ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆర్ధిక సంస్కరణలు – ఓ సెటైర్

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఈ మధ్య ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తీవ్రమైన ఒత్తిడికి గురౌతున్నారు. ప్రతిపక్షం నుంచే కాక అధికార పక్షం నుంచి కూడా విమర్శలు బాగా ఎక్కువయ్యేయి. ధరల పెరుగుదల, ఉద్యోగాల కొరత, నిరుద్యోగం, అవినీతి, కుంభకోణాలు…ఒకటి కాదు, ఏ విధంగా చూసిన ప్రభుత్వం తలెత్తుకు తిరగలేని పరిస్థితి.

మంత్రి వర్గ సమావేశంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఇలా అన్నారు. “ ఇప్పటికి వరకూ జరిగింది చాలు. ప్రధాన మంత్రినన్న గౌరవం ఎక్కడా మిగలట్లేదు. రోజూ తిట్లు తిని, తిని నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది. ఇంత బతుకూ బతికి ఇంటి వెనక చావటం అంటే ఇదేనేమో!! మీ అందరికీ కూడా ఇలాగే ఉంటోందని తెలుసు. అందుకే మనం వెంటనే ఏమైనా చెయ్యాలి. ఈ ప్రభుత్వం పని చెయ్యగలదని, పనిచేస్తోందని వెంటనే ప్రజలకు చూపెట్టాలి. కానీ ఇది దీర్ఘ కాల ప్రణాలికల మీద దృష్టి పెట్టే సమయం కాదు. అతి కొద్ది సమయంలోనే ఫలితాలు కనిపించే పని ఏదైనా చెయ్యాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయాలు, సూచనలూ వినడానికే మీ అందర్ని ఇక్కడికి పిలిపించేను.”

ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో కేంద్ర మంత్రి వర్గ సభ్యులందరూ డబ్బులు కూడబెట్టే కార్యక్రమంలో బిజీగా ఉండటం వలన ఇలాంటి విషయాలెవ్వరూ పెద్దగా ఆలోచించలేదు. ఇది తమ గురించి తాము ఆలోచించుకోవలసిన సమయం కానీ ప్రజల గురించి ఆలోచించే సమయమా? అయినా అదే మాట బైటకి అనడం బాగుండదు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఎవరూ ఏమీ మాట్లడకపోవటం చూసి ప్రధాన మంత్రిగారు, “ మీరందరూ ఏమైనా అభిప్రాయాలు చెప్పాలి. మంత్రి వర్గమంటేనే సమిష్టి బాధ్యత. మీ సహకారం లేకుండా నేనేమీ చెయ్యలేను.” అన్నారు. అందరూ ఆర్థిక మంత్రి వైపు చూసేరు. 

అయన ఓ క్షణం ఆలోచించి, నోరు పెగిలించుకొని “ ప్రధాని గారూ. మీకూ నాకూ ఆర్ధికవేత్తలమని మంచి పేరుంది. మన ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ ప్రజలు గెలిపించింది ఆ నమ్మకం మీదే. అయితే గత కొన్ని రోజులుగా మన ఆర్ధిక సంస్కరణలు ముందుకెళ్ళడం లేదని, అవి గతి తప్పేయని మనమీద అందరూ అభాండాలు వేస్తునారు. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఈ విషయం మీద విదేశీ పాత్రికేయులు ఎక్కు పెట్టిన ప్రశ్నలకి నేను బిక్కు బిక్కు మని తడుముకోవాల్సి వచ్చింది. అందుకే, నా దృష్టిలో, మనం ఈ విషయం మీదే ఏమైనా చెయ్యాలి. మనకి స్వల్పకాలంలో ఫలితాలు కనబడాలంటే ఇదొక్కటే మార్గమని నా అభిప్రాయం.” అన్నారు.

ఆ తర్వాత ఓ గంట పాటూ ఆ సమావేశం జరిగింది. ఏం చేస్తే బావుంటు౦దని అందరూ తీవ్రంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చేరు. ప్రధాని ఎంతో ఉల్లాసంగా ఆ సమావేశం నుంచి బైటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

ఇది జరిగిన ఓ నెల రోజుల్లో ఓ కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకూ అనుమతి ఉన్న రంగాలే కాక ఇంకా ఎన్నో రంగాలలో వ్యాపారానికి విదేశీ సంస్థలని ఆహ్వానించడమే దాని సారాంశం. 

కొత్తగా అనుమతి ఇచ్చే రంగాల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో జాగ్రతగా ఎంపిక చేసింది. ఆ ఎంపిక లక్ష్యం ఒకటే. సాధ్యమైనంత త్వరగా ( అంటే రెండు మూడు నెలల్లోనే) ఆ సంస్థలు భారత కార్యకలాపాలు ప్రారంభించగలగాలి. కొత్తగా భారత్ లోకి విచ్చేసిన ప్రతి కంపెనీకీ ప్రభుత్వం విశేషంగా రాయితీలు ఇవ్వడమే కాకుండా అత్యధిక ప్రాచుర్యం కల్పించాలి. ఆ విధంగా ప్రభుత్వం కూడా సాధ్యమైనంత మైలేజీ సంపాయించాలి.

భారత ప్రభుత్వం వెలువరించిన ఈ ప్రకటనకి విదేశీ కంపెనీలనుంచి విశేషమైన స్పందన లభించింది. ఎంత త్వరగా వస్తే అంత ఎక్కువ రాయితీలు ఉండటంతో ఎన్నో కంపెనీలు క్యూ కట్టేయి. రకరకాల కోలాలు, పిజ్జాలూ, బర్గర్లతో పాటు, చెప్పులూ, వాచ్ లూ, బెల్టులూ, బ్యాగులూ, క్రీములూ, జుట్టు రంగులూ వగైరా వగైరా …అయితే అన్నిటి కంటా ముందుగా పని ప్రారంభించిన సంస్థ ఫ్రెంచ్ హెయిర్ కట్టింగ్ సలూన్ల కంపెనీ “ లా హైరా’

‘లా హైరా’ ప్రపంచ వ్యాప్తంగా ఓ అత్యున్నత స్థాయి గల కంపెనీ. ఎన్నో దేశాల్లో లా హైరా లో జుట్టు కత్తిరించుకోవడానికి యువకులు ఎగబడతారు. ప్రముఖ బాలీవుడ్ నటులు ఫ్రాన్స్ పోయి మరీ అక్కడ హెయిర్ కట్టింగ్ చేయించుకు వస్తారు. రక రకాలుగా జుట్టుని కత్తిరించడంలో లా హైరా ని మించిన సంస్థ లేదు. వారి పిట్ట కట్టింగ్ ( జుట్టంతా పిచికల గూడులా తయారవుతుంది), డిప్ప కట్టింగ్ (మరీ పదునియిన కత్తెరతో కట్ చేసినట్టుంటుంది), డప్పు కట్టింగ్ ( గుండు మీద స్టీల్ పళ్ళెం బోర్లించి నట్టు మెటాలిక్ రంగులతో మిల మిల మెరుస్తుంటుంది), పప్పు కట్టింగ్ ( ఓ ముద్ద లాంటి జెల్ జుట్టు మీద పూస్తారు) లాంటివి వరల్డ్ ఫేమస్.

ఆ రోజు ఇండియా లో లా హైరా మొదటి ఔట్లెట్ ప్రార౦భం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంస్కరణల్లో భాగం కాబట్టి మొత్తం మీడియాతో పాటూ ప్రధానీ, మొత్తం మంత్రి వర్గం కూడా విచ్చేసేరు. అన్ని టీవీల్లో ఈ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ కూడా వస్తోంది. ఏ రోజూ పెద్దగా రెండు ముక్కలు కూడా మాట్లాడని ప్రధాని ఆ రోజు ఎంతో ఉద్వేగంగా అనర్గళంగా ఉపన్యసించేరు. “ మన దేశ చరిత్ర లోనే ఈ రోజు ఓ మరిచిపోలేని రోజు. ఈ రోజు మొదలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందినా సంస్థలు మన దేశంలోనూ వాటి సేవలని అందిస్తాయి. దాని వల్ల సగటు భారతీయుడి జీవన ప్రమాణాలు మెరుగవటమే కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు జరుగుతుంది. ఇన్ని కంపెనీలు మన దేశంలోకి రావటం వలన మన యువకులకి ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ కంపెనీలన్నీ తెచ్చే కొత్త టెక్నాలజీ వల్ల మన దేశంలోనూ శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవం వస్తుంది. ఇన్నేళ్ళుగా మమ్మల్ని , మా పార్టీని ఆదరించిన భారత పౌరుల ఋణం మేము ‘లా హైరా’ లాంటి కంపెనీలని ప్రొత్సహించడం ద్వారా తీర్చుకోగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.”

లా హైరా ఇండియా హెడ్ ఫ్రాంకో లారా మాట్లాడుతూ ఇలా అన్నాడు. “ మమ్మల్ని ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికీ, మరీ ముఖ్యంగా ప్రధాని గారికీ మా ధన్యవాదాలు. భారత దేశం ఆర్ధిక సంస్కరణలకి కట్టుబడి ఉందనడానికి మా ఈ ప్రారంభోత్సవమే ఒక నిదర్సనం. మా ఆగమనం తర్వాత భారత క్షురకులలో ఓ విప్లవం వస్తుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో మాకు మేమే సాటి. మేం అందరి లాగా చైనీజ్, కొరియన్ కత్తెర్లు వాడం. మేం మా కత్తెరలని జెర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటాం. దాని వల్ల ఎంతో సునాయాసంగా జుట్టు కత్తిరించడం అవుతుంది. మా కస్టమర్లకి అదొక మంచి అనుభూతిని మిగిలిస్తుంది. మా ఔట్లెట్ లన్నీ ఏసి మాత్రమే కాకుండా సకల సదుపాయాలతో ఉంటాయి. మేం జెండర్ ఈక్వాలిటీ కూడా పాటిస్తాం. అందుకే మా ఔట్లెట్ లలో ఆడ, మగా ఇద్దరూ క్షవరం చేస్తారు. ‘భారత స్త్రీలకి ఆర్ధిక స్వాతంత్రం ఉండాలి, స్త్రీలు కూడా అన్ని రంగాల్లో పురోగతి సాధించాల’నే ప్రభుత్వ లక్ష్యాలకి మా వంతు ఉడతా సాయం మేమూ చేస్తాం. అయితే ఇన్ని సదుపాయాలూ అందిస్తున్న కారణంగా మా ధరలు కొంచెం ఎక్కువ. అలా అని మరీ ఎక్కువ కాదు. తలకి 500/-, గడ్డానికి 300/-. అంతే. అయితే ఇప్పుడిప్పుడే ప్రతి విషయం లోనూ ప్రపంచ ప్రమాణాలతో పోటీ పడుతున్న భారతీయ వినియోగదార్లు మా సేవలని కూడా ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. భారత యువకులు ప్రపంచంలోని ఏ దేశపు యువకులకీ తక్కువ కాదని రాబోయే రోజుల్లో ఇక్కడ మేం చేసే వ్యాపారమే నిరూపిస్తుంది.” 

 

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తన “ లక్ష్మి హెయిర్ సెలూన్” లో పైడి రాజుకి పది రూపాయలకి గడ్డం గీస్తున్న అత్తిలి సత్తిబాబు ఈ కార్యక్రమమంతా టీవీలో చూస్తున్నాడు. అందరూ ఇంగ్లీషులో మాటాడుతుండటం వలన వాడికేమీ పెద్దగా అర్థం కాలేదు. రెండు నెలల్లో పక్క రోడ్డులోనే ఈ ఫ్రెంచ్ కంపెనీ క్షవరం షాపు తెరుస్తుందన్న విషయం వాడి ఊహకి కూడా అందదు. ప్రభుత్వం ఏదో ఆర్ధిక సంస్కరణలు చేస్తోందని తెలుసు కానీ అవేంటో వాడికి తెలీదు. జెండర్ ఈక్వాలిటీ పేరుతొ పొట్టి గౌన్లేసుకొని కత్తెరలతో అమ్మాయిలు కాంపిటిషన్ కి దిగితే ఏం చెయ్యాలన్న విషయం వాడెప్పుడూ ఆలోచించలేదు. అసలు ప్రభుత్వం, మహిళా అభ్యున్నతి సాధించడానికి ఇలాంటి మార్గాలు కూడా ఎంచుకోగలదని ఎవరైనా చెబితే వాడు నమ్మను కూడా నమ్మడు. కానీ, ప్రధాన మంత్రి నలుగురు సూటు బూటు వేసుకున్న విదేశీయులని వెంటేసుకొని ఆంగ్లంలో ఇంత అనర్గళంగా ప్రసంగించడం చూసేసరికి దేశానికి ఏదో కొత్త ఉపద్రవం ముంచుకోస్తోందన్నవిషయం మాత్రం వాడి మట్టి బుర్రకి కూడా స్పష్టంగా అర్థమయ్యింది.

@@@@@

<a href=”http://www.bidvertiser.com”>pay per click</a>