ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

నేను మాత్రం….నీ ప్రకృతి

Like-o-Meter
[Total: 0 Average: 0]

సున్నం కొట్టుకొన్న గోడకు రెండు కంతల కన్నుల్లో రెండు సూర్యగోళాల వెలుగురేకుల్లో ఎగిరి ఎగిరి పోతున్న ధూళి కణాల వేటలో కోట్లాది బాక్టీరియాల వకేవక్క మనసులో పుట్టి పెరిగి పండి రాలిపోయే ఊహల్లో మొట్టమొదటి ఆదిమ ఆలోచన వెనక లుంగలు చుట్టుకొన్న కాలసర్పం రెండు కోరల అంచున జారీజారని విషపు చుక్క ఊగిసలాటలో చావు, బతుకుల దిక్కుమాలిన వాదులాటకు ఆజ్యం పోస్తూ నిర్దయ తర్కమొకటి రచిస్తున్న నాటకపు చరమాంకంలో త్వరపడి తెరను వేసేందుకు తొందరపడుతోన్న నిరుపయోగ గాత్రధారి వెకిలిచేష్టల అంతరార్థాన్ని నిఘంటువుల్ని వెదికి వెదికి అనువదిస్తున్న ఓ మనిషీ! వేకువ మెలకువలో మకిలి అంటని పువ్వు మైవిరుపులో నీ సార్థక్యజీవనపు సూత్రం దాగుందని తెలిసీ వక్రకోణంలో తల పంకించి నాజూకు మైవిరుపును మూర్చరోగపు విలవిలగా భ్రమపడుతున్న నీ నిర్భాగ్యదశకు మించిన అసంబద్ధత మరొకటిలేదన్న నిష్టుర సత్యాన్ని తెలుసుకొని నివ్వెరపోయాననుకోకు. పోగొట్టుకొన్న పద్యంలో అక్షరాల్ని దాచిపెట్టాను. రాత్రి రంకులాటలో కలగలసిపోయిన అవ్యవస్థ కణాల్ని విడదీసి పారేసాను. డిసెక్టింగ్ టేబిల్ మీద బల్లపరుపుగా పడుకొన్న ఉదాసీనత గుండెనరాన్ని పట్టి పెట్టాను. మనిషీ! నీ గుండెలోని స్పందనారహస్యం నా రహస్య స్పందనకి దగ్గరి బంధువే. సర్వకాలికమైన ఈ రహస్యాన్ని నీకు చెప్పే సమయమింకా రాలేదు. నీకు నువ్వే రాసి అంటించుకొన్న ఘనమైన బిరుదుపత్రాల్ని నిలువెత్తు గోతిలో నువ్వు పాతిపెట్టిన మరుక్షణంలో నా మంద్రస్వరం నీకు వినిపిస్తుంది. అప్పటిదాకా నువ్వు ఆగగలవేమో! నేను మాత్రం……