ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

భారతదేశం ఒక మహాదైశ్వర్యం

Like-o-Meter
[Total: 0 Average: 0]

 
ఆకలి మందగించినా బఫే భోజనాలు
అన్నీ తినలేక పోయినా ఆలా కార్టే ఆర్డర్లు
అంబరాన్నంటే అన్ని పండుగల సంబరాలు
అబ్బురపరచే ఖర్చులు  కేవలం కొన్ని క్షణాల కోసం
 
వద్దంటే డబ్బు గవర్నమెంటు బాబులకు
పద్దులు లేని మదుపులు రాజకీయ నాయకులకు
హద్దులు దాటిన భ్రస్టాచారం చూసీ తెలిసీ
మొద్దు నిద్ర వీడని ప్రజా ప్రభుత్వాలు
 
ఇంత జరుగుతున్నా సగటు జీవి
సంతోషంగా సినిమా చూస్తాడు
తనకు తోచిన సాయం చేస్తాడు
గురితో గుడికి వెళతాడు
 
ఏమీ పట్టనట్లు కూలీ జనం
రోజూ శ్రమించి సేదతీరుతారు
బడికి వెళ్ళాల్సిన పిల్లలు సంపాదనలో పడతారు
పేదలకు అందని పధకాలు ప్రచార సాధనాలు
 
ఒక సాధువు జగం మిథ్య అంటాడు
ఒక సన్యాసి నువ్వే దైవం అంటాడు
ఒక ప్రవచనకర్త ప్రలోభాలకు బలి కారాదంటాడు
ఒక మత  బోధకుడు మతి భ్రమించిందంటాడు
 
ఇందరు ఇన్ని మాటలన్నా ప్రభావం సున్నా
ఎందుకంటే ఆధ్యాత్మికత ఇంకా కడుపునిండిన వ్యవహారమే
జ్యోతీష్యం ఒక జీవనోపాధి, వైదిక క్రతువు ఒక వ్యాపారం
యోగా, ఆయుర్వేదం ఇంకా మన జీవన విధానం కాదు
 
మన సనాతన సంస్కృతి విదేశీయులకు ఒక వింత
ఆశ్చర్యమేమంటే మనకు దానిపట్ల విముఖత
సంస్కృతం ఒక కొరుకుడుపడని విషయం
విదేశీ భాషా శాస్త్రవేత్తలకు అది ఒక అద్భుతం
 
ఈ వేద భూమిలో పుట్టలేదని భోగ భూమి వాసుల వెత
ఇక్కడెందుకు పుట్టాము అని భారతీయుల కలత
ఇంట్లో మన కళలు కళావిహీనాలు బయట ద్రువతారాలు
మరి కాదా మనదేశం ఒక మహదైశ్వర్యం!!