ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఓ శనివారం సాయంత్రం

Like-o-Meter
[Total: 0 Average: 0]

ఒక జంట బైక్ పై హత్తుకొని కూర్చొని
ట్రాఫిక్ పద్మవ్యూహం ఛేదించుకొంటూ
ఉత్సాహంగా ఊసులాడుతూ, ఊగిపోతూ
ఒక సినిమాహాలు చేరి అక్కడి జనసంద్రంలో కలిసిపోయింది

ఇంకా నేనున్నానని సాంప్రదాయం చెబుతున్నట్లు
ఒక యువతి తలలో విరిసిన మల్లెలు ధరించి
స్వచ్చతకు ప్రతిరూపంగా బజాజ్ చేతక్ వెనుక
భర్త ప్రసన్న వదనంతో బండి నడుపుతుంటే
పొందికగా కూర్చొని లోకాన్ని పరికిస్తూ ప్రయాణిస్తోంది

పార్క్ పక్కన చాట్ మసాల తింటూ ఒక జంట
ఒకరి నొకరు కొత్తగా చూసుకొంటూ మురిసిపోతుంటే
ఒక కుటుంబం పచ్చికలో దుప్పటి పరచి
పిల్లల్ని ఆడుకోమని ముచ్చట్లలో మునిగిపోయింది

ఒక ఇంట్లో బాల్కనీ లోకి పాకిన సన్నజాజి తీగ గాలికి రమ్యంగా ఊగుతూ
లోపల పనిలో మునిగి పోయిన ఓ ఇల్లాలిని తన వద్దకు రమ్మంటుంది

అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త ఆ దృశ్యం చూసి అక్కడే కుర్చీలో కూర్చొని
తన భార్యను రమ్మని సైగచేసి మాటల్లో పెట్టేసాడు
కొత్తగా కడుతున్న ఇంటికి కుదిరిన వాచ్మన్
తను కట్టిన చిన్న పాక బయట వంట చేస్తున్న
భార్యతో ఏదో సరదాగా చెబుతుంటే ఆమె నవ్వింది
ఘుమఘుమలాడుతూ ఒక పులుసు వాసన వెదజల్లింది

వీధి చివర పూలమ్ముకొనే ఒక అమ్మాయి దగ్గర
చాల మంది యువతులు మూగి పూలు కొంటున్నారు
ఆ పక్కనే ఉన్న మొక్కజొన్న పోత్తులమ్మే అబ్బి
ఒక్కసారే ఆరు  పొత్తులు బొగ్గుల సెగలో ఉంచాడు

వీధుల్లో పిల్లల సందడి సాయంత్రానికి స్వారాలు చేకూర్చింది
బాల్కనీలలో కూర్చొని చూసే బామ్మలూ, తాతలూ
ఇంకో రోజుకి వీడ్కోలు పలుకుతున్నట్లు ఉన్నారు

వంటింట్లో ఉదయానికి ఇడ్లీ పిండి వేస్తున్న
ఆ ఇంటి ఇల్లాలిని వెనుక నుంచి అదిమి పట్టుకొని
సాయంత్రం దొరికిన ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నాడొక  భర్త

రామాలయంలో పురాణ ప్రవచనానికి ఏర్పాట్లు జరుగుచున్నై
మైక్ టెస్టింగ్ 1,2,3 అంటూ ఉంటే గాలికి షామియానా రెపరెపలు
వస్తున్న భక్త జనసందోహం వారి వెంటే ఒక పరిమళమ్
నిశ్శబ్దానికి ముందు ఉండే వింతైన కోలాహలం

ఆరు రోజుల శ్రమ ఆది వారం రూపంలో ఆహ్వానం
పలుకుతుంటే ఆ శని వారం సాయంత్రం తెలియని
ఉత్సాహంతో, శక్తితో వడివడిగా ఇంటివైపు అడుగులు సాగాయి

ఎంతో మంది శ్రామిక తరాలకు

సాయంత్రం ముగిసింది చీకటి పడింది
తెల్లని కాంతి విరజిమ్మే ఆ వీధి దీపాలు
పూలని, కొబ్బరి ఆకులని  నగుమోములనూ
ఇంకా ప్రకాశవంతం చేస్తున్నాయి

సేద తీరి స్వేచ్చగా ఆదివారాన్ని గడపమని సంకేతాలిస్తున్నాయి
ఎవరు పెట్టారో ఈ నియమం
ఆదివారం ఒక అద్భుత దినం

(శని, ఆదివారాలు సెలవు దినాలు ఉన్నవాళ్లకిది వర్తించదేమో!)