ఒడిదుడుకుల జీవన ప్రస్థానానికి
ప్రధమ ద్వారం అయినా,
బడులను విడచి బతుకు బాట పట్టిన నాకు
లేలేత ముద్దు ముచ్చట్ల
ముఖ వర్చస్సుల, ఉత్సాహపు నడకల
ఒక అపురూపమైన భావనల తోరణం
నా కూతురు చదివే బడి ద్వారం
అమ్మలు, నాన్నలు ముద్దుగా
మురిపంగా వాళ్ళ సంతానాన్ని
బడి ద్వారం దగ్గర విడచి
కనిపించే వరకూ చూస్తూ
కనపడని భవిష్యత్తు లో
తమ సంతానాన్ని ఊహిస్తూ
ఉదయాన్నే కలలు కంటూ
బడి ద్వారం విడచి
బతుకు మార్గ పడతారు
కొందరు చిట్టి జడలతో
కొందరు గాలికి హాయిగా ఊగే కురులతో
కొందరు నవ్వుతూ
కొందరు గంభీరం గా
కొందరు సంతోషం గా
కొందరు తోటి వారితో ముచ్చటిస్తూ
కొందరు విషన్న వదనం తో
కొందరు భయం భయం గా
కొందరు కోతిగంతులేస్తూ
కొందరు పరుగులు తీస్తూ
కొందరు అమాయకంగా
కొందరు ఇంకా నోటిలో ఉన్నది నముల్తూ
కొందరు దిగాలుగా
కొందరు ఏడుస్తూ
కొందరు అమ్మను విసుక్కొంటూ
కొందరు నాన్న వంక ప్రేమ గా చూస్తూ
పెద్ద కళ్ళ తో
బూరె బుగ్గలతో
లేత పెదవులతో
చిన్ని రూపాలతో
దుఃఖమెరుగని దేవతల్లా సాగిపోతున్నారు
కానీ అందరూ స్వచ్చతతో వెలిగిపొతూ
చూసే వారికి ఆహ్లాదం, ఆనందం కలిగిస్తూ
చక్కని బాల్యాన్ని స్పురణకు తెస్తూ
ప్రతి ఉదయం మొత్తం దినానికి సరిపడా
ప్రొత్శాహమిస్తూ అమ్మలకు నాన్నలకు
టాటా బై బై చెబుతుంటే
చూడకపోయినా కనిపించేది ఆ బడి ద్వారం
నిజం గా ఇది ఒక గమ్మత్తైన గహన భావాల హారం !!