ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్

అప్పుడప్పుడు…

Like-o-Meter
[Total: 0 Average: 0]

చిరునవ్వుల పెదవులను తగిలించుకు

చీకటి కన్నీళ్ళను గుండె గదిలో భద్రంగా దాచి

ఉషోదయంతో పాటు ఉదయిస్తూంటాను.

అయినా భావోద్వేగాల వల్లరిలో కొట్టుకు పోతూ

అనిశ్చయత చెలియలికట్ట సంయమనాన్ని కోసేసినపుడు

పట్టుకోల్పోయిన మనసు వరద వెల్లువవుతుంది

కట్టలు తెగిన జీవనదిగా పొంగి పొర్లుతుంది.


భయాందోళనల తుఫానులో, ఏకాంతపు సుడిగాలిలో

విలవిల్లాడుతూ నిస్సహాయంగా చేతులుచాపి

ఆపన్న హస్తం కోసం అలమటించిన అమాయకత్వం

చెక్కిళ్ళు తడిసిన కన్నీళ్ళతో తడబాటు చూపుల్తో

ఇంకా ఏమూలో  అజ్ఞాతంగా ఒదిగి మిగిలిపోయింది

ఎంత వెన్నుతట్టి నేనే ధైర్యాన్నని  నాకు నేననుకున్నా

లోలోపల ఏమూలో వెయ్యిమొహాలు పరిహసిస్తూ

నిశాచరులై వెంటాడి వేటాడూతూ …


నిరాశా నిస్పృహల జడివానలో తడిసి కరిగిపోయిన వదనం

పాటలు రాలిపోయిన పూల ఋతువులా ,

రెక్కలు విరిగి విలవిల్లాడే దీపం పురుగుల్లా

పొర్లి పొర్లి రూపం పోగొట్టుకున్న విషాదమవుతుంది

చీకట్లు శపించిన కాళరాత్రిగా మారుతుంది

కన్నీళ్ళు నాచుట్టూ గింగరాలు కొట్టే గద్దలవుతాయి


అయినా ఇదంతా కాస్సేపే … తుఫాను తీసేసాక

నాలో నేను మళ్ళీ శ్వాసించడం మొదలెట్టగానే

విషాద భాగం కుక్కిన పేనులా లోలోపల ఒదిగి పోయాక

వరద తీసిన గోదారిలా అలసిన మనసు సుషుప్తిలో సేదదీరాక

మొహాలన్నీ లోలోపలికి తోసేసి

నన్ను నేను మళ్ళి విజయవంతంగా చిరునవ్వుల్లో చుట్టుకుంటాను