చేతిలో ఆమె చెప్పులు పట్టుకుని ఇరవైనాలుగొసారి వీధిమలుపువేపు చూసా.
రోడ్డు ఎండకు పగిలిపోతోంది. బ్రతుకుతో విసుగెత్తిన బిచ్చగత్తె ఒకటి మాత్రం ఓ చివర కూర్చుని వచ్చెపొయె జనాలని , మోటారు వాహనాలను చోద్యంగా చూస్తోంది.
ఈ వేళకు ఆమె రావాలే ?!
సెప్టెంబరులో తడిసిన వాన ఇంకా చర్మంలో ఎక్కడో తడిగా గుర్తుతేలింది. అందరిలానే ఒక చిన్న గొడుకు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళింది ఆమె.
నాకు కొంచెం పిచ్చి.
ఆమె నచ్చేసింది. పెళ్ళి కాలేదని మెడ , కాలి , చేతి వేళ్ళు చూసి అనుకున్నా. ఒకవేళ అయితే మాత్రమేమిటంట.
నేనేం చేస్తాను ఆమెను ? కళ్ళున్న ప్రతివాడికీ అందాన్ని చూసే హక్కు ఉంది.
ఆమె ఒకోసారి ఒకోలా నడిచేది. వానాకాలమంతా పడవలా , చలిలో చీమలా , వసంతంలో పిల్లగాలిలా, ఎండలో కరిమబ్బులా. నిన్న మాత్రం శృతి తప్పింది.
తెగిన చెప్పుతో రెక్క గాయపడిన హంసల ఉస్సోరుమంటుంటే… చేతులున్న నాకు చెప్పులు తొడగలేకపోయినా ఇచ్చే హక్కు అయినా ఉండదా ??
ఇరవైతొమ్మిదోసారి చూసా. అదిగో….అల్లదిగో కానీ.. ఏమిటో తేడా ?
హై హీల్స్ . టక్కు టిక్కు. బావోలేదు.
మళ్ళీ చూసా. అవే. ఆమే. అస్సలు బాలేదు. బిచ్చగత్తె ముందు చెప్పులు పెట్టేసా.
ఒక భావుకుడు పాపం చచ్చిపోయాడుగా.