ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

బడ్జెట్ లో ముచ్చట్లు!

Like-o-Meter
[Total: 0 Average: 0]

కలల బడ్జెట్ కనికరిస్తుందో

కనిపెట్టి మరీ కరుస్తుందో 

తెలియదు సగటు మనిషికి 

అప్రత్యక్ష పన్నుల కోరలు 

అప్రతిహతం గా చిల్లులు పెట్టి 

అలవోకగా ధనాన్ని కొల్లగొట్టి 

ఆదమరచి నిద్రించే అవకాశం

అందనీయలేదు పాపం సగటు జీవికి 

 

గత 9 ఏళ్ల పాలనలో రూపాయి రావడం మారలేదు 

రూపాయి పోవడం మాత్రం భలే చిత్రం గా మారుతోంది 

నెహ్రు ఇందిర రాజీవ్ ల పేర్లు ఆసరాగా 

పధకాల మాటున పరుగులు తీసి మరీ పోతోంది 

అస్మదీయులే లబ్దిదారులని నిరూపిస్తోంది 

 

రూపాయి రావడం లో జాతి మతి ఉంది 

రూపాయి పోవడం లో జాతి గతి ఉంది 

 

లక్షల కోట్ల బడ్జెట్ ఇప్పటి వరకూ 

వేలలోనే ఉన్న వ్యక్తులనుద్దేశించింది 

కోట్లాది జనుల కోరికలు తీరేది 

నోట్లను దాచడం మానినపుడే  

 

స్వతంత్ర భారత దేశం లో 

కాకి లెక్కల  బడ్జెట్ల లో 

గరీబీ హటావో నినాదం లో  

నాయకులు సృజనాత్మక అవినీతి లో  

పరమపదించింది ప్రజల ప్రగతి !

 

 

ఈ లెక్కలు మాకొద్దు

మా రెక్కలు ముక్కలు చేయొద్దు

“ఉచితం” తో  మా గతి ఇకపై  అనుచితం కావొద్దు

 

పని ఇచ్చే బడ్జెట్ కావాలి

పనికొచ్చే లెక్కలు చెప్పాలి 

జన జీవన శ్రవంతికి 

జవసత్వాలు కలిగించాలి 

బడ్జెట్ల ముసుగులో

బతుకులతో ఆటలు మానాలి  

నీరు నింగి, గాలి నేలా పులకించాలి 

వంటింట్లో నిప్పు నిత్యం రాజుకోవాలి 

అని నినదించాయి మౌనం గా ప్రజల గొంతులు !