ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

తొలగిన తెరలు!

Like-o-Meter
[Total: 3 Average: 4.7]

అపనమ్మకం జీవితానికి బంధువు.

కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది.

రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను.

నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు?

ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ ఈ మేఘం. ఒకసారి గర్జించి మరోమారు మౌనం వహిస్తుంది.

గాలివాటానికి కొట్టుకుపోయే మబ్బుల్లో నిన్ను నువ్వు  చూసుకుంటావు.

అందనంత ఎత్తుల్లో ఉండడం గొప్పే కావొచ్చు కానీ గాలివాటుతనం మనిషికి అతకని లక్షణం.

 ****

హటాత్తుగా నమ్మకం పుట్టుకొస్తుంది.

ఆ రోజున జీవితంలో మైనపురెక్కల తూనీగ ఒకటి ఎగిరి ఎగిరి విహరిస్తుంది. పూలకు ఎలా వికసించాలో పాఠాలు చెబుతుంది. రేకులింకా విడివడని మొగ్గల్ని తట్టి ప్రోత్సహిస్తుంది.

భ్రమ ఒక పెద్దపులి. నమ్మకం పక్కనో, ఆనందం వెనకనో పొంచివుంటుంది.

పుప్పొళ్ళ ఆఘ్రాణంతో మత్తెక్కిన తూనీగ నిప్పుని కూడా పువ్వని భ్రమిస్తుంది. ఆ భ్రమకు నిప్పు చేసే నాట్యం తోడౌతుంది.

మైనపు రెక్కల సంగీతం, నిప్పు నాలుకల ఊగిసలాట.

తూనీగ మెదడులో మత్తు పొరలు. నిప్పుల నాలుకల పై భ్రమల హొయలు.

ఒకే ఒక్క క్షణం.

నమ్మకం చెదరడం…బ్రతుకు ముగియడం. ఈ రెండిటికి మధ్య అంతరమే అంత!

 

SUBSCRIBE TO ANVESHI CHANNEL – EXPLORE UNTOLD HISTORY

****

జీవిత, అదృష్టం జూదమాడుతున్నాయి.

పందేనికి ఒడ్డబడిన ఆనందం.

మూసబ్రతుకులన్నీ ఆశగా చూస్తున్నాయి. ముక్కల నిండా పరచుకున్న తృష్ణలు.

జీవితానికున్నంత మతిమరుపు అదృష్టానికి లేదు. ఒక్కసారే ఆడుతుందది.

****

“గోడలుంటేనే ఇల్లైనట్టు, అడ్డుగోడలుంటేనే జీవితం” అన్న సిద్ధాంతం పుట్టుకొచ్చాక బ్రతకడంలోని అర్థమే మారిపోయింది.

అన్ని రంగుల్ని పూసి అడ్డుగోడల్ని అంతలా అలంకరించాలా?

****

యంత్రాలకు అస్తిత్వ ప్రజ్ఞలేదు. ఐతేనేం! ఖరీదైనవి.

ఏ జీవితంలోనైతే ఖరీదైన, ప్రజ్ఞాహీన, అస్తిత్వజ్ఞాన శూన్య యంత్రాలు అనేకంగా ఉంటాయో ఆ జీవితం అంత గొప్పది!

ఇంత బ్రతుకూ బ్రతికేది యంత్రాల కోసమేనా?

****

ప్రకృతికి పక్షపాతం లేదు. వైమనస్యం లేదు.

కొన్ని పూల చెట్లు. కొన్ని ముళ్ళ చెట్లు. కొన్ని ఎండిన చెట్లు.

బ్రతుక్కి మాత్రం అగాధమైన స్వార్థం.

ఎండిన చెట్లకు నీళ్ళుపోయదు. ముళ్ళ చెట్లని నరుకుతుంది.

పూలచెట్లకి నీళ్ళు పోసి, ఒక్కొక్క పువ్వుగా తుంచుతుంది.

****

కడలి నీళ్ళతో మబ్బు. మబ్బుల్లో వాన నీళ్ళు. “ఆత్మా వై పుత్ర నామాసి.”

ఎక్కడో పుట్టి – ఎక్కడో పెరిగి – ఎక్కడో కురుస్తోంది మబ్బు…ఆకాశ గర్భాన్ని ఏమాత్రం వదలకుండా.

సముద్రం, మేఘవిరహంతో నిత్యం ఘోషిస్తూ ఉంటుంది.

****