ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అంతర్యానం

Like-o-Meter
[Total: 0 Average: 0]

అరమరికలు లేవనుకున్న ఆకాశానికే

అడ్డుతెరల్లా ప్రశ్నల చినుకులు

పర్వతంలా పరుచుకున్న విషాదపు నిషాలో

ఆశ్రునిక్షిప్తమైన ఆకాశం నిండా

అపశబ్దాలే.

 

అర్ధంకాని అలజడి మధ్య

ఆకాశం నిద్రపోతున్నదంటే నమ్మలేం!

ఆగుతూ, సాగుతూ, పారుతున్న ప్రవాహంలో

ఎవరి ఆత్మకథో

రాలిపోయిన పూల నవ్వులా పలకరిస్తుంది.

నిర్ధారణ అవసరంలేని నిజాలు

నిలువెల్లా తడిసిన ఓ మొగ్గకు

నీతిబోధచేస్తూ నిండుగా నవ్వే

పూలకో నమస్కారం.

 

అర్ధం చేసుకోలేకే కానీ,

అర్ధం లేక కాదు.

చదవాల్సిన పాఠాలు

చెట్టుమీది కాకి చెబుతూనే ఉంటుంది.

కాంతికిరణాలు కూలబడుతాయి

పూసిన గులాబీల లెఖ్ఖ

పూటపూటకు మారుతుంది.

 

ముభావంగా ముడుచుకున్న

ఆకులపై అక్షరాల తడి

దొర్లిపోయే క్షణాల మధ్య

ఇటువైపు నీడలో

నిద్రపోవటం నాకు అలవాటే !!