ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

వింత భ్రమణం

Like-o-Meter
[Total: 0 Average: 0]

దాచుకున్న డబ్బంతా
తనే దోచి ఇచ్చిన తంతు
అపార్ట్మెంటు కొనుగోలు అంటే
సంపాదన అంతా ఇ.ఎం. ఐ
అనే ఒక హారతి కర్పూరమై
ఇల్లు మిగిలి  జీవితమౌతుంది డొల్ల
 
ఇంద్రియ నిగ్రహంతో
ఇంతవరకూ దాచిన సొమ్ము
ఇవ్వాలంటే ఇంద్రియాలు
ఇహ మావల్ల కాదని
ఇమడలేక హింసిస్తాయి
కాని తప్పదు ….
 
గూడు కుదిరాకా
గూటికి అమరికలు అలంకారాలు
మళ్ళీ మొదలు కూడబెట్టడం ఖర్చుచేయడం
ఇలా సగం జీవితం గడచాకా
 
పెళ్ళిళ్ళు చేయడం సాగనంపడం
ఇంతలో ఒళ్ళు సహకరించననడం
జీవితమంతా దాచడం, వెచ్చించడం
ఇదే తతంగం ఇదే దందాపన
 
ఈశాన్యం మనఃశాంతి  కొరకు కాదు
మన అవసరాలు తీరాలనే ఆశ కొరకు
అవసరాలు తీరాక తనువు
మంచాన్ని వెతుక్కుంటుంది
మనసు పాత జ్ఞాపకాలవైపు మరలుతుంది
ఈశ్వరుడు ఈశాన్యం లోనే ఉంటాడు
జీవుడు మాత్రం తిరుగుతుంటాడు
వైద్యుల చుట్టూ వైద్య శాలల చుట్టూ !!