ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నయా మ్యూజింగ్స్ – చెయ్యెత్తి జైకొట్టలేనోళ్ళు…

Like-o-Meter
[Total: 0 Average: 0]

బాబాయ్ చెయ్యెత్తుతున్నాడు వెంఠనే దించేసు కుంటున్నాడు. మళ్ళెత్తుతున్నాడు ఠపీమని మళ్ళీ దించేసు కుంటున్నాడు. ఫోన్లే కుర్రవాడు గదా కండలు పెంచేసుకుంటున్నాడేమో అనుకొన్నా. మళ్ళంతలోనే హనుమానం, హాచ్చెర్యాలు చుట్టు ముట్టేసాయి. కండలు పెంచాలంటే జిమ్ముక్కదా వెళ్ళాలా? డంబెల్సు కదా యెత్తాలా? అదేమీ లేకుండా ఈ చెయ్యెత్తి దించడాలేమిటని తెగ మహా ఇదైపోయాను. అదే మాటని గాఠ్ఠిగా అనేసేసాను కూడా. అది విని…

“యెత్తడానికి చెయ్యున్నా యెత్తలేకపోతున్నానురేయ్” అని మహా ఇది బోల్డుగా బాధ పడి పోయాడు బాబాయ్. “యెందుకు? యెవ్వరి వల్లా? యెలా?” అని పంచతంత్రములోని కరటక, దమనకుల కజిన్ బ్రదర్లా అడిగేసాను నేను. “చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి కలవోడా అనే పాటుంది గదా! దాన్ని విన్నప్పుడల్లా చెయ్యెత్తేసేసి జైకొట్టేసెయ్యాలనిపించేస్తుంది…కానీ…”అని ఆగిపో యేసాడు బాబాయ్. “సర్లేద్దు…విషయం చెప్పు” అన్నట్టు నే చూశా. నా కళ్ళల్లో ఎర్రబావుటా నినిగగలు, ధధగగలు కనబడ్డాయేమో బాబాయ్ భయం పడి పోయి “కానీ….గతకీర్తికి జై కొడ్తే నేటి కీర్తికి ఏం కొట్టాలని…నా యిదనుకో” అన్నాడు.

“హా….యింతేనా నీ యిది? గత కీర్తికి జైకొడ్తే యిప్పటి కీర్తికి సైకొడ్తే పోయే..” అన్నాన్నేను.

“ఛీ భడుధ్ధాయ్! అపకీర్తికి సై కొట్టడమేంద్రా! చీ ఛీ” అన్నాడు బాబాయ్. అన్నోడు ఊర్కోవొచ్చుగా. లేదు. మళ్ళీ చెయ్యెత్తి దించేసుకొనేసాగాడు.

యిదే ఈ తెలుగోళ్ళతో పితలాటకం. గతకీర్తి అంటే బుద్ధుడవడం, నేటికీర్తంటే భడుధ్ధాయ్ అవడమని తెగ మహా ఇదైపోయేస్తుంటారు.

ఔనూ యింతకి మనమెవరం? కీర్తులోళ్ళమా, అపకీర్తులోళ్ళమా?