ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

మానవత్వపు విలువలు

Like-o-Meter
[Total: 0 Average: 0]

 

మానవత్వపు విలువలు మంటగలసి పోతుంటే

ఎవరిని నిందిద్దాం?

ఎవరిని బాధ్యులను చేద్దాం?

 

మనమరాలిని చూచి తాత

మురిసిపోయే వయసులో

ఆ ఈడు పిల్లలంతా

తన మనమరాళ్లు అనుకోకపోతే!

 

కన్నబిడ్డనే కాటేసే తండ్రులుంటుంటే

కాపాడవలసిన కంచెలే మేస్తుంటే

ఎవరిని నిందిద్దాం?

ఎవరిని బాధ్యులను చేద్దాం?

 

‘నిర్బయ’త్వం కోసం పరితపిస్తున్న

దేశంలో అరాచకత్వం పెచ్చు మీరుతుంటే!

ఎవరిని నిందిద్దాం?

ఎవరిని బాధ్యులను చేద్దాం?

 

సుఖం స్వల్పమేనని,

 కామం అల్పమేనని తెలిసికూడా

కన్నబిడ్డలనే కాలరాసే తల్లులుంటుంటే

ఎవరిని నిందిద్దాం?

ఎవరిని బాధ్యులను చేద్దాం?

 

పోయాయి ఉమ్మడి కుటుంబాలు

పెరిగిపోతున్నాయి వృద్ధాశ్రమాలు

ఎవరిని నిందిద్దాం?

ఎవరిని బాధ్యులను చేద్దాం?

 

మానవత్వపు చిరునామాను

ఎక్కడ వెదుకుదాం?

మన జీవితాలపై విలువల చేవ్రాలును

ఎప్పుడు చూద్దాం?