ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అమ్మ భాష

Like-o-Meter
[Total: 0 Average: 0]

అమ్మ జోల పాడినంత -వీణతీగ మీటినంత 

                           శ్రావ్యమైనది మన తెలుగు భాష 

కన్నతల్లి పాలలా -రాయప్రోలు రాతలా 

                      కమ్మనైనది మన తెలుగుభాష 

అమ్మ  కథలు చెప్పినంత – ఆత్రేయ వారి భావమంత 

                            కమనీయమైనది మన తెలుగుభాష 

కన్నతల్లి మనసులా – జాషువా పలుకులా 

                        స్వచ్ఛమైనది మన తెలుగుభాష 

అమ్మ ఇచ్చిన బొమ్మలంత – నండూరి వారి ఎంకి అంత 

                        అందమైనది మన తెలుగుభాష 

అమ్మా అని పిలిచినంత -వేటూరి వారి గీతమంత 

                             మధురమైనది మన తెలుగుభాష 

అమ్మ నేర్పిన భాషలా – కృష్ణశాస్త్రి కవితలా 

                                 మరపు రానిది మన తెలుగుభాష 

కన్నతల్లి ప్రేమలా – కరుణశ్రీ పాటలా 

                                          అనిర్వచనీయమైనది మన తెలుగుభాష 

అమ్మలోని సుగుణంలా – గురజాడ దేశభక్తిలా

                                 ఆదర్శమైనది మన తెలుగుభాష 

కన్నతల్లి కరుణలా – శ్రీశ్రీ వారి రచనలా 

                                           అద్వితీయమైనది మన తెలుగుభాష 

అమ్మ చేతి దీవెనలా – రాయల వారి మాటలా 

                                         అజేయమైనది మన తెలుగుభాష 

ఇంత ఇంత ఇంతంటూ తెలుగు వైభవాన్ని 

ఎంతైనా చెప్పగలను అనుకున్నా నేను అజ్ఞానంతో.

చెప్పి చెప్పి అలసి సొలసి వెనుతిరిగి చూసుకున్నా 

నే చెప్పినదెంతా అని,

మహాసింధువులో బిందువంతే.

 జ్ఞానంతో కనులు తెరిచి

తెలుసుకున్నాను కొంత. 

ఇంత ఇంత ఇంతంటూ తెలుగుభాష ఔన్నత్యాన్ని చెప్పడంలోనే 

రాజులెందరో మునిగిపొయె 

కవులు పైకి తేలరాయె అని. 

ఆ మహామహులకు వారి పితామహులకు 

నా నమస్సుమాంజలులు. 

చెప్పలేను, చెప్పలేను ఇంతకంటే,

ఈ సాగరాన్ని ఈదలేను ఏనాటికి వీరికంటె. 

********