ఇక్కేరి అఘోరేశ్వర ఆలయం, చిక్కబళ్ళాపూర్ లోని ‘భోగ నందీశ్వర ‘, రంగనాథ కోవెలలు కూడా పేరెన్నికగన్నవి. ప్రవేశద్వారమునకు, గేటుకు ఇరు ప్రక్కలమకరం, మొసలి వలె వెడల్పుగా నిలబడి ఉన్న శిల్పాలు యాలీ కళాప్రతిభను నింపుకుని, సందర్శకులకు స్వాగతం పలుకుతున్నవి.

యాలీ జంతువు  యొక్క తెరిచిన నోటిలో, నోటిని చీలుస్తున్న మనిషి బొమ్మను చెక్కగలిగారు అంటే శిల్పుల చేతిలోని ఉలి శక్తికి కోట్ల ప్రశంసలు. ఉలిలో పరసువేదీ శక్తిని నింపి, పెను శిలలను మలిచి, సుందరమయం చేసినది వారి ప్రతిభ. 

******


ఈ యాలీ విగ్రహాలను ఆలయాల్లోనే కాక ఇతరత్ర కూడా చూడవచ్చు. ఉదాహరణకు వీణలను గమనించండి! వీణల కొమ్ములు – హంస, సింహం వంటి జంతువుల బొమ్మలు ఉంటాయి కదా! ఇవి కూడా యాలీ విగ్రహాల కోవకే చెందుతాయి.

పాతాళభైరవి ఇత్యాది సినిమాలలో మాంత్రికులు, మాయలమారాఠీలు పట్టుకున్న మంత్రదండములను గమనిస్తే అవి యాలీ విగ్రహాలనే పోలివుంటాయని అర్ధం ఔతుంది, క్రితం శతాబ్దం లో జమీందారులు, భట్రాజులు, వృద్ధులు చేతికర్రలని పట్టుకుని నడిచే వారు. చేతి కర్ర యొక్క పిడి పైన పసిడి, వెండి తొడుగులను పెట్టేవారు. యాలీకళకు అనుసరణ అవి. 

******

అందరూ రోజూ చూసే అంశం, గుళ్ళలో మూలవిరాట్ వెనుక సింహాసనం  మాదిరి, వెండి తోరణం వంటిది – ఉంటున్నది, అది “మకర తోరణం”. యాలీ డిజైనుకు అనుసరణ, మొసలి వంటి జంతువును అందంగా చేసిన శిల్ప ఆభరణ ప్రజ్ఞకు నిదర్శనం.

ఓరుగల్లు – అనగా వరంగల్ లోని వేయిస్తంభాల గుడి ప్రవేశద్వారమునకు , పైన, ఇరు వైపులా వయ్యారి భామినుల బొమ్మలు ఉన్నవి. యాలీ జంతువుకు బదులుగా ఇక్కడ – సౌందర్య వనితలను ఉంచారు. నాగిని, /బదనిక,/ మదనిక మున్నగు పేర్లు కలిగినవి. భట్టివిక్రమార్కుని సింహాసనము చేరగల మెట్లు, ఆ సోపానములకు రెండు వైపుల నిలబడిఉన్న “స్థాలభంజికలు” – యాలీ అనుసరణలైనవి, సౌందర్య పార్శ్వం కలిగినవి. 

కర్ణాటకలోని  రంగనాధ దేవాలయాన్ని గురించి ఒకసారి పరిశీలనాంశాలను చూద్దాము. కోలారుసీమనందు రంగస్థల శ్రీరంగనాధ స్వామి కోవెలలోని స్తంభాలకు  గొప్ప విశేషాలు వాస్తు, శిల్ప ప్రావీణ్యాలకు ప్రతిబింబములు. ఇక్కడి “యాళీ కంబములు” / “యాలీ స్తంభములు” : శిల్పవిన్యాసాలు సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తున్నవి. 

కర్ణాటకరాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాకు వెళ్దాము. అక్కడ ‘నీర్తాడి’ లోని కోవెల , యాలీ స్థంభములపై ఆధారమైనవి.

హంపీ నగరము :-

లేపాక్షి మన ఆంధ్రదేశములో ఉన్నది. ఇక్కడి వీరభద్ర ఆలయమునందు ఈ శైలి ఉన్నది.

మేల్ కోటె : చెలువ నారాయణ మందిరము :- “Hyppogryphs” శిల్పరీతి కలిగినవి.

హంపీ మండపము “కుదురె గొంబె” ( “Kudure Gombe”) ఆకర్షణీయత గొప్పది.

గుర్రము బొమ్మ ఇది.

******

ఇంతకీ, యాలి  అనే మాట ఎక్కడిది?  

“వ్యాల”, “విడల” అని కూడా పిలుస్తారు. రెండు, మూడు జంతువులను, వృత్త లతా, పుష్పముల వలె ఉన్న డిజైన్లు, అందముగా ఉండే రీతిగా చేసినట్టివి. శిల్పి కల్పనాసామర్ధ్యానికి మచ్చుతునకలు.  దక్షిణభారత ఆలయకళలలో అంతర్భాగములై, చైతన్యభరితములైనవి యాలీ స్తంభములు.

******

చైనా “డ్రాగన్” / “రెక్కల మొసలి”/ “నిప్పుల గుర్రం” ఇటువంటిదే! చీనా, టిబెట్ దేశాలలో ఇటువంటి మాస్కులతోనూ, బొమ్మలతోనూ నాట్యాలు చేస్తూ, వారి పండుగలను కనువిందు గావిస్తున్నారు.

మన దేశంలోని “యాలి కళాబింబము” లని ఆధారం చేసుకుని, ‘పండుగల క్రీడా, కళల’ను రసభరితంగా, నేత్రపర్వంగా రూపొందించుకొనవలసిన ఆవశ్యకతను అందరూ గుర్తించుకొని, మన పర్వములను ప్రవృద్ధమానం గావించవలసి ఉన్నది.

@@@@@