ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

సారీ! ఏమిటిదంతా?

Like-o-Meter
[Total: 0 Average: 0]

జీవితానికి వెకిలితనం పర్యాయపదంలా అనిపిస్తోందా? అయితే నీ మోక్షమార్గం సులువైనట్టే!

దేహం నుండి సందేహం తొలగితేనే ముక్తి వస్తుందని ఒక మహానుభావుడు చెప్పాడు. జీవితం లో ’వి’కారం లోపించినప్పుడు జీవితానికి వెకిలితపు అర్ధం సిద్ధిస్తుంది. ఇది బాగోలేదంటావా! జీవితమే గుల్లైనాక పదాల్నట్టుకు యేం చేస్తావ్!

వెకిలిదనం కాకపోతే, ఎప్పుడూ ప్రతిస్పందనతోనే బతికితే యెలా? కొంచెమైనా భావస్పందన వద్దా?

వద్దని కాదు కానీ దానికి టైమెక్కడుంది! లోపల ఆత్మ బతికుంటేగదా! అదెక్కడో ఆరడుగుల గోతిలో అరప్రాణంతో వుంటుంది. ఆరడుగులేగా అరనిమిషంలో తోడి తీస్తానంటావా – సరే. నిలుచున్నపాటిని నిన్ను నీవు నిలువుగా కోసుకొంటేగానీ దొరకదది. ధైర్యముందా?

విత్తనం నేల్లో పాతినా ఆకాశంలో పండ్లు పుడ్తాయ్. ఆకాశంలో పుట్టిన చినుకుతో విత్తనం విచ్చుకొంటుంది. ఇది చూసి కూడా ఇట్లానే బతుకుతామంటే ఈ జీవితంకు అర్థమేముంది?

చీము, చీమిడి – ఇదే జీవితమని చాలామందికి నమ్మకం.  ముక్కుతో వాసన చూసినా నాలికతోనే తింటామన్న బుద్ధి పడకేసినప్పుడు ఇట్లాంటి నమ్మకాలకేవీ ఢోకా వుండదు. ప్రపంచం మొత్తం ఇంత పైపైకెళ్ళిపోడానికి ఈ నమ్మకాలే డీజలు, పెట్రోలు అనేటోళ్ళు “సారీ! ఏమిటిదంతా?” అంటారు.

అసలు విషయమంతా ఇదేనంటా!

రోడ్లో నీ మానాన నువ్వు చెవిలో మొబైలెట్టుకోని సుత్తిశాల్తీతో  సొల్లు కబుర్లు చెప్పుకొంటూ వెళ్తుంటావా! పక్కనే పొగొదొలుకొంటా సిటీబస్సు పోతుంది. కిటికీ పక్కన కూర్చొన్న పాన గంధర్వుడెవడో ఉమ్మేస్తాడు. అప్పుడే దట్టించిన పానైతే ఆ జల్లు చిక్కటి కళ్ళాపి జల్లే! నువ్వు తడుస్తావు. బూతులు తిడతావు. మొబైల్లో అవతల లైన్లో వున్న శాల్తీ ఆ తిట్లు తనకేననుకొని చిర్రెత్తిపోతది. నువ్వు “సారీ” అంటావు. ఇక్కడే జీవితం వెకిలిదౌతుంది.

సగం నాలుక్కాళ్ళ జంతువుల్తో, సగం రెండుకాళ్ళ జంతువుల్తో తొక్కబడి ఇరుకైపోయిన ఫుట్పాత్ పై పోతుంటావ్. చెవిలో ఐప్యాడు గొణగుతూవుంటుంది. “కొల వెరి, కొల వెరి”. కొలవెరిలో నువ్వు. నీతో కొలవెరి. ఆమాత్రం అప్టుడేటుగా లేకపోతే మొహానికి ఐప్యాడెందుకని నీ పక్క సీటు కొలీగమ్మ కోకాకోలెత్తిపోయ్యదూ. దానికోసమన్నా వింటుంటావు. నీ హడావుడీలో వూతకర్ర ముసలమ్మ నగ్న పాదాల్ని బూటుకాలుతో తొక్కతావు. ఆ ముసిల్ది అరిచెందుక్కూడా ఓపికలేని పస్తుల్ది. నిన్న తిన్న బువ్వకి స్టీరియోట్రాకు హాహాకారాలొస్తాయా? కొలవెరి కాకపోతే. నొప్పివోర్చుకోడానికి వంగిపోయిన నడుంను నిటారుచేస్స్తుంది అవ్వ. నాలాంటి బిడ్డల్ని కన్న దేహం గదా, ఆమాత్రం నొప్పుల్ని తట్టుకోదా యేవిటీ అన్నట్టు నువ్వు “సారీ” అంటావు. మున్నాభాయ్ లెక్కన అవ్వ భుజాల్ని తాకి, రెండు చరుపులు చరిచి పోతావు. సరిగ్గా ఇక్కడనే జీవితం వెకిలిదౌతుంది.

ఇట్లాంటి సారీ సందర్భాల్ని చూసైనా నేర్చుకోవాలి, సారీ ఎప్పుడు చెప్పాలో. చెబ్తా విను.




సారీ చెప్పాల్సి వస్తే అదేదో నామర్దా అనుకోకు. నీ అహాన్ని పోగొట్టుకొని నీవాళ్ళనుకొన్నవాళ్లకి సారీ చెప్తే నీ కిరీటమేమీ పడిపోదు. నీవాళ్ళ తప్పుల్ని నువ్వుగాక ఇంకెవరు అర్ధం చేసుకోవాలి? వాళ్ళ అజ్ణానాన్నో, అత్యాశల్నో నువ్వు గాక ఇంకెవరు తీర్చాల?

అందుకే మళ్ళీ చెప్తున్నాను – జీవితానికీ, వెకిలితనానీకీ అర్ధాలు వేరని!