ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

ఆశ-బెంగ

Like-o-Meter
[Total: 0 Average: 0]

 
వాన వెలిసింది
తలపు తడిసింది
తోడు నీడై ఈడు జొడై
జీవితాంతం కలసి ఉండే
మగడు దొరుకుతాడో లేడోనని
పెదవి అదిరింది
మనసు బెదిరింది
 
దుర్భాషలు దూషణలు
దురాగతాలు దుర్బుద్ధులు
వంచనలు దండనలు
మద్యం మత్తులో మగాళ్ళు చేసే చేష్టలు
పెళ్లి అంటే భయం పుట్టించాయి
 
ఎవరొస్తారో అనే బెంగను
మంచోడే వస్తాడనే ఆశను
ఉరుముల్లో మెరుపుల్లో
చూపిస్తూ ఊరిస్తూ
వాన కురిసింది మళ్ళీ
తలపు తడిసింది తుళ్ళి
 
గారాల పట్టీ నాన్న కుట్టీ
తన బాల్య  స్మృతులను
దాచిపెట్టి మరో దారిపట్టి
మెట్టినింటిని  చేరుతుంది
 
ఏమి చిత్రం ఇంతి యాత్ర
జీవి భావికి దేవుడిచ్చిన
దేహమే కదా ఈ సుమగాత్రి
 
పుట్టింటి పైన బెంగానంతా
పురుటి మంచంపైన వదలి
తాను తల్లై పరిధవిల్లి 
కాల చక్రం తిప్పుతుంది
 
ఎవరో తెలుసా?
ఒకప్పటి ముద్దుల పాపే!